పాపం.. ఆండాలమ్మ | sadly...women | Sakshi
Sakshi News home page

పాపం.. ఆండాలమ్మ

Published Sat, Dec 28 2013 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

sadly...women

 ‘మనసు మనసుతో ముడి వేస్తావ్.. మనిషి ప్రేమతో పెనవేస్తావ్... ఆడినంతసేపాడుకుని బొమ్మలన్నీ విసిరేస్తావ్.. ఈ మాయలన్నీ నీకే తెలుసని.. ఏమాయా తెలియని మనిషి హృదయాలను వేధిస్తున్నావ్... పచ్చగా ఉన్న బతుకులను.. ఎండమావి చేసి చూస్తున్నావ్..’ అంటూ ఓ సినీ కవి తన పాటకు అక్షరరూపమిస్తే.. ఆ రూపానికి నిజ స్వరూపం ఈ అభాగ్యుల జీవిత చిత్రం. ఒకరేమో.. ఒకప్పుడు భర్త, బిడ్డలు.. కార్లు, అంతస్తులతో బాగా బతికి.. నేడు రోడ్డున పడితే.. మరొకరు తోడూనీడా లేక.. నా అన్నవారు కానరాక చస్తూ బతుకుతున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
 
 రోడ్డు పక్కన షెడ్డు కింద.. చలికి తట్టుకోలేక.. నిండా దుప్పటి కప్పుకుని.. బిక్కుబిక్కుమంటూ చూస్తు న్న ఈ అభాగ్యురాలిపేరు ఆండాలమ్మ (80). ఒకప్పుడు ప్రొద్దుటూరు పట్టణంలో కార్లు ఉన్న కుటుంబాల్లో ఈమె కుటుంబం ఒకటి. సుమారు 40 ఏళ్ల కిందట భర్త లోకయ్యనాయుడుతో కలిసి మద్రాసు నుంచి వ్యాపారం కోసం వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. పాత మార్కెట్‌లో పెద్ద చెప్పుల దుకాణం నడుపుకుంటూ బాగా బతికారు.
 
 ఇంటి పెద్ద మరణంతో..
 లోకయ్యనాయుడు,ఆండాలమ్మలకు శ్రీధర్, కృష్ణకుమార్‌లు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో కృష్ణకుమార్ ఆర్‌ఎంపీ వైద్యుడిగా పేరొందాడు. పెద్ద కుమారుడు తండ్రికి చేదోడుగా ఉంటూ వ్యాపారా న్ని చూసుకునే వాడు. కొన్నేళ్ల కిందట లోకయ్యనాయుడు గుండెపోటు తో మృతి చెందాడు. శ్రీధర్ వ్యాపారాన్ని సరిగా చూసుకోలేక పోయాడు. ఉన్నదంతా పొగొట్టుకోవడం తో ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. చివరికి శ్రీధర్ ఫిల్మ్ ఆపరేటర్‌గా చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు.
 
 శ్రీధర్ గుండెపోటుతో మృతి...
 ఫిల్ము ఆపరేటర్‌గా పని చేస్తున్న శ్రీధర్ కూడా  కొన్ని నెలల కిందట గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆండాలమ్మ కోలుకోలేక పోయింది. ఈ క్రమంలో చిన్న కుమారుడు కృష్ణకుమార్ మతి స్థిమితం కోల్పోవడంతో అండాలమ్మ మరింత కుంగిపోయింది. ఈ దశలో ఇంటి బాడుగ కూడా కట్టలేని స్థితిలో ఆండాలమ్మ అనాథగా రోడ్డుపాలైంది. చిన్న కుమారుడు మతి స్థిమితం కోల్పో యినా వారానికి ఒకసారో, రెండు సార్లో వచ్చి ‘అమ్మాబాగున్నావా’ అని పలకరించి వెళుతుంటాడని అండాలమ్మ ఆవేదనతో తెలిపింది. బంధువులంతా మద్రాసులోనే ఉన్నారని తెలిపింది.
 
 తండ్రి పోలీస్‌శాఖలో...
 ఆండాలమ్మ తండ్రి గోవిందస్వామినాయుడు పోలీస్‌శాఖలో విధులు నిర్వహిస్తూ మృతి చెందాడు. అన్న జీఎం స్వామి కూడా పోలీస్‌శాఖలో విధులు నిర్వహిస్తున్నాడు. అండాలమ్మ పరిస్థితి చూసి స్థానికులు చలించి పోతున్నారు. దాతలు ఆదుకోవాలని  వేడుకుంటున్నారు.
     -న్యూస్‌లైన్, ప్రొద్దుటూరు టౌన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement