సమావేశంలో దూషించుకుంటున్న చైర్మన్, కౌన్సెలర్
మెదక్ మున్సిపాలిటీ: పట్టణాభివృద్ధికి పాటుపడాల్సిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పరస్పర దూషణలు, దాడులకు దిగడంతో మెదక్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభసగా మారింది. ఒకదశలో నువ్వెంత ? అంటే.. నువ్వెంత ? అనుకుంటూ... దాడులకు దిగి రాందాస్ చౌరస్తాలో తేల్చుకుందాం రా.. అంటూ సవాల్ విసుకున్నారు. దీంతో విస్తుపోవడం మిగతా కౌన్సిలర్ల వంతయ్యింది. గురువారం మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. 6వ వార్డు కౌన్సిలర్ అరుణార్తి వెంకటరమణ మాట్లాడుతూ తన వార్డులో జరిగిన అభివృద్ధి పనుల్లో నాణ్యత లేదని, మాస్టర్‌ప్లాన్‌లోని ఆక్రమ నిర్మాణాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్‌ను ప్రశ్నించారు.
సాయిబాలాజీ గార్డెన్, పుష్పలవాగు పరిసరాల్లో ఉన్న మాస్టర్‌ప్లాన్‌లో వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన చైర్మన్ మాట్లాడుతూ ఆ నిర్మాణాలు గతంలో జరిగాయని, పట్టణ విస్తీర్ణం పెరగడంతో మాస్టర్ ప్లాన్ రివైజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈసమాధానంతో సంతృప్తి చెందని కౌన్సిలర్ రమణ అక్రమ నిర్మాణాలను తప్పనిసరిగా కూల్చివేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
కొనసాగిన దూషణల పర్వం..
ఒకరిపై వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. అయితే మీ 6వ వార్డులో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు జంకుతున్నారని చైర్మన్ సభలో తెలిపారు. తనకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని, గతంలో ఎన్నోపనులు ఇరుకైన వార్డుల్లో తాను స్వయంగా చేయించానని కౌన్సిలర్ రమణ ఆగ్రహంతో తెలిపారు. చైర్మన్ మాట్లాడుతూ బఫర్ జోన్‌లో స్థలాలను కబ్జా చేస్తున్నారని, స్వార్థ పూరిత నిర్ణయాలకు బల్దియా సిద్ధంగా లేదన్నారు. దీంతో మరోసారి ఇద్దరిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటల యుద్ధం దూషణల పర్వంగా మారింది.
రాందాస్ చౌరస్తాలో తేల్చుకుందామంటూ ఒకరికొకరు సవాల్ వేసుకున్నారు. అంతటితో ఆగకుండా దాడులకు సిద్ధం కాగా సహచర కౌన్సిలర్లు వారిని అడ్డుకున్నారు. అప్పటికీ గొడవ సద్దుమణగకపోగా చైర్మన్, కౌన్సిలర్ ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్, కాలింగ్‌బెల్‌తో దాడులు చేసుకున్నారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇదే క్రమంలో గొడవ ఉద్రిక్తతను తలపించగా పక్కనే ఉన్న కౌన్సిలర్లు సమావేశాన్ని అర్ధాంతంగా ముగించి వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగినట్లయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment