తనతో అన్యోన్యంగా ఉన్న అరవింద్ ఫొటో చూపుతున్న సహస్ర
ఒంగోలు: నేను ఓ సాధారణ అడపిల్లను, అమ్మ, పెద్దమ్మ చనిపోవడంతో నాకు పెద్ద దిక్కు ఎవరూ లేరు. నేడు నేను ఒంటరిని. నాలుగేళ్లుగా నాతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండి నేడు నన్ను కాదు పొమ్మంటున్నాడు. ఇందుకు అతని తల్లితో పాటు బంధువులు, అండగా నిలుస్తున్నారు. రూ. 75 లక్షలకుపైగా నావద్ద డబ్బులు లాగేసుకున్నాడు. అంతే కాదు బంగారం కూడా స్వాహా చేశాడు. తీరా నేడు కేవలం స్నేహితురాలివి మాత్రమే అంటే చెంప పగులగొట్టరా.. అంటూ వాసిరెడ్డి సంధ్యారాణి అలియాస్ సహస్త్ర పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఒంగోలు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం పెట్టి వివరాలు మీడియాకు వెల్లడించారు. అమ్మ, పెద్దమ్మ చనిపోయిన దుఃఖంలో ఉన్న తన మొబైల్ నెంబర్‌ను టంగుటూరుకు చెందిన పూనాటి అరవింద్ స్వరూప్ ఎలా సంపాదించాడో తెలియదన్నారు. తొలుత అతనితో మాట్లాడేందుకు తాను తిరస్కరించినా రోజు ఫోన్‌చేస్తూ నాకు ధైర్యం చెప్తుంటే అతని మాయలో పడిపోయానని తెలిపింది. తరువాత కొద్దికాలానికే హైదరాబాద్‌లోని మణికొండలోని తన నివాసానికి వచ్చి మంచి మాటలు చెప్తుండేవాడని, అనతికాలంలోనే ప్రపోజ్ చేశాడన్నారు. తాను అప్పటికే మానసికంగా ఎవరూలేరన్న భావనతో ఉన్నందువల్ల అతని మాయమాటలు గుర్తించక అంగీకరించానని వాపోయింది. తమ ప్రేమ వ్యవహారం అతని తండ్రికి కూడా తెలుసన్నారు.
ఆయన మరణానంతరం అరవింద్ స్వరూప్ అసలు కుట్రకు తెరదీశాడంది. తన వద్ద అంచెలంచెలుగా రూ. 75 లక్షలు స్వాహా చేయడంతో పాటు తనకు తెలిసిన స్నేహితుల వద్ద మరో రూ. 7 లక్షల వరకు అప్పులు కూడా చేసి నేడు తనను తల ఎత్తుకోకుండా చేశాడని వాపోయింది. తనను పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు కాబట్టే ఆధారాలతో తాను టంగుటూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులు తీసుకోలేదన్నారు. 15వ తేదీ జిల్లా ఎస్పీని కలిసేందుకు వెళ్లగా అదనపు ఎస్పీతో మాట్లాడేందుకు అనుమతించారని, ఆయనకు తన ఫిర్యాదును కూడా అందజేశానన్నారు. 16వ తేదీ టంగుటూరు పోలీసుస్టేషన్ వద్ద ఉండగా తనను మాట్లాడుకుందాం రమ్మని పిలిచి అరవింద్ తల్లి కోటేశ్వరమ్మ, కొంతమంది కొట్టారని ఆరోపించారు. 19వ తేదీ చంద్రశేఖర్ అనే వ్యక్తి తాను అండగా ఉంటాను రమ్మని చెప్పి పిలిపించాడని, కేసు వాపసు తీసుకోకపోతే చంపేస్తామంటూ బెదిరించారని, తనపై కొడవలితో దాడిచేసి చంపేందుకు కూడా యత్నించారని, మీడియా స్పందించకపోయి ఉంటే తన ప్రాణాలు ఎప్పుడో గాలిలో కలిసిపోయి ఉండేవని కన్నీళ్ల పర్యంతం అయ్యారు.
అయితే మీడియాలో కథనాలు రావడంతో అర్ధరాత్రి సమయంలో పోలీసుస్టేషన్‌కు రావాలని టంగుటూరు పోలీసులు ఒత్తిడిచేశారన్నారు. తీరా ఈనెల 25వ తేదీ హడావిడిగా తొలుత తాను ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేశారని, కానీ దాని ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా తనకు అందజేయలేదన్నారు. తాను తొలుత ఇచ్చిన ఫిర్యాదుల అనంతరం తనపై జరిగిన దాడులకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు వెళితే టంగుటూరు పోలీసులు ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించారని వాపోయింది. దీంతో తాను ఎట్టకేలకు ఎస్పీ మొబైల్ నెంబర్ తెలుసుకొని ఆదివారం ఫోన్‌చేశానని, ఆయన స్పందించి అసలు ఈ ఘటన గురించి తన దృష్టికి రాలేదంటూ తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆయన స్పందిచండంతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం కుదిరిందని రెండు రోజుల్లో ఎస్పీని కలిసి మొత్తం వ్యవహారాన్ని తెలియజేయనున్నట్లు పేర్కొంది.
కులం వ్యవహారంగా చిత్రీకరించడం సరికాదు
అరవింద్ తప్పుచేశాడు కాబట్టే దాక్కుంటున్నాడని, తాను తప్పుచేయలేదు కాబట్టే తెలంగాణా నుంచి ధైర్యంగా వచ్చి వారి ఇంటివద్దకు వెళ్లగలుగుతున్నానని సహస్ర పేర్కొంది. తాము ఒకే సామాజిక వర్గం అయినంత మాత్రాన కులం వ్యవహారంగా చిత్రీకరించేందుకు జరుగుతున్న కుట్రను ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఒక ఆడపిల్లకు జరుగుతున్న అన్యాయంగా గుర్తించాలని వేడుకుంటున్నానన్నారు. తనకు జరుగుతున్న అన్యాయంపై గ్రామంలో చాలామంది సానుభూతి వ్యక్తం చేస్తున్నా ఆ కుటుంబం అంటే భయం ఉండడం వల్లే ముందుకు రాలేకపోతున్నారన్నారు. ఇదే ఆ గ్రామానికి చెందిన ఆడపిల్లకు జరిగినా ఇదే విధంగా మౌనంగా ఉంటారా అంటూ భావోద్వేగానికి గురైంది. తన వద్ద డబ్బులకు సంబంధించి ఉన్న పలు పత్రాలను మీడియాకు చూపించారు. తనతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా ఆమె మీడియా ముందు చూపించి స్నేహితులు అయితే ఇలానే ఉంటారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా రాద్దాంతాన్ని మానుకొని తనతో పెళ్లికి ముందుకు రావాలని, లేనిపక్షంలో అరవింద్‌కు కఠిన శిక్ష వేయడంతో పాటు తనపై దాడులకు దిగిన వారందరిపైన కేసులు నమోదుచేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వాసిరెడ్డి సంధ్యారాణి అలియాస్ సహస్ర పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment