Saakshar Bharat
-
మండుటెండను సైతం లెక్కచేయకుండా...
విజయనగరం పూల్‌భాగ్: సాక్షరభారత్ కార్యక్రమాన్ని ఎత్తివేస్తూ విడుదల చేసిన జీఓను ఉపసంహరించుకోవాలని సాక్షరభారత్ సమన్వయకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ నేతృత్వంలో సుమారు వెయ్యి మంది సమన్వయకర్తలు బుధవారం స్థానిక మెసానిక్ టెంపుల్ నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఒక్కసారిగా జెడ్పీ గేట్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు రెండు గంటల పాటు మండుటెండను సైతం లెక్కచేయకుండా సమన్వయకర్తలంతా రోడ్డుపైన కూర్చున్నారు. ఒక వైపు జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశం జరుగుతుండడంతో జెడ్పీలోకి ప్రవేశించేందుకు అధికారులు, రాజకీయనాయకులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి సమన్వయకర్తలు తమ సమస్యలు విన్నవించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణిని అడ్డుకుని వినతిపత్రం అందజేశారు. దీనికి ఆమె స్పందిస్తూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ, సాక్షరభారత్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 1800 మంది సమన్వయకర్తలు పనిచేస్తున్నారన్నారు. వీరంతా ప్రత్యేక కమిటీల ద్వారా నియమించబడి గ్రామీణ ప్రాంతాల్లో వయోజనులైన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడంతో పాటు విద్యాకేంద్రాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. దీంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వచ్ఛభారత్, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, జన్‌ధన్ ఖాతాలు ప్రారంభం, గ్యాస్ సబ్సిడీపై అవగాహన, ఎన్టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, బడి పిలుస్తోంది, వనం–మనం, ఓటర్ల నమోదు కార్యక్రమాలతో పాటు వివిధ సర్వేల నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించే సమన్వయకర్తలను అకస్మాత్తుగా తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సాక్షరభారత్ కేంద్రాల ఎత్తివేత విషయంలో పునరాలోచించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఎం. రమేష్, లక్ష్మణరావు, శ్రీనివాస్, గుర్ల శ్రీను, జిల్లా నలుమూలల నుంచి సమన్వయకర్తలు పాల్గొన్నారు. -
అక్షరాలు నేర్పని సాక్షరభారత్
► కొరవడిన పర్యవేక్షణ ► చెత్తకుప్పల్లో పుస్తకాలు ముత్తారం: వయోజనులను విద్యావంతులుగా చేసి దేశంలో అక్షరాస్యతశాతాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాక్షరభారత్ నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పలేకపోతోంది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా మారింది. మండల పరిధిలోని ఏ ఒక్క గ్రామంలో సాక్షరభారత్ కేంద్రాలు పనిచేస్తున్న దాఖలాలు లేవు. గ్రామపంచాయతీకి రెండు చొప్పున 28 సాక్షారభారత్ కేంద్రాలు ఉన్నాయి. ఒక మండల కోఆర్డినేటర్, 28 మంది గ్రామ కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. మండల కోఆర్డినేటర్‌కు రూ.8వేలు, గ్రామ కోఆర్డినేటర్‌కు ఒక్కొక్కరికి రూ.2500 చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. ఇలా ప్రతీనెలా కేంద్ర ప్రభుత్వం రూ.78వేలు ఖర్చు చేస్తుంది. 2010 సెప్టెంబర్ నుంచి ప్రారంభించగా ఏడు సంవత్సరాలు గడుస్తుండగా ఇప్పటికి దాదాపు రూ.65 లక్షలు పైగా ఖర్చు చేసింది. కనీసం 65 మంది నిరక్షరాస్యులను పూర్తిస్థాయిలో అక్షరాస్యులను చేయలేదనే విమర్శలున్నాయి. అధికారుల రికార్డుల్లో మాత్రం ప్రతీకేంద్రం నిత్యం నిర్వహిస్తున్నట్లు చూపిస్తున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితం సాక్షరభారత్ కేంద్రాల్లో ఫర్నీచర్ కొనుగోలు కోసం మంజూరైన సుమారు రూ.1.20లక్షలు గోల్మాల్ జరిగినా సంబంధిత అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ప్రతీ సాక్షరభారత్ కేంద్రానికి కుర్చీలు, జంబుఖానా, క్రీడాసామగ్రి మంజూరు చేయగా వాటిని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలనే నిబంధన ఉన్నా అవి ఎక్కడికెళ్లాయో ఇప్పటివరకు తెలియడం లేదు. కేంద్రాల నిర్వహణ సరిగా లేకపోవడంతో అక్కడ పంపిణీ చేసిన పుస్తకాలను అభ్యాసకులు చెత్తకుప్పల్లో పడవేస్తున్నారు. దేశంలో అక్షరాస్యతను పెంపొందించాలని కేంద్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సాక్షరభారత్ కేంద్రాలు రోజు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
సాక్షరభారత్ కో ఆర్డినేటర్ ఆత్మహత్యాయత్నం
శాయంపేట : తనకు 16 నెలలుగా వేత నం ఇవ్వకుండా ఎంపీపీ రమాదేవి అడ్డుకుంటున్నారని సాక్షరభారత్ మండల కో ఆర్డినేటర్ దైనంపల్లి కుమారస్వామి ఎంపీడీఓ కార్యాలయం ఎదుటే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శాయంపేటలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. 2014 డిసెంబర్ 21న(ఆదివారం) మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా కుమారస్వామి హాజరుకాలేదు. దీంతో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడంటూ కుమారస్వామిని విధుల నుంచి తొలగిస్తూ తీర్మా నం చేశారు. ఈ విషయూన్ని ఆయనకు 2015 మార్చి 27న లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించినా, ఎవరూ పట్టించుకోకపోవడంతో తనను అన్యాయంగా తొ లగించారంటూ ఎంపీపీ, ఎంపీడీఓపై కో ర్టులో కేసు వేయగా, కుమారస్వామిని విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ వేత నాలు చెల్లించాలని ఆర్డర్ ఇచ్చింది. దీంతో 2015 మార్చి11న ఎంపీపీ, ఎంపీడీఓకు జాయినింగ్ రిపోర్టు ఇచ్చిన కుమారస్వామి నాటి నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, పెండింగ్ వేతనాలు చెల్లిం చాలంటూ మార్చి 22న కుమారస్వామి భార్యా పిల్లలతో కలిసి నిరాహార దీక్ష చేపట్టగా, ఎస్సై ప్రవీణ్‌కుమార్ ఆయనతో మాట్లాడి దీక్ష విరమింపజేశారు. అనంతరం కోర్టు ఆదేశాల ప్రకారం రావాల్సిన 16 నెలల వేతనాన్ని ఇవ్వాలంటూ ఎంపీడీవో భద్రునాయక్ అడల్ట్ ఎడ్యుకేషన్ డీడీకి సిఫారసు చే శారు. అయితే కుమారస్వామి తనకు సమాచారం లేకుండా విధులకు ైగె ర్హాజరయ్యూడని, పని చేయని సమయంలో వేతనాలు ఎలా ఇస్తామని గత 28న జరిగిన సమావేశంలో ఎంపీపీ రమాదేవి ప్రశ్నించారు. కాగా, తనకు రావాల్సిన వేతనాల గురించి కుమారస్వామి ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మాట్లాడ గా, ఎంపీపీ చెప్పడం వల్లే వేతనాలు ఆపామని వారు చెప్పారు. దీంతో మనస్తాపానికి గురై ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. స్థానికులు సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న సీఐ శ్రీనివాస్ కుమారస్వామిని ఆపి, కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ విషయమై ఎంపీపీ రమాదేవిని ‘సాక్షి’ వివరణ కోరగా, కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత తిరి గి విధుల్లో చేరుతున్నట్లు కుమారస్వా మి రిపోర్టు ఇవ్వలేదని చెప్పారు. పని చేయనప్పుడు వేతనాలు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. -
భద్రమ్మా.. నీ పట్టుదలకు సలాం
రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకోనున్న మహిళ జగద్గిరిగుట్ట: నిరక్ష్యరాసురాలైన ఓ మహిళ ఇష్టపడి చదవడం రాయడం నేర్చుకుని అక్షరాస్యురాలిగా మారి ఈ నెల 8న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఢిల్లీలో ప్రశంసాపత్రం అందుకోనుంది. భద్రమ్మ అనే మహిళ సాక్షర భారత్ కింద చదువు నేర్చుకుంది. కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి గ్రామం సాయినగర్‌కు చెందిన భద్రమ్మ కొన్ని సంవత్సరాలుగా సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్ అనురాధ వద్ద శిక్షణ తీసుకుని చదువు నేర్చుకుంది. దీంతో రంగారెడ్డి జిల్లా అధికారులు కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి నుంచి భద్రమ్మను ఎంపిక చేసి శనివారం ఢిల్లీకి తీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆగం పాండు, స్థానిక నాయకులు భద్రమ్మను సన్మానించి ఢిల్లీకి పంపారు. -
అక్షరం నేర్పితే ఒట్టు !
నిర్లక్ష్యంలో సాక్షరభారత్ నంబర్ వన్ దశాబ్దాల తరబడీ నెరవేరని లక్ష్యం ఇంకా 5.38 లక్షల మంది నిరక్షరాస్యులే పట్టించుకోని అధికారులు ఏటా కోట్లాది రూపాయల వృథా వయోజనులకు అక్షరాలు నేర్పేందుకు వయోజన విద్య, సాక్షరభారత్ పేర్లతో దశాబ్దాల తరబడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అక్షరాస్యత శాతం ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగా ఉంది. క్షేత్రస్థాయిలో అధికారులు ఈ కార్యక్రమాన్ని పట్టించుకోకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో లక్ష్యం నెరవేరడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్న కోట్లాది రూపాయల నిధులు నిరుపయోగమవుతున్నాయి. అసలు అక్షరాస్యత కార్యక్రమం కొనసాగుతున్న విషయం గ్రామీణులకు తెలియడం లేదు. నోటు పుస్తకాలు, పేపర్లు, పెన్నులు, పెన్సిళ్ల పేరుతో మరో కోటి రూపాయలకు పైగా వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి రూ.8 కోట్ల వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యయం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 75 శాతం నిధులు ఇస్తుండగా, మిగిలిన 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. అక్షరాలు నేర్పని వీసీఓలు నెలకు రూ.2వేలు గౌరవవేతనం తీసుకుంటున్న 95 శాతానికి పైగా వీసీఓలు వయోజనులకు అక్షరాలు నేర్పడం లేదన్న ఆరోపణలున్నాయి. అసలు వారు గ్రామాలకే వెళ్లడం లేదని తెలుస్తోంది. వీరిని పర్యవేక్షించాల్సిన ఎంసీఓలదీ అదే పరిస్థితి. ఇరువురు వేలాది రూపాయలు గౌరవవేతనం తీసుకుంటూ నిరక్షరాస్యులకు అక్షరం ముక్క నేర్పడం లేదు. ఏ గ్రామంలో విచారించినా ఇదే విషయం చెబుతున్నారు. అసలు అక్షరాస్యత కార్యక్రమం కొనసాగుతున్న విషయం కూడా ఆయా గ్రామాల్లోని నిరక్షరాస్యులకు తెలియడం లేదు. పట్టించుకోని ఉన్నతాధికారులు అక్షరాస్యత కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన డీడీ, ఏపీఓ, సీపీఓ తదితర ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. వారు గ్రామాలకు వెళ్లి పర్యవేక్షించే పరిస్థితి లేదు. కొంతమంది అధికారులు వీసీఓలు, ఎంసీఓలతో కలిసి నిధులు బొక్కుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఉత్తపుణ్యానికొచ్చే జీతాలే కదా అనుకుంటూ క్షేత్రస్థాయి సిబ్బంది కొందరు ఉన్నతాధికారులకు వాటాలు సమర్పిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని నిరక్షరాస్యులు కోరుతున్నారు. -
సాక్షర భారత్ నిధులు స్వాహా
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మండలంలో సాక్షర భారత్ నిధులు స్వాహా అయ్యాయి. సాక్షర భారత్ మండల కో-ఆర్డినేటరు శంకర్‌నారయణ దొంగ సంతకాలు చేసి సుమారు రూ.19,35,480లను స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, గ్రామ కార్యదర్శులకు సంబంధం లేకుండానే నేరు చెక్కులను బ్యాంకులలో డ్రా చేసుకుని నిధులను స్వాహా చేసినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం సాక్షర భారత్ కో ఆర్డినేటర్‌గా శంకర్‌నారాయణ నియమితులయ్యారు. మొదట్లో ఇతని ప్రవర్తనపై అనుమానం రావడంతో జిల్లా స్థాయి అధికారులు విచారణ చేపట్టారు. ఆ సమయంలో రూ. 1.45 లక్షలు స్వాహా చేసినట్లు బయటపడింది. ఆ డబ్బును అతని నుంచి రికవరీ చేశారు. మళ్లీ విచారణ చేయడంతో పెద్ద మొత్తంలో నిధులను స్వాహా చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్య కాలంలో శంకర్ నారాయణ సుమారు రూ.19,35,480లను డ్రా చేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా రిక వరీ చేయాలని అధికారులు భావించారు. అంత డబ్బు తన వద్ద లేదని శంకర్‌నారాయణ చెప్పడంతో విషయం బయటకు పొక్కింది. ఆడిట్ ఉందని చెప్పి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శుల నుంచి చెక్కు బుక్‌లు తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టు నుంచి చెక్కులను డ్రా చేస్తూ వచ్చాడు. ప్రభుత్వ చెక్కుల ద్వారా పది వేలు లోపు మాత్రమే డ్రా చేయాల్సి ఉంది. ఇతను మాత్రం ఒక్కొక్క చెక్కు నుంచి రూ.35వేలు కూడా డ్రా చేసినట్లు సమాచారం. ఎస్బీఐ అధికారులకు కూడా ఇందులో భాగం ఉన్నట్లు గ్రామ కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా సాక్షర భారత్ నుంచి చెక్కులు డ్రా చేయాలంటే ఈఓపీఆర్డీ, గ్రామ కార్యదర్శి, ఎంపీడీఓ సంతకాలు ఉండాలి. వీరి సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని గ్రామకార్యదర్శులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై ఎంపీడీఓ జయసింహను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దీనిపై విచారణ చేస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో తాను ఇక్కడ లేనని ఆ సమయంలో ఇది జరిగిందన్నారు. -
అక్కరకు రాని యజ్ఞం
విజయనగరం అర్బన్: సంపూర్ణ అక్షరాస్యతే ధ్యేయంగా ప్రారంభించిన అక్షరయజ్ఞం అక్కరకు రాకుండా పోయింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో సాక్షర భారత్ కేంద్రాలన్నీ అక్షరయజ్ఞాన్ని మధ్యలోనే వదిలేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో సాక్షరభారత్ క్షేత్రస్థాయి కేంద్రాల చరిత్ర ముగిసినట్లేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పథక క్షేత్రస్థాయి కో-ఆర్డినేటర్ల వేతనాల పంపిణీ నుంచి కేంద్రాలకు పుస్తకాలు, నిర్వహణ ఖర్చుల వరకు అవసరమైన నిధులు ఏడు నెలలుగా కేటాయించ లేదు. జిల్లాలో సంబంధిత శాఖ బ్యాంక్ ఖాతాలో ఉన్న కేంద్రప్రభుత్వ నిధులు రూ. 5 కోట్లు సైతం ఉమ్మడి రాష్ట్ర పాలన వ్యవహారం పేరుతో వెనక్కి తీసుకున్నారు. చివరికి జిల్లా శాఖాధికారి పర్యవేక్షణకు వినియోగించే నాలుగు చక్రాల వాహనాన్ని కూడా తీసుకున్నారు. దీంతో పథక నిర్వహణకు సంబంధించి ఒక్క అడుగుకూడా ముందుకు పడని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో 2010 సెప్టెంబర్‌లో జిల్లావ్యాప్తంగా 927 పంచాయతీల్లో సాక్షర భారత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వయోజనులను అక్షరాస్యులు గా తీర్చిదిద్దాలన్నది సాక్షర భారత్ ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథ కం, మహిళా సంఘాలకు చెందిన సభ్యులకు ఇది ఎంతో ఉపయోగకరం. ఉదయం పూట అం దరికీ పత్రికలు, కథల పుస్తకాలు చదివి వినిపిం చి, వారంతా పనులకు వెళ్లి తిరిగివచ్చాక రాత్రి వేళల్లో అక్షరాలు నేర్పించడం చేపడతారు. వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే మండల, గ్రామ కో-ఆర్డినేటర్లకు ఇచ్చే స్వల్ప వేతనం కూడా నెలల తరబడి అందడం లేదు. గతంలో కొంత మేర మంచి ఫలితాలే వచ్చినా క్రమక్రమంగా వీటి నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. గ్రామాల్లో వయోజనులైన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో జిల్లావ్యాప్తంగా 1,846 సాక్షర భారత కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ కోసం మండల స్థాయిలో మండల కో-ఆర్టినేటర్, గ్రామజనాభాను బట్టి గ్రామస్థాయిలో గ్రామ కో-ఆర్టినేటర్‌ను నియమించారు. మండల కో- ఆర్టినేటర్కు గౌరవ వేతనం కింద నెలకు రూ.6 వేలు, గ్రామ కో-ఆర్డినేటర్‌కు రూ.2 వేలు చెల్లించేవారు. అలాగే కేంద్రాల నిర్వహణకు నెలకు రూ.300 చొప్పున మంజూరు చేసే వారు. కానీ కేంద్రాల నిర్వహణ నామమాత్రం కావడంతో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అధికారుల పర్యవేక్షణ కొరవడడం, కో-ఆర్డినేటర్లకు సక్రమంగా వేతనాలు రాకపోవడం తదితర కారణాలతో కేంద్రాలు మూతపడే దశకు చేరుకున్నాయి. ఆరంభ శూరత్వమే... సాక్షరభారత్ మొదటి రెండు దశల్లో మందకొడిగా సాగినా మూడు, నాలుగో దశల్లో బాగాజరిగింది. జిల్లావ్యాప్తంగా నాలుగవ దశలో సుమారు 80 శాతంతో 5.7 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్ది రికార్డు సృష్టిం చామని అధికారులు చెబుతున్నా ఆ సంఖ్యలు కూడా నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. వయోజనులైన నిరక్షరాస్యులను కేంద్రాలకు రప్పించడంలో అధికారులు విఫలం కావడం, చదువు నేర్చుకోవడానికి ప్రజలు ఆసక్తి చూడకపోవడం, కో-ఆర్డినేటర్లకు సక్రమంగా వేతనాలు అందకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కేంద్రాల ఉనికి ప్రశ్నార్థకమైంది. -
పట్టణ ప్రాంతాల్లో ‘సాక్షర భారత్’ బంద్
దుబ్బాక, న్యూస్‌లైన్: జిల్లాలో 30 సాక్షర భారత్ కేంద్రాలు మూతపడ్డాయి. మున్సిపాలిటీల ఏర్పాటు వల్లే ఈ కేంద్రాలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం గతనెల ఆదేశాలు జారీ చేసింది. మున్సిపాలిటీ ఏర్పాటుతో అభివృద్ధి దేవుడెరుగు కానీ గ్రామీణ పథకాలను కోల్పోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇందులో సాక్షర భారత్ కేంద్రాలు కూడా ఉండటంతో కోఆర్డినేటర్లు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నిరక్షరాస్యులను సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం 2008లో సాక్షర భారత్ కేంద్రాలను ప్రవేశపెట్టింది. 2010 అక్టోబరు 2న గాంధీ జయంతి రోజున ఈ పథకాన్ని ప్రారంభించింది. మొదట్లో ఈ పథకం కేవలం రెండేళ్లు మాత్రమే కొనసాగించాలనుకుంది. పూర్తి స్థాయిలో అక్షరాస్యతను సాధించకపోవడంతో ప్రభుత్వం ఈ పథకాన్ని 2017 వరకు పొడిగించింది. సాక్షర భారత్ కేంద్రాల నిర్వహణకు అయ్యే ఖర్చును 75 శాతం కేంద్ర ప్రభుత్వం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలో 1,059 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇందుకు ఒక్కో కేంద్రానికి ఇద్దరు చొప్పున కోఆర్డినేటర్లను నియమించారు. ఈ కేంద్రాల ద్వారా జిల్లాలో 2,118 మందికి ఉపాధి కల్పించారు. కోఆర్డినేటర్‌కు నెలకు రూ.2 వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నారు. ఆందోళనలో కోఆర్డినేటర్లు.. ప్రస్తుతం మున్సిపాలిటీల ఏర్పాటు, మున్సిపాలిటీలను అప్‌గ్రేడ్ చేయటంతో జిల్లాలో 30 సాక్షర భారత్ కేంద్రాలను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో 30 కేంద్రాల్లో పని చేస్తున్న 60 మంది కోఆర్డినేటర్లు ఉపాధిని కోల్పోయారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా వీరి పరిస్థితి తయారైంది. ఏడాది కాలంగా గౌరవ వేతనాలను అందుకోక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరికి ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వీరిని మరింత ఆందోళనకు గురిచేసింది. తొలగించిన కేంద్రాలు ఇవే... సిద్దిపేట మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన ప్రశాంత్‌నగర్, గాడిచర్లపల్లి, నర్సాపూర్, హన్మాన్నగర్, రంగధాంపల్లి, ఇమామ్‌బాద్ గ్రామాల్లో సాక్షరభారత్ కేంద్రాలను తొలగించారు. నూతనంగా ఏర్పాటైన నగర పంచాయతీలైన గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌లోని గజ్వేల్, ప్రజ్ఞాపూర్, ముట్రాజ్‌పల్లి, క్యాసార ం గ్రామాలు, దుబ్బాక పరిధిలోని దుబ్బాక, మల్లాయిపల్లి, చెల్లాపూర్, దుంపలపల్లి, చేర్వాపూర్, ధర్మాజీపేట, లచ్చపేట గ్రామాలున్నాయి. చేగుంట పరిధిలోని చేగుంట, పొలంపల్లి, వడియారం, రెడ్డిపల్లి, వల్లూరు, రుక్మాపూర్, అనంతసాగర్, ఉట్టి తిమ్మాయిపల్లి, చిన్నశివనూర్, చిట్టోజీపల్లి, కర్ణలపల్లి, అందోల్ పరిధిలోని అందోల్, జోగిపేట గ్రామాల్లో సాక్షరభారత్ కేంద్రాలను తొలగించారు. మాకు ఉపాధి చూపాలి.. మున్సిపాలిటీల్లో సాక్షర్‌భారత్ కేంద్రాలను తొలగించడం సరైంది కాదు. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో ప్రజలు పూర్తి స్థాయి అక్షరాస్యులు లేరు. ఈ కేంద్రాలను తొలగించటంతో మేం ఉపాధిని కోల్పోయాం. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయం కల్పించాలి. - దేవయ్య, సాక్షరభారత్ కోఆర్డినేటర్ కేంద్రాల రద్దు వాస్తవమే.. మున్సిపాలిటీల్లో కలిసిన గ్రామ పంచాయతీల్లో సాక్షరభారత్ కేంద్రాలను తొల గించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిని రద్దు చేసి ఆ కేంద్రాల్లోని సామగ్రిని స్వాధీనపరుచు కోవాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశాం. తొలగించిన కేంద్రాల్లో కోఆర్డినేటర్లకు ఉపాధికి సంబంధించిన విషయం మా పరిధిలో లేదు. - ఉషామార్తా స్వర్ణలత, సాక్షరభారత్ డీడీ, సంగారెడ్డి