పిచ్చిమొక్కలతో నిండిపోయిన పేరువంచ మేజర్ కాల్వ
ఖమ్మంఅర్బన్: సాగర్ కాల్వల మరమ్మతులపై అధికారులు దృష్టి సారించారు. ఎన్నెస్పీ ఆయకట్టుకు యాసంగిలో నీటి సరఫరా పూర్తయింది. దీంతో అత్యవసరంగా చేపట్టాల్సిన కాల్వల మరమ్మతు పనులపై అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. ఈ క్రమంలో తొలి విడతగా రూ.60లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో మరమ్మతు పనులు చేపట్టేందుకు ఆయా డివిజన్ల పరిధిలో అధికారులు టెండర్ల ప్రక్రియపై దృష్టి పెట్టారు. గతంలో సాగర్ కాల్వల ఆధునికీకరణ చేసిన వాటి పరిధిలో మిగిలిపోయిన.. చేపట్టని ప్రాంతాల్లో పనులను గుర్తించి అంచనాలు రూపొందించగా.. వాటిలో కొన్నింటికి నిధులు మంజూరయ్యాయి. ప్రధాన కాల్వతోపాటు మేజర్, మైనర్ కాల్వలపై పేరుకుపోయిన కంప చెట్లు, పూడికతీత, దెబ్బతిన్న కట్టల మరమ్మతు తదితర పనులు చేపట్టనున్నారు. జిల్లాలో ఎన్నెస్పీ సర్కిల్ పరిధిలో రెండు డివిజన్లు ఉన్నాయి. కల్లూరు డివిజన్ పరిధిలో మొత్తం 8 పనులకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. వాటికి సర్కిల్, డివిజన్ పరిధిలో టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఖమ్మం డివిజన్‌లో గతంలో తయారు చేసిన అంచనాల ప్రకారం పనులకు నిధులు మంజూరు కాలేదు. అయితే మరోసారి అంచనాలు తయారు చేసి పంపుతున్నట్లు ఎన్నెస్పీ ఈఈ తెలిపారు. మానిటోరింగ్ డివిజన్ పరిధిలో కూడా మరమ్మతులు చేయాల్సిన వాటిని గుర్తించి.. అంచనాలు పంపారు. వాటిలో రూ.10లక్షల నిధులు మంజూరయ్యాయి. ఖమ్మం సర్కిల్ పరిధిలోని 17 మండలాల్లో సుమారు 2.55 లక్షల ఎకరాల ఆయకట్టుకు అంతరాయం లేకుండా వచ్చే వర్షాకాలం నాటికి నీరందించే విధంగా ఎన్నెస్పీ అధికారులు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఎన్నెస్పీ ఎస్‌ఈ సుమతీదేవి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇక ఈ రెండు నెలల కాలంలో గుర్తించిన పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చొరవ తీసుకోవాలని సూచించారు. అలాగే కల్లూరు డివిజన్ పరిధిలోని పేరువంచ మేజర్ కాల్వ మరమ్మతు, ఇంకా మధిర బ్రాంచి కాల్వ, జమలాపురం, మైలవరం మేజర్లపై పనులు చేసేందుకు అధికారులు నిర్ణయించారు.
ఆగస్టు నాటికి పూర్తి చేసేందుకు..
వచ్చే జూన్ నుంచి వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా.. సాగర్ డ్యాంలోకి అనుకున్న మేరకు నీరు చేరితే ఆగస్టులో విడుదల చేస్తారు. ఎక్కడైనా మరమ్మతు పనులు చేయాల్సి ఉంటే.. ఆగస్టు నాటికి పూర్తి చేసే విధంగా టెండర్లు పూర్తి చేసి.. పనులు మొదలు పెట్టి.. రైతులకు కాల్వల ద్వారా సమృద్ధిగా నీరందించేందుకు పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
టెండర్లు పిలుస్తున్నాం..
అత్యవసర పనులను గుర్తించి అంచనాలు పంపించాం. వాటిలో 8 పనులకు సంబంధించి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. వాటికి సంబంధించి టెండర్లు పిలుస్తున్నాం. లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు చేసేందుకు కాస్త ఇబ్బందులు ఉన్నాయి. అయినా అలాంటి వాటిని అధిగమించి అనుకున్న మేరకు పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం.– అప్పలనాయుడు, కల్లూరు ఎన్నెస్పీ ఈఈ
Comments
Please login to add a commentAdd a comment