కోవూరు, న్యూస్‌లైన్: దేశానికి పట్టుగొమ్మలైన పల్లెల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించింది. ఆలస్యంగా ఎట్టకేలకు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది. మళ్లీ ఇప్పుడు నిబంధనల పేరుతో పాలనకు అడ్డుతగులుతోంది. పంచాయతీ అభివృద్ధిలో కీలకమైన చెక్‌పవర్‌ను ప్రజల మద్దతుతో ఎన్నికైన సర్పంచ్‌ల పాటు ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులకూ కట్టబెట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సర్పంచ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పల్లెపాలనలో సర్పంచ్‌లది కీలకపాత్ర. క్షేత్రస్థాయిలో నెలకొన్న మౌలికవసతుల సమస్యను పరిష్కరించడంలో వారు క్రియాశీలకపాత్ర పోషిస్తారు. ప్రజలు కూడా తమ సమస్యలను ఎక్కువ శాతం వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటారు. ఈ క్రమంలో గ్రామాల అభివృద్ధికి సంబంధించిన నిధులు ప్రభుత్వం నుంచి బ్యాంకులకు చేరుతాయి. వీటిని చెక్‌ల రూపంలో డ్రా చేస్తారు. గతంలో సర్పంచ్‌కు మాత్రమే చెక్‌పవర్ ఉండేది. ఊరికి కావాల్సిన పనులకు అవసరమైన నిధులను సర్పంచ్ డ్రా చేసి ఖర్చుచేసేవారు. ఈ సంప్రదాయానికి ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. చెక్‌పవర్‌లో సర్పంచ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శులను భాగస్వామ్యం చేసింది.
ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని సర్పంచ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమను ఉత్సవ విగ్రహాలుగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. కుట్రలో భాగంగానే సర్పంచ్‌లు, కార్యదర్శులకు జాయింట్ చెక్‌పవర్‌ను రూపొందించిందని చెబుతున్నారు. గతంలో సర్పంచ్‌లు అనేక ఉద్యమాలు చేసి చెక్‌పవర్‌ను సాధించుకున్నారని, నిబంధనల పేరుతో దానికి కొర్రీలు పెడితే గ్రామాభివృద్ధి స్తంభించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని, లేనిపక్షంలో మరో ఉద్యమానికి తెరలేపుతామని వారు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఎక్కువగా సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. వారిని ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం జాయింట్ చెక్‌పవర్‌ను తెరపైకి తెచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.