అబల చెంతకు సబల | sabala project team dsp snehitha special story | Sakshi
Sakshi News home page

అబల చెంతకు సబల

Published Thu, Feb 22 2018 10:06 AM | Last Updated on Fri, May 25 2018 5:52 PM

sabala project team dsp snehitha special story - Sakshi

సబల ప్రాజెక్టు నోడల్‌ అధికారి, తెనాలి డీఎస్పీ స్నేహిత

వేధింపులపై నోరు మెదిపితే, ఇదేంటని ప్రశ్నిస్తే, నలుగురికీ తెలిస్తే, అమ్మో ఆడపిల్లలం.. హద్దుల కోట దాటకూడదు.. గుండెల్లో వేదన బయటకురాకూడదు. హింసిం చడం మగాళ్ల జన్మహక్కు.. భరించడం ఆడాళ్ల విధి రాత..ఇదీ నేటి సమాజంలో మహిళల దుస్థితి. ఇలాంటి వారి కోసమే నేనున్నా నంటూ వస్తోంది ‘సబల’ . అన్ని వర్గాల మహిళ రక్షణ కొంగై మిమ్మల్ని కాపాడనుంది. జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ సబలను ప్రాజెక్టు నోడల్‌ అధికారి స్థాయిలో తెనాలి డీఎస్పీ ఎం స్నేహిత ముందుకు నడిపించనున్నారు. సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రాజెక్టు వివరాలను ఆమె వెల్లడించారు.

 గుంటూరు, తెనాలి:  రోడ్డుపై యువతిని ఎవరైనా కామెంట్‌ చేస్తే తలొంచుకుని వెళుతుంది. ఇంట్లో మహిళలు ‘నా భర్తే కదా కొట్టాడు’ అని ఊరుకుంటారు. దీంతో కొట్టటం తన హక్కు అన్న భావన మగాళ్లలో వస్తుంది. మొదట్లోరనే ప్రశ్నిస్తే, పోలీసులను ఆశ్రయిస్తే సమస్య తెగేదాకా వెళ్లకుండా ఉంటుంది. వీరి కోసమే ‘సబల’  ప్రారంభించామని ప్రాజెక్టు నోడల్‌ అధికారి, తెనాలి డీఎస్పీ స్నేహిత తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు సాక్షికి ఆమె వెల్లడించారు.

ఇలాంటి వారి కోసమే ‘సబల’ ప్రాజెక్టు
ఫిర్యాదు చేస్తున్న మహిళల శాతం పెరిగినా చైతన్యస్థాయి మెరుగుపడాలి. ఇంకా నోరువిప్పలేని వారి కోసం జిల్లాలో ‘సబల’ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. జిల్లా ఎస్పీ అప్పలనాయుడు ఆలోచనతో  రెండు నెలలుగా పైలెట్‌ ప్రాజెక్టుగా రహస్యంగా అమలు చేస్తున్నాం. మహిళా కానిస్టేబుళ్లు కాలేజీ విద్యార్థులు, పని చేసే కూలీలు, ఉద్యోగినులు, గృహిణులను కలుస్తూ వారి అంతరంగాన్ని తెలుసుకుంటున్నారు. అన్యాయాన్ని పూసగుచ్చితే ఫిర్యాదు తీసుకుని అందుకు పాల్పడినవారి పీచమణుస్తున్నాం. మహిళల నుంచి స్పందన బాగుంది. హాస్టల్‌లో ఉండే విద్యార్థినిని తన స్నేహితుడు ఫోన్‌ చేస్తూ వేధిస్తున్నాడు. అనుకోకుండా ఆ ఫోను తీసిన రూమ్మేట్‌కూ ఆ బాధ తప్పలేదు.‘సబల’కు చెప్పటంతో అతడిని అరెస్టు చేశాం. ‘సబల’ను నెలాఖరుకు అధికారికంగా ప్రారంభించబోతున్నాం.

ముగ్గురం ఆడపిల్లలమే...
తూర్పుగోదావరి జిల్లా మాది. కాకినాడ దగ్గర తాళ్లరేవులో మా నాన్న ప్రధానోపాధ్యాయుడు. అమ్మ గృహిణి. మేం ముగ్గురం అక్కచెల్లెళ్లం. ఇద్దరు చెల్లెళ్లూ ఇంకా చదువుతున్నారు. అంతా ఆడపిల్లలే అని వారెప్పుడూ విచార పడింది లేదు. మరింతగా ఖర్చు పెడుతూ ఎక్కువగా చదివించారు. ‘ఇంకా ఎంతకాలం ఇలా చదువులంటారు...పెళ్లిళ్లు చేయకుండా’ అంటూ బంధువులు, ఇరుగుపొరుగు వాళ్లు ప్రశ్నిస్తున్నా పట్టించుకోలేదు. ఓపికగా చదివించారు. డిగ్రీ తర్వాత నుంచి గ్రూప్స్, సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతూ పీజీ, ఎంఫిల్‌ చేశాను. 2012లో గ్రూప్‌–1లో సెలక్టయ్యాను. పీహెచ్‌డీ కూడా చేయబోతున్నా. సమయం సరిపోవటం లేదు.

నిశ్వబ్దాన్ని వీడితేనే న్యాయం..
వేధింపులు, హింసకు గురైన మహిళలు నాలుగు గోడల మధ్య కుమిలిపోతే న్యాయం జరగదు. అన్యాయంపై నిశ్శబ్దాన్ని వీడా. గొంతు పెగల్చుకొని ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. దోషులకు దండనతోనే బాధితులకు ఉపశమనం కలుగుతుంది. మరొక మగాడు ఆ నేరానికి పాల్పడేందుకు భయపడతారు. మహిళలపై ఆగడాలకు వారి మౌనం కూడా దారితీస్తోందని చెప్పటానికి నేను సంకోచించను. ఆవారాగా తిరిగే ఓ యువకుడు నలుగురు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయిదో అమ్మాయి మైనరు. అయినా ధైర్యంగా నోరు విప్పింది.  కేసు నమోదు చేసి అరెస్టు చేశాం. మొదటి బాధితురాలే నిశ్శబ్దాన్ని వీడినట్టయితే ముందు నలుగురూ అతడి బారిన పడేవారు కాదు కదా!

‘షీ టీమ్‌లోమూడేళ్లలో 2 వేల కేసులు
గ్రూప్‌–1లో నెగ్గి డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నాక తొలి పోస్టింగ్‌ సైబరాబాద్‌లో ఇచ్చారు. అక్కడ షీ టీమ్స్‌లో పని చేశాను. రోడ్లపై డెకాయ్‌ ఆపరేషన్లు చేస్తూ ఆడవాళ్లపై వేధింపులు/హింసకు పాల్పడే వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం ‘షీ’ విధి. ఇందులో మూడేళ్లు పని చేసిన నేను రెండు వేల వరకు కేసులు నమోదు చేయగలిగా. ఆ అనుభవంతోనే ఇప్పుడు ‘సబల’కు జిల్లా నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తున్నాను. నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతంలో సెన్సిటివ్‌గా ఉంటారు. వీరి నుంచి జాగ్రత్తగా సమాచారం తీసుకోవాలనే ఉద్దేశంతో సబల రూపకల్పన జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement