Telangana Banks Neglecting Agriculture Loan Farmers - Sakshi
Sakshi News home page

సాగు 78% ... రుణం 20%

Published Tue, Aug 3 2021 1:28 AM | Last Updated on Tue, Aug 3 2021 11:42 AM

Telangana: Banks Are Negligent In Giving Crop Loans To Farmers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు నిర్లక్ష్యం చూపుతున్నాయి. వాస్తవంగా సీజన్‌ ప్రారంభంలోనే రైతులకు విరివిగా రుణాలివ్వాలి. ఆ ప్రకారం జూన్‌లో ప్రారంభమయ్యే వానాకాలం సీజన్‌కు మే నెల నుంచే రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ, రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు. ఇక బ్యాంకర్లపై ఒత్తిడి తేవడంలోనూ వ్యవసాయ శాఖ వైఫల్యం కనిపిస్తోంది. దీంతో అన్నదాతలు గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేయాల్సి వస్తోంది. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశాల్లో ప్రభుత్వం రైతు రుణాల విషయం ప్రస్తావిస్తున్నా ఎలాంటి మార్పు రావడంలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకులు రుణ లక్ష్యాలను ఎందుకు పెంచుకుంటూ పోతున్నాయో అంతుబట్టడంలేదని వ్యవసాయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది వానాకాలం సీజన్‌ ప్రారంభమై రెండు నెలలైనా.. సాగు గణనీయంగా ఉన్నా.. రుణాలు ఇవ్వడానికి అనాసక్తి చూపిస్తున్నాయి. వానాకాలం పంటల సాగు ఇప్పటివరకు 78 శాతం అయినా, రుణాలు మాత్రం 20 శాతానికే పరిమితం కావడంపై విమర్శలు వస్తున్నాయి.  

ఇచ్చింది రూ.7 వేల కోట్లే...
రాష్ట్రంలో నీటి వనరులు గణనీయంగా పెరిగాయి. సాగు నీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో రెండుమూడేళ్లుగా వ్యవసాయ పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో 63 లక్షల మంది రైతులుంటే... అందులో 65 శాతం మంది బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నారు. మిగిలిన 35 శాతం మందికి రుణాలు అందక ప్రైవేట్‌గా తెచ్చుకుంటున్నారు. వాటికి అధిక వడ్డీలు చెల్లిస్తున్నారు. ఇక వానాకాలం పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.16 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 90.98 లక్షల (78%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇదిలా ఉంటే.. 2021–22లో రూ.59,440 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఈ సీజన్‌కు రూ.35,665 కోట్లు ఇవ్వాలనుకున్నారు. కానీ, ఇప్పటివరకు రూ. 7 వేల కోట్ల (20%) మేరకే రుణాలు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. కొన్నిచోట్ల బ్యాంకులు రైతుల నుంచి పాస్‌ పుస్తకాలు తీసుకొని పంట రుణాలు ఇస్తున్నాయి. ఇక రైతుబంధుకు, బ్యాంకు రుణాలకు నోచుకోని కౌలు రైతుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. వీరికి ప్రైవేట్‌ రుణాలు తప్ప మరో ఆధారమే లేదు. ఓ అంచనా ప్రకారం.. ఇప్పటివరకు రైతులు దాదాపు రూ.4,500 కోట్ల మేర ప్రైవేట్‌ అప్పులు చేయడం పరిస్థితిని తెలియజేస్తోంది.  

రుణమాఫీతోనైనా మారేనా?
లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని గత ఎన్నికలకు ముందు ప్రభుత్వం హామీయిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గతేడాది రూ. 25 వేల వరకు మాఫీ చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రుణమాఫీ కోసం రూ.5,225 కోట్లు కేటాయించింది. ఇప్పుడు రూ.50 వేల వరకు రుణాలను మాఫీ చేయనుంది.  అయితే రుణమాఫీ సొమ్ము పేరుకుపోయిందన్న భావనతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. దీంతో కొన్ని చోట్ల రైతుబంధు సొమ్మును కూడా జమ చేసుకున్నాయి. ఇప్పటికైనా బ్యాంకులు తీరు మార్చుకొని సీజన్‌లో ఇవ్వాల్సిన రుణాలను ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.  

బడ్జెట్‌ లేదన్నారు..
నాకు రెండు ఎకరాల భూమి ఉంది. వరి పండిస్తున్నా. పంట పెట్టుబడి కోసం సహకార సంఘంలో రుణం అడిగితే బడ్జెట్‌ లేదని చెప్పారు. కమర్షియల్‌ బ్యాంకులో రుణం కావాలంటే బీమా చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. రుణం దొరకడం ఎంతో కష్టంగా మారింది. – తెడ్డు లక్ష్మి, మోర్తాడ్, నిజామాబాద్‌ జిల్లా 

లేనిపోని కొర్రీలు
బ్యాంకుల్లో పంట రుణం కావాలంటే లేనిపోని కొర్రీలు పెడుతున్నారు. బీమా చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. బీమా ప్రీమియం పెద్ద మొత్తంలో ఉంది. దీంతో బ్యాంకు రుణం అంటేనే విరక్తి కలుగుతోంది.
– కిషన్, మోర్తాడ్, నిజామాబాద్‌ జిల్లా 

రెన్యువల్‌ చేసుకోమంటున్నారు
రెండెకరాల పొలంలో పం ట సాగు కోసం మూడేళ్ల క్రితం ఎస్‌బీఐలో రూ.62 వేల రుణం తీసుకున్నా. కొత్త రుణానికి వెళ్తే బ్యాం కు అధికారులు ఇవ్వడానికి వీల్లేదంటున్నారు. అడిగతేæపాత రుణం రెన్యువల్‌ చేసుకుంటే తప్ప కొత్త రుణం ఇవ్వలేమంటున్నారు. 
– హన్మంతు, మాచన్‌పల్లి, మహబూబ్‌నగర్‌ రూరల్‌ 

బ్యాంకర్లు ఇవ్వడం లేదు
నాకు ఆరెకరాల పొలం ఉంది. గట్టు మండల కేం ద్రంలోని ఎస్బీఐలో రు ణంకోసం దరఖాస్తు చే శా. ఏడాది కాలంగా తిరుగుతున్నా ఇప్పటివరకు పైసా ఇవ్వలేదు. అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవడం లేదు. దీంతో బయటనే వడ్డీకి అప్పు తీసుకోవాల్సి వచ్చింది.     
– ఆంజనేయులు, ఎల్లందొడ్డి, గట్టు, జోగులాంబ గద్వాల   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement