అక్షరం నేర్పితే ఒట్టు !
నిర్లక్ష్యంలో సాక్షరభారత్ నంబర్ వన్
దశాబ్దాల తరబడీ నెరవేరని లక్ష్యం
ఇంకా 5.38 లక్షల మంది నిరక్షరాస్యులే
పట్టించుకోని అధికారులు
ఏటా కోట్లాది రూపాయల వృథా
వయోజనులకు అక్షరాలు నేర్పేందుకు వయోజన విద్య, సాక్షరభారత్ పేర్లతో దశాబ్దాల తరబడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అక్షరాస్యత శాతం ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగా ఉంది. క్షేత్రస్థాయిలో అధికారులు ఈ కార్యక్రమాన్ని పట్టించుకోకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో లక్ష్యం నెరవేరడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్న కోట్లాది రూపాయల నిధులు నిరుపయోగమవుతున్నాయి. అసలు అక్షరాస్యత కార్యక్రమం కొనసాగుతున్న విషయం గ్రామీణులకు తెలియడం లేదు.
నోటు పుస్తకాలు, పేపర్లు, పెన్నులు, పెన్సిళ్ల పేరుతో మరో కోటి రూపాయలకు పైగా వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి రూ.8 కోట్ల వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యయం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 75 శాతం నిధులు ఇస్తుండగా, మిగిలిన 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది.
అక్షరాలు నేర్పని వీసీఓలు
నెలకు రూ.2వేలు గౌరవవేతనం తీసుకుంటున్న 95 శాతానికి పైగా వీసీఓలు వయోజనులకు అక్షరాలు నేర్పడం లేదన్న ఆరోపణలున్నాయి. అసలు వారు గ్రామాలకే వెళ్లడం లేదని తెలుస్తోంది. వీరిని పర్యవేక్షించాల్సిన ఎంసీఓలదీ అదే పరిస్థితి. ఇరువురు వేలాది రూపాయలు గౌరవవేతనం తీసుకుంటూ నిరక్షరాస్యులకు అక్షరం ముక్క నేర్పడం లేదు. ఏ గ్రామంలో విచారించినా ఇదే విషయం చెబుతున్నారు. అసలు అక్షరాస్యత కార్యక్రమం కొనసాగుతున్న విషయం కూడా ఆయా గ్రామాల్లోని నిరక్షరాస్యులకు తెలియడం లేదు.
పట్టించుకోని ఉన్నతాధికారులు
అక్షరాస్యత కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన డీడీ, ఏపీఓ, సీపీఓ తదితర ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. వారు గ్రామాలకు వెళ్లి పర్యవేక్షించే పరిస్థితి లేదు. కొంతమంది అధికారులు వీసీఓలు, ఎంసీఓలతో కలిసి నిధులు బొక్కుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఉత్తపుణ్యానికొచ్చే జీతాలే కదా అనుకుంటూ క్షేత్రస్థాయి సిబ్బంది కొందరు ఉన్నతాధికారులకు వాటాలు సమర్పిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని నిరక్షరాస్యులు కోరుతున్నారు.