దుబ్బాక, న్యూస్‌లైన్: జిల్లాలో 30 సాక్షర భారత్ కేంద్రాలు మూతపడ్డాయి. మున్సిపాలిటీల ఏర్పాటు వల్లే ఈ కేంద్రాలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం గతనెల ఆదేశాలు జారీ చేసింది. మున్సిపాలిటీ ఏర్పాటుతో అభివృద్ధి దేవుడెరుగు కానీ గ్రామీణ పథకాలను కోల్పోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇందులో సాక్షర భారత్ కేంద్రాలు కూడా ఉండటంతో కోఆర్డినేటర్లు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నిరక్షరాస్యులను సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం 2008లో సాక్షర భారత్ కేంద్రాలను ప్రవేశపెట్టింది. 2010 అక్టోబరు 2న గాంధీ జయంతి రోజున ఈ పథకాన్ని ప్రారంభించింది. మొదట్లో ఈ పథకం కేవలం రెండేళ్లు మాత్రమే కొనసాగించాలనుకుంది. పూర్తి స్థాయిలో అక్షరాస్యతను సాధించకపోవడంతో ప్రభుత్వం ఈ పథకాన్ని 2017 వరకు పొడిగించింది. సాక్షర భారత్ కేంద్రాల నిర్వహణకు అయ్యే ఖర్చును 75 శాతం కేంద్ర ప్రభుత్వం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలో 1,059 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇందుకు ఒక్కో కేంద్రానికి ఇద్దరు చొప్పున కోఆర్డినేటర్లను నియమించారు. ఈ కేంద్రాల ద్వారా జిల్లాలో 2,118 మందికి ఉపాధి కల్పించారు. కోఆర్డినేటర్‌కు నెలకు రూ.2 వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నారు.
ఆందోళనలో కోఆర్డినేటర్లు..
ప్రస్తుతం మున్సిపాలిటీల ఏర్పాటు, మున్సిపాలిటీలను అప్‌గ్రేడ్ చేయటంతో జిల్లాలో 30 సాక్షర భారత్ కేంద్రాలను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో 30 కేంద్రాల్లో పని చేస్తున్న 60 మంది కోఆర్డినేటర్లు ఉపాధిని కోల్పోయారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా వీరి పరిస్థితి తయారైంది. ఏడాది కాలంగా గౌరవ వేతనాలను అందుకోక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరికి ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వీరిని మరింత ఆందోళనకు గురిచేసింది.
తొలగించిన కేంద్రాలు ఇవే...
సిద్దిపేట మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన ప్రశాంత్‌నగర్, గాడిచర్లపల్లి, నర్సాపూర్, హన్‌మాన్‌నగర్, రంగధాంపల్లి, ఇమామ్‌బాద్ గ్రామాల్లో సాక్షరభారత్ కేంద్రాలను తొలగించారు. నూతనంగా ఏర్పాటైన నగర పంచాయతీలైన గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌లోని గజ్వేల్, ప్రజ్ఞాపూర్, ముట్రాజ్‌పల్లి, క్యాసార ం గ్రామాలు, దుబ్బాక పరిధిలోని దుబ్బాక, మల్లాయిపల్లి, చెల్లాపూర్, దుంపలపల్లి, చేర్వాపూర్, ధర్మాజీపేట, లచ్చపేట గ్రామాలున్నాయి. చేగుంట పరిధిలోని చేగుంట, పొలంపల్లి, వడియారం, రెడ్డిపల్లి, వల్లూరు, రుక్మాపూర్, అనంతసాగర్, ఉట్టి తిమ్మాయిపల్లి, చిన్నశివనూర్, చిట్టోజీపల్లి, కర్ణలపల్లి, అందోల్ పరిధిలోని అందోల్, జోగిపేట గ్రామాల్లో సాక్షరభారత్ కేంద్రాలను తొలగించారు.
మాకు ఉపాధి చూపాలి..
మున్సిపాలిటీల్లో సాక్షర్‌భారత్ కేంద్రాలను తొలగించడం సరైంది కాదు. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో ప్రజలు పూర్తి స్థాయి అక్షరాస్యులు లేరు. ఈ కేంద్రాలను తొలగించటంతో మేం ఉపాధిని కోల్పోయాం. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయం కల్పించాలి.
- దేవయ్య, సాక్షరభారత్ కోఆర్డినేటర్
కేంద్రాల రద్దు వాస్తవమే..
మున్సిపాలిటీల్లో కలిసిన గ్రామ పంచాయతీల్లో సాక్షరభారత్ కేంద్రాలను తొల గించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిని రద్దు చేసి ఆ కేంద్రాల్లోని సామగ్రిని స్వాధీనపరుచు కోవాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశాం. తొలగించిన కేంద్రాల్లో కోఆర్డినేటర్లకు ఉపాధికి సంబంధించిన విషయం మా పరిధిలో లేదు.
- ఉషామార్తా స్వర్ణలత, సాక్షరభారత్ డీడీ, సంగారెడ్డి
పట్టణ ప్రాంతాల్లో ‘సాక్షర భారత్’ బంద్
Published Sun, Sep 22 2013 5:54 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
Advertisement