
దరఖాస్తులను చూపుతున్న బాధితుల కుటుంబ సభ్యులు
వాకాడు: వితంతువులకు ప్రధాని మోదీ రూ.20 వేలు మంజూరు చేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తుండడంతో మండలంలోని వితంతువులు దరఖాస్తులు చేత పట్టుకుని రెవెన్యూ కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు. ఇటీవల ఎవరో ఆకతాయిలు ‘నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్’ ద్వారా భర్త చనిపోయిన మహిళల బ్యాంక్ అకౌంట్లలో ప్రధాని మోదీ రూ.20 వేలు జమ చేస్తున్నారని వాట్సప్‌లో మెస్సేజ్ చేశారు. అనంతరం దీన్ని ఆసరాగా తీసుకున్న పలు జెరాక్స్ సెంటర్ల నిర్వాహకులు దరఖాస్తులు తయారు చేసి, విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భర్తను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన మహిళలు ఆశగా ‘మోదీ కానుక’ దరఖాస్తును తీసుకుని, దానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జత చేసి, తహసీల్దార్ కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు.
అక్కడ వీఆర్వోలు సైతం వీటిపై సంతకాలు చేసి, తహసీల్దార్‌కు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో విషయం తెలియని వాకాడు తహసీల్దార్ లావణ్య తొలుత దరఖాస్తులు తీసుకున్నారు. అనంతరం ఉన్నతధికారుల ద్వారా విషయం తెలుసుకున్న ఆమె ‘ఇదంతా బోగస్, దీనిపై మాకు ఎలాంటి జీఓ లేదు’ అని చెప్పి దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో విషయం పూర్తిగా తెలుసుకోకుండా రెవెన్యూ అధికారులు తమను ఇబ్బంది పెట్టారని బాధితులు మండిపడ్డారు. తమ పనులు సైతం మానుకుని ఒక్కో దరఖాస్తుకు రూ.వంద ఖర్చు చేశామని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment