'ఢిల్లీలో పిల్లుల్లా వ్యవహరిస్తున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీని మాత్రమే ఇచ్చి సరిపెట్టేందుకు కేంద్రం యత్నిస్తుందని వైఎస్సార్ సీపీ నేత ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ఏపీకి ప్యాకేజీ అనేది ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని ధర్మాన విమర్శించారు.
గురువారం మీడియాతో మాట్లాడిన ధర్మాన.. ఏపీ ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ప్రజలు తరుపున పోరాటం చేయాల్సిన ప్రభుత్వం.. ప్రజలకు నచ్చచెప్పేందుకు యత్నిస్తుందని ఎద్దేవా చేశారు. ఏడాది కాలంలో ప్రత్యేక హోదా పై మాట్లాడని ప్రభుత్వ పెద్దలు.. ఢిల్లీలో పిల్లుల్లా వ్యవహరిస్తున్నారన్నారు. ఓటేసిన ప్రజలను వంచిస్తారా?అని ధర్మాన నిలదీశారు.
ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఒకటేనని చంద్రబాబు ఏపీ ప్రజలకు నష్టం చేసే యత్నం చేస్తున్నారన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి వైఎస్సార్ సీపీ వ్యతిరేకమని ఈ సందర్భంగా ధర్మాన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తిరస్కరిస్తే మీరెందుకు నోరు మెదపడం లేదని ధర్మాన ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం నుంచి వైదొలిగి ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై చర్చించేందుకు ఏపీ అసెంబ్లీని ప్రత్యేకంగా ఎందుకు సమావేశపరచడం లేదన్నారు. చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడవద్దని, త్యాగాలకు సిద్ధం కావాలన్నారు. అందరం కలిసి ప్రత్యేక హోదాపై పోరాడదామని ధర్మాన హితవు పలికారు.