వల్లూరు, న్యూస్‌లైన్ : తాను ఎస్‌ఐ పోస్టుకు ఎంపికయ్యానంటూ ఓ కుటుంబాన్ని నమ్మించి మోసం చేసిన ఓ నయవంచకుని కథ ఇది. ఆ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని అందరి సమక్షంలో పెళ్లి చేసుకుని, కొంతకాలం కాపురం చేస్తూ, గర్భవతిగా వుండగా శిక్షణకంటూ ఉడాయించిన ఘటన ఇది. దాదాపు 8 నెలలుగా ఆచూకీ లేకపోవడంతో తాను మోసపోయానని భార్య తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. వివరాలిలా వున్నాయి. వల్లూరు మండలంలోని పైడికాలువకు చెందిన వెంకట సుబ్బయ్య లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. లారీకి వస్తూ పోతూ ఉండగా మరో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న షేక్ మస్తాన్‌తో పరిచయం పెరిగింది.
ఈ క్రమంలో తాను అనాథనని, ఎస్‌ఐ పోస్టుకు ఎంపికయ్యానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని తెలిపాడు. ఆ యువకుని మాటలను నమ్మిన వెంకటసుబ్బయ్య పైడికాలువలోనే వుంటున్న తన చెల్లెలు కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి ప్రయత్నాలు చేశాడు. నలుగురు ఆడ పిల్లల తల్లిగా, భర్తను పోగొట్టుకుని పేదరికంలో వున్న ఆమె తన అన్న మాట మీద నమ్మకంతో మూడో కూతురైన విజయలక్ష్మిని ఇచ్చి బంధువుల సమక్షంలో 2012 ఆగస్టు 15న గండి క్షేత్రంలో వివాహం చేసింది. కొంతకాలం ఆమెతో కొంతకాలం కాపురం సాగించాడు.
ఆమె 5 నెలల గర్భవతిగా వుండగా తనకు ఎస్‌ఐ ట్రైనింగ్ ఆర్డర్ వచ్చిందని, అందుకు గానూ గుజరాత్‌కు వె ళ్లాల్సి వుందని నమ్మించాడు. అయితే అక్కడ కొంత డబ్బు కట్టాలని చెప్పి భార్య మెడలో వున్న 6 తులాల బంగారు ఆభరణాలతో బాటు, అతని వద్ద వున్న రూ.30 వేలను, లారీ ఓనర్ దగ్గర వెంకటసుబ్బయ్య హా మీగా వుండి ఇప్పించిన రూ.20 వేలను, బంధువుల దగ్గర మరో రూ.20 వేలను తీసుకుని వెళ్లాడు. శిక్షణ పూర్తి చేసుకొని వస్తాడని భర్త కోసం ఎదురు చూసిన విజయలక్ష్మి ఐదు నెలల క్రితం ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది.
ఇంత కాలంగా భర్త ఫోన్ కూడా చేయకపోవడమే కాక, అతని ఫోన్ నెంబర్ స్విచ్‌ఆఫ్ చేసి వుంటుండడంతో తాను మోసపోయాయని తెలుసుకున్న విజయలక్ష్మి శుక్రవారం వల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వారి పెళ్లి ఫొటోలతోపాటు, పోలీస్ డ్రస్‌లతో తీయించుకున్న ఫొటోలను పోలీసులకు అందజేసింది. తనకు న్యాయం చేయాలని తన 5నెలల పసి బిడ్డతో వేడుకుంటోంది. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరసింహరావు తెలిపారు. అతని వివరాలు తెలిసిన వారు 9440796916 నంబరుకు తెలియజేయాలని ఆయన కోరారు.
నయ వంచకుడు
Published Sat, Oct 12 2013 2:20 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
Advertisement
Advertisement