శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులకు భద్రత కరువయ్యే పరిస్థితి నెలకొంది. బాక్సులను జిల్లా కేంద్రానికి తీసుకొచ్చే బాధ్యతను ఈసారి జోనల్ అధికారులకు అప్పగించటమే దీనికి కారణం. గతంలో బ్యాలెట్ బాక్సులను ఆయా పోలింగ్ కేంద్రాల అధికారులు జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి అప్పగించేవారు. రూట్ ఆఫీసర్లు వరుసగా తమ పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్ల వద్దకు వెళ్లి పోలింగ్ అధికారులను తమ వాహనాల్లో ఎక్కించుకొని బ్యాలెట్ బాక్సులు జిల్లా కేంద్రానికి భద్రంగా వచ్చేలా చర్యలు తీసుకునేవారు.
ఈ దఫా అందుకు విరుద్ధంగా జోనల్ అధికారులకు బ్యాలెట్ బాక్సుల తరలింపు బాధ్యతలను అప్పగించారు. రూట్, జోనల్ అధికారులు ఓ వాహనంలో పోలింగ్ కేంద్రాలకు వెల్లి పీవోల నుంచి బ్యాలెట్ బాక్సులు తీసుకుంటారు. వెంటనే పీవోలు అక్కడే రిలీవ్ అయ్యే అవకాశం కల్పించారు. దీనివల్ల పీవోలపై భారం తగ్గింది. ఇదివరలో బాక్సులను జిల్లా కేంద్రానికి తెచ్చి.. వాటిని సంబంధిత అధికారులకు అప్పగించేవరకూ వీరిదే బాధ్యత. మిగిలిన జిల్లాల్లో ఇప్పటికీ ఇదే విధానం అమలు చేస్తుండగా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు.
దీంతో జోనల్ అధికారులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఓ జోనల్ అధికారి పరిధిలో 10 నుంచి 15 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. ఒక్కో కేంద్రంలో ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ బ్యాలెట్ బాక్సు ఉంటుంది. ఈ లెక్కన 20 నుంచి 30 బ్యాలెట్ బాక్సులను జిల్లా కేంద్రానికి జోనల్ అధికారి జాగ్రత్తగా తీసుకురావాల్సి ఉంటుంది. గతంలో పీవోలు వారివారి బ్యాలెట్ బాక్సులను జాగ్రత్తగా పట్టుకొని తీసుకువచ్చేవారు.
ఒక్కొక్కరికి రెండు బాక్సులే ఉండడం వల్ల ఇది సాధ్యపడేది. ఇప్పుడు ఒకే వ్యక్తి దాదాపు 30 బాక్సులను తీసుకురావాలి. బాక్సులపై అతికించే సంతకాలతో కూడిన పేపర్లు కానీ, సీళ్లు కానీ ఊడితే తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఈ సమస్యను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం నిబంధన మార్చడం పట్ల జోనల్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై రాష్ట్ర స్థాయి అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
బ్యాలెట్ బాక్సులకు భద్రత కరువు
Published Sat, Apr 5 2014 1:15 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement