వైఎస్సార్ సీపీ అధినేతతో సబ్బం హరి భేటీ
Published Wed, Sep 18 2013 2:45 AM | Last Updated on Sat, Jul 28 2018 6:26 PM
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి ఆయన వెంటే ఉన్న ఎంపీ సబ్బం హరి తన పయనం జగన్‌తోనేనని మరో మారు కుండబద్ధలు కొట్టారు. మంగళవారం చంచల్ గూడ జైల్లో జగన్‌మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య చాలా సేపు పార్టీ వ్యవహారాలకు సంబంధించిన చర్చ జరిగింది. జగన్ సూచన మేరకు ఇక సమైక్యాంధ్ర పోరాటంలో కీలకంగా పనిచేయాలని హరి నిర్ణయించుకున్నారు. మూడున్నరేళ్లుగా జగన్‌తోనే హరి పయనిస్తున్నారు. సాంకేతికంగా కాం గ్రెస్‌లో ఉన్నప్పటికీ తాను జగన్ మనిషినేననీ, వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ నుంచే పోటీకి దిగుతానని హరి అనేక సార్లు ప్రకటించారు.
రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నం దుకు నిరసనగా ఇటీవలే ఆయన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌తో తన అనుబంధం ఎప్పుడో తెగిపోయిందని ప్రకటించారు. వైఎస్సార్ సీపీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండాలని నిర్ణయం తీసుకోవడం, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్ దీక్షల అనంతరం పార్టీ శ్రేణుల్లో సమైక్యాంధ్ర ప్రదేశ్ ఉద్యమ తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు, పార్టీ వ్యవహారాల గురించి చర్చించడానికి సబ్బం హరి మంగళవారం జైల్లో జగన్‌ను కలిశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇక నేరుగా కీలక పాత్ర పోషించాలని జగన్ సూచించడంతో హరి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారు.
ఇదే సందర్భంలో జిల్లాలో పార్టీ వ్యవహారాలు, మూడు రోజుల కిందట జరిగిన షర్మిల సమైక్య శంఖారావం యాత్రకు సంబంధించిన అంశాల పై కూడా ఇద్దరూ చర్చించారు. తాను కాంగ్రెస్ దూతగా జగన్‌ను కలుస్తున్నానని జరుగుతున్న విషప్రచారంపై ఆయన మండిపడుతూ జగన్ కాంగ్రెస్‌తో కలవాల్సిన అవసరమే లేద న్నారు. తాను జగన్ మనిషిగానే ఆయన్ను కలుస్తున్నానని స్పష్టంగా చెప్పారు. నాలుగు నెలల్లో విచారణ పూర్తి చేసి చార్జిషీటు వేస్తామని సీబీఐ సుప్రీం కోర్టుకు చెప్పినందువల్ల చట్టప్రకారం బెయిల్ పొందడానికి జగన్ అర్హుడనే విషయాన్ని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైఎ స్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు.
Advertisement
Advertisement