భయపడి... అడ్డుపడి!
సదావర్తి సత్రం కుంభకోణాన్ని దాచేయత్నం
వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకున్న తమ్ముళ్లు
స్వాగతం పలికేందుకు తరలివచ్చిన కార్యకర్తలపైనా వీరంగం
పర్యటన ఆరంభంలో ఉద్రిక్తత... పోలీసుల రంగప్రవేశం
అమరావతి : సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై వైఎస్సార్ సీపీ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ ఆదివారం అమరావతిలో పర్యటించింది. కమిటీ అధ్యక్షుడు ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో వెళ్లిన బృందాన్నిఅక్కడి తెలుగు దేశంపార్టీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. పార్టీ జెండాలు చేబూని వైఎస్సార్ సీపీకి వ్యతిరేక నినాదాలు చేశాయి. నిజనిర్ధారణ కమిటీకి స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులను సైతం అడ్డుకునే యత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం నిజనిర్ధారణ కమిటీకి ఘనస్వాగతం పలికిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు బృందాన్ని సదావర్తి సత్రం వద్దకు తీసుకెళ్లాయి. రూ. 1500 కోట్ల విలువ చేసే సత్రం భూములను టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి, సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు దోచుకున్నారు కాబట్టే తమ పర్యటనను అడ్డుకోవడానికి టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయని ఈ సందర్భంగా కమిటీ విలేకరులతో మాట్లాడుతూ ధ్వజమెత్తింది.
శాసనాలను పరిశీలించి...
కమిటీలో అధ్యక్షుడుగా ధర్మాన ప్రసాదరావు, పార్టీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), గోవర్ధన్‌రెడ్డి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు సభ్యులుగా ఉన్నారు. కమిటీ సభ్యులు అక్కడి ప్రజలతో మాట్లాడి సత్రానికి సంబంధించిన ఆస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సత్రంలో ఉన్న శాసనాలను పరిశీలించారు.
పర్యటనలో పాల్గొన్న నాయకులు
పర్యటనలో పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కొత్తా చిన్నపరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండారు సాయిబాబు, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు మొగిలి భరత్, జెడ్పీటీసీ కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు మంగిశెట్టి కోటేశ్వరరావు, ఆలా లక్ష్మీనారాయణ, మేకల హనుమంతరావు, అమరావతి, క్రోసూరు, అచ్చంపేట, పెదకూరపాడు, బెల్లంకొండ మండల పార్టీ అధ్యక్షులు కోట హరిబాబు, అబ్దుల్ రహీం, సందెపోగు సత్యం, బెల్లంకొండ మీరయ్య, చింతారెడ్డి సాయిరెడ్డి, బెల్లంకొండ మండల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షుడు టి.శ్రీకాంత్‌లతో పాటు అమరావతి మండల పార్టీ ప్రచార కార్యదర్శి చింకా వెంకటేశ్వర్లు, మండల బీసీ సెల్, మైనార్టీ విభాగం, సేవాదళ్, రైతు, యువజన విభాగాల అధ్యక్షులు నడకుదురు శ్రీనివాసరావు, దస్తగిరి, మండల పాపారావు, జి. శ్రీనివాసరెడ్డి, షేక్ హష్మీ, ఎంపీటీసీ జెట్టి నాగరాజు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
విలేకరులతో మాట్లాడుతూ...
ఇదేం పద్ధతి బాబూ.. : ధర్మాన
ప్రజలకు నిజాలు తెలియకుండా ఉండడం కోసమే తెలుగుదేశం పార్టీ తమను అడ్డుకుందని, ఇదేం పద్ధతి చంద్రబాబూ అని కమిటీ అధ్యక్షుడు ధర్మాన ప్రసాదరావు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నించారు. ఒక రకంగా టీడీపీ శ్రేణులు తమను అడ్డుకుని మేలు చేశాయన్నారు. ఇప్పుడైనా వాస్తవాలు ప్రజలందరికీ తెలుస్తాయని చెప్పారు. కమిటీ చెన్నై కూడా వెళ్లి అక్కడి భూములనూ పరిశీలిస్తుందని, దీనిపై న్యాయపోరాటం చేస్తుందని తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తాం : ఎమ్మెల్యే ఆర్కే
ఇప్పటికే రాజధాని అమరావతిలో రైతులు, రైతుకూలీలు, మహిళల భూములను దోచుకున్న చంద్రబాబు ఇప్పుడు సదావర్తి సత్రం, దేవుడి భూములను కూడా లూటీ చేస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. రాజధాని అమరావతిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సత్రం భూముల విషయంలో న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.
వాస్తవాలు తెలియజేయడానికే : ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి
వాస్తవాలు తెలియజేయడానికే నిజనిర్ధారణ కమిటీ అమరావతిలో పర్యటించిందని వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. వాస్తవాలను ప్రజలను తెలియజేయకుండా మభ్యపెట్టడానికే తమ పర్యటనను తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడానికి ప్రయత్నించిందని, ఇది నీతిమాలిన రాజకీయమని ఆయన ధ్వజమెత్తారు.
26న భూముల పరిశీలన : మర్రి రాజశేఖర్
చెన్నైలో ఉన్న సదావర్తి సత్రం భూములను ఈ నెల 26న కమిటీ పరిశీలిస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. సత్రం భూములను టీడీపీ ఎమ్మెల్యే శ్రీధర్, సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు దోచుకున్నారు కాబట్టే తమ పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నించారని మండి పడ్డారు.
అరాచకాలు బయటపడతాయని.. : కావటి
ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అరాచకాలు, భూ దందాలు తాము ఎక్కడ బయటపెడతామోనన్న భయంతోనే కమిటీ పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నించారని పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహరనాయుడు విమర్శించారు.