విజయనగరం పూల్‌భాగ్: సాక్షరభారత్ కార్యక్రమాన్ని ఎత్తివేస్తూ విడుదల చేసిన జీఓను ఉపసంహరించుకోవాలని సాక్షరభారత్ సమన్వయకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ నేతృత్వంలో సుమారు వెయ్యి మంది సమన్వయకర్తలు బుధవారం స్థానిక మెసానిక్ టెంపుల్ నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఒక్కసారిగా జెడ్పీ గేట్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు రెండు గంటల పాటు మండుటెండను సైతం లెక్కచేయకుండా సమన్వయకర్తలంతా రోడ్డుపైన కూర్చున్నారు. ఒక వైపు జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశం జరుగుతుండడంతో జెడ్పీలోకి ప్రవేశించేందుకు అధికారులు, రాజకీయనాయకులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి సమన్వయకర్తలు తమ సమస్యలు విన్నవించారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణిని అడ్డుకుని వినతిపత్రం అందజేశారు. దీనికి ఆమె స్పందిస్తూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ, సాక్షరభారత్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 1800 మంది సమన్వయకర్తలు పనిచేస్తున్నారన్నారు. వీరంతా ప్రత్యేక కమిటీల ద్వారా నియమించబడి గ్రామీణ ప్రాంతాల్లో వయోజనులైన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడంతో పాటు విద్యాకేంద్రాలను నిర్వహిస్తున్నారని చెప్పారు.
దీంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వచ్ఛభారత్, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, జన్‌ధన్ ఖాతాలు ప్రారంభం, గ్యాస్ సబ్సిడీపై అవగాహన, ఎన్‌టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, బడి పిలుస్తోంది, వనం–మనం, ఓటర్ల నమోదు కార్యక్రమాలతో పాటు వివిధ సర్వేల నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించే సమన్వయకర్తలను అకస్మాత్తుగా తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సాక్షరభారత్ కేంద్రాల ఎత్తివేత విషయంలో పునరాలోచించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఎం. రమేష్, లక్ష్మణరావు, శ్రీనివాస్, గుర్ల శ్రీను, జిల్లా నలుమూలల నుంచి సమన్వయకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment