అక్కరకు రాని యజ్ఞం
విజయనగరం అర్బన్: సంపూర్ణ అక్షరాస్యతే ధ్యేయంగా ప్రారంభించిన అక్షరయజ్ఞం అక్కరకు రాకుండా పోయింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో సాక్షర భారత్ కేంద్రాలన్నీ అక్షరయజ్ఞాన్ని మధ్యలోనే వదిలేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో సాక్షరభారత్ క్షేత్రస్థాయి కేంద్రాల చరిత్ర ముగిసినట్లేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పథక క్షేత్రస్థాయి కో-ఆర్డినేటర్ల వేతనాల పంపిణీ నుంచి కేంద్రాలకు పుస్తకాలు, నిర్వహణ ఖర్చుల వరకు అవసరమైన నిధులు ఏడు నెలలుగా కేటాయించ లేదు. జిల్లాలో సంబంధిత శాఖ బ్యాంక్ ఖాతాలో ఉన్న కేంద్రప్రభుత్వ నిధులు రూ. 5 కోట్లు సైతం ఉమ్మడి రాష్ట్ర పాలన వ్యవహారం పేరుతో వెనక్కి తీసుకున్నారు. చివరికి జిల్లా శాఖాధికారి పర్యవేక్షణకు వినియోగించే నాలుగు చక్రాల వాహనాన్ని కూడా తీసుకున్నారు. దీంతో పథక నిర్వహణకు సంబంధించి ఒక్క అడుగుకూడా ముందుకు పడని పరిస్థితి ఏర్పడింది.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో 2010 సెప్టెంబర్‌లో జిల్లావ్యాప్తంగా 927 పంచాయతీల్లో సాక్షర భారత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వయోజనులను అక్షరాస్యులు గా తీర్చిదిద్దాలన్నది సాక్షర భారత్ ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథ కం, మహిళా సంఘాలకు చెందిన సభ్యులకు ఇది ఎంతో ఉపయోగకరం. ఉదయం పూట అం దరికీ పత్రికలు, కథల పుస్తకాలు చదివి వినిపిం చి, వారంతా పనులకు వెళ్లి తిరిగివచ్చాక రాత్రి వేళల్లో అక్షరాలు నేర్పించడం చేపడతారు. వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే మండల, గ్రామ కో-ఆర్డినేటర్లకు ఇచ్చే స్వల్ప వేతనం కూడా నెలల తరబడి అందడం లేదు. గతంలో కొంత మేర మంచి ఫలితాలే వచ్చినా క్రమక్రమంగా వీటి నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
గ్రామాల్లో వయోజనులైన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో జిల్లావ్యాప్తంగా 1,846 సాక్షర భారత కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ కోసం మండల స్థాయిలో మండల కో-ఆర్టినేటర్, గ్రామజనాభాను బట్టి గ్రామస్థాయిలో గ్రామ కో-ఆర్టినేటర్‌ను నియమించారు. మండల కో- ఆర్టినేటర్‌కు గౌరవ వేతనం కింద నెలకు రూ.6 వేలు, గ్రామ కో-ఆర్డినేటర్‌కు రూ.2 వేలు చెల్లించేవారు. అలాగే కేంద్రాల నిర్వహణకు నెలకు రూ.300 చొప్పున మంజూరు చేసే వారు. కానీ కేంద్రాల నిర్వహణ నామమాత్రం కావడంతో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అధికారుల పర్యవేక్షణ కొరవడడం, కో-ఆర్డినేటర్లకు సక్రమంగా వేతనాలు రాకపోవడం తదితర కారణాలతో కేంద్రాలు మూతపడే దశకు చేరుకున్నాయి.
ఆరంభ శూరత్వమే...
సాక్షరభారత్ మొదటి రెండు దశల్లో మందకొడిగా సాగినా మూడు, నాలుగో దశల్లో బాగాజరిగింది. జిల్లావ్యాప్తంగా నాలుగవ దశలో సుమారు 80 శాతంతో 5.7 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్ది రికార్డు సృష్టిం చామని అధికారులు చెబుతున్నా ఆ సంఖ్యలు కూడా నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. వయోజనులైన నిరక్షరాస్యులను కేంద్రాలకు రప్పించడంలో అధికారులు విఫలం కావడం, చదువు నేర్చుకోవడానికి ప్రజలు ఆసక్తి చూడకపోవడం, కో-ఆర్డినేటర్లకు సక్రమంగా వేతనాలు అందకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కేంద్రాల ఉనికి ప్రశ్నార్థకమైంది.