sahasra
-
‘కాలింగ్ సహస్ర’ మూవీ గురించి సరదా సరదాగా
-
మెమరీ చిప్ ఉత్పత్తిలో సహస్ర.. తొలి భారతీయ కంపెనీగా రికార్డ్
రాజస్థాన్‌కు చెందిన 'సహస్ర సెమీకండక్టర్స్' (Sahasra Semiconductors) మెమరీ చిప్‌లను ఉత్పత్తి చేసిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ నెల ప్రారంభంలో భివాడి జిల్లాలోని సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ అండ్ ప్యాకేజింగ్ యూనిట్లో ఉత్పత్తిని ప్రారంభించి.. వివిధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు ఇప్పటికే మొదటి షిప్మెంట్ చేసింది. 2023 చివరి నాటికి కంపెనీ భివాడి యూనిట్ 30 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని, 2024లో ఇది మరింత ఎక్కువగా ఉండనున్నట్లు సహస్ర గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'అమృత్ మన్వానీ' వెల్లడించారు. మేడ్ ఇన్ ఇండియా మైక్రో ఎస్డి కార్డ్‌లను విక్రయించే మొదటి కంపెనీగా మారినందుకు ఆనందంగా ఉందని, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో మంచి స్పందన లభిస్తోందని మన్వానీ ఈ సందర్భంగా చెప్పారు. సహస్ర సెమీకండక్టర్స్ రెండు ప్రముఖ ప్రభుత్వ కార్యక్రమాల (PLI, SPECS) నుంచి ఆమోదం పొందింది. అంతే కాకుండా కంపెనీ తన తయారీ సౌకర్యాన్ని విస్తరించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇదీ చదవండి: పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్.. టూ వీలర్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి! సెమీకండక్టర్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్లోబల్ చిప్‌మేకర్ మైక్రాన్, గుజరాత్లో కొత్త అసెంబ్లీ అండ్ టెస్ట్ సదుపాయాన్ని స్థాపించడానికి 825 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. అనుకున్న విధంగా అన్నీ జరిగితే 2024 నాటికి ఉత్పత్తి అధికమవుతుందని, తద్వారా కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు. -
వంద సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సహస్ర, ఇప్పుడేం చేస్తుందంటే?
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 100 సినిమాల్లో నటించింది సహస్ర. రౌడీ అల్లుడు, హిట్లర్, ముగ్గురు మొనగాళ్లు, సమర సంహారెడ్డి, మేజర్ చంద్రకాంత్.. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించింది. అయితే చదువు పూర్తి చేయాలన్న ధ్యాసతో సినిమాలకు గుడ్‌బై చెప్పేసి ఉన్నత చదువులు చదివింది. తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది నటి సహస్ర. 'మా నాన్నది వరంగల్. మేము హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే సెటిలయ్యాం. ఏడాదిన్నర వయసుకే ఎక్కువ మాట్లాడేదాన్ని. నాన్న ఓ బిజినెస్ పార్టీకి వెళ్లినప్పుడు నన్ను చూసి సినిమాల్లో అడిగారు. ఇంత చిన్న పాప ఎలా చేస్తుందని నాన్న నో చెప్పాడు. కానీ నెక్స్ట్ డే అంకుల్ ఇంటికి వచ్చాడు. అప్పుడు మా పేరెంట్స్ లేరు, అమ్మమ్మ ఉంది. నేను చేస్తానని అంకుల్‌తో వెళ్లిపోయాను. అమ్మానాన్న వచ్చేసరికే మూడు సీన్లు కూడా చేశాను. అమ్మ, అమ్మమ్మ నాతోపాటు సెట్స్‌కు వచ్చేవారు. భానుచందర్‌గారి ఉద్యమం నా మొదటి చిత్రం. అప్పుడు నేను చిన్నపిల్లను కావడంతో హీరోలందరూ నాతో బాగా ఉండేవారు, ఆడుకునేవారు. రామ్‌చరణ్ ఇంటికి వెళ్లి అక్కడున్న టెడ్డీబేర్‌తో ఆడుకునేదాన్ని. ఒకసారి చెన్నైలో షూటింగ్‌కు వెళ్లినప్పుడు చరణే ఉప్మా చేసి పెట్టారు. అది నా జీవితంలో మర్చిపోలేని క్షణాలు. సమరసింహారెడ్డి చివరి రోజు షూటింగ్ నాడు ప్రొడక్షన్ టీమ్‌లో ఉన్న అందరికీ వెండి ఉంగరాలు ఇచ్చాను. వాళ్లు చాలా ఎమోషనలయ్యారు. ఎన్టీఆర్.. నన్ను రండి, కూర్చోండి అని మాట్లాడేవారు. రెండోసారి సీఎం అయినప్పుడు కేబినెట్ మంత్రుల మీటింగ్ ఆపి మరీ నాతో లంచ్ చేశాడు. మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ టైంలో మనోజ్, నేను కలిసి సెట్‌కు వెళ్లేవాళ్లం. సమరసింహారెడ్డి నా చివరి సినిమా. చదువు మీద దృష్టి పెడదామని సినిమాలు మానేశాను. మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ పూర్తి చేశాను. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజు, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి.. వంటి స్టార్ హీరోలందరితో చేశాను. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది. -
Sahasra: బాల నటి భళా.. కుట్టి
ఏ తల్లిదండ్రి అయినా సంతృప్తిగా.. సంతోషంగా.. ఉన్నారు అంటే వారి పిల్లల ఎదుగుదలను చూసినపుడే.. అనేది వంద శాతం వాస్తవం. పిల్లలు పెరిగి పెద్దవారు అయ్యాక కొంతమంది సంతోష పడితే, మరికొందరు మాత్రం బుడిబుడి అడుగులు వేస్తున్ననాటి నుంచి తల్లిదండ్రులను ఎంతో సంతోష పెడుతున్నారు. ఆ కోవకు చెందినదే మన బాల్యనటి సహస్ర. చిన్నతనం నుంచి తన నటనతో ఎంతో మంది హృదయాల్లో నిలిచింది. మాటీవిలో ప్రసారమయ్యే ‘పాపే మా జీవన జ్యోతి’ ధారావాహిక చైల్డ్ ఆర్టిస్ట్ కుట్టి పాత్రలో జీవిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందుతోంది ఈ సహస్ర. – చింతల్ సహస్ర ప్రస్థానం ఇలా.. ► నిజాంపేటలోని భాగ్యలక్ష్మిహిల్స్లో నివాసముండే దర్పల్లి అనిల్‌కుమార్, లీలా దంపతులకు 2013 డిసెంబర్ 9వ తేదీన సహస్ర జన్మించడంతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ► తండ్రి అనీల్‌కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే కుత్బుల్లాపూర్ హెచ్ఎంటీ కాలనీలో నిర్మాణ్ మానసిక వికలాంగుల కేంద్రాన్ని నడిపిస్తూ తనవంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తుండగా, తల్లి ప్రైవేట్ టీచర్‌గా కొనసాగుతోంది. ► చిన్నతనంలోనే సహస్ర హావభావాల వీడియోలను అనీల్‌కుమార్ దంపతులు మొబైల్లో రికార్డ్ చేస్తూ ఉండేవారు. చిన్ననాటి నుంచే డ్యాన్స్‌లో.. ► పువ్వుపుట్టగానే పరిమళించును అన్న చందంగా చిన్ననాటి నుంచే సహస్ర టీవీలో వచ్చే పలు ప్రకటనలు, సీరియల్స్‌ను ఆసక్తిగా గమనించేది. ►సహస్ర తల్లిదండ్రులు అనీల్‌కుమార్, లీల దంపతులు విద్యావంతులు కావడంతో తమ కుమార్తెకు ప్రోత్సాహాన్ని అందించారు. ► తమకు తెలిసిన మిత్రుల సహాకారంతో సహస్ర పోషించిన పాత్రలు, నృత్యాలకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమమైన యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేవారు. ► ఆ విధంగా బుల్లితెరకు పరిచయమై తన సహజమైన నటనతో ‘పాపే మా జీవనజ్యోతి’ అనే మాటీవీ సీరియల్లో కుట్టి పాత్రకు ఎంపికైంది. ► ఇలా టెలివిజన్ రంగంలో అడుగుపెట్టిన సహస్ర తనకు ఇచి్చన కుట్టి పాత్రకు జీవం పోస్తూ.. ఎందరో అభిమానులను సంపాదించుకుంది. తెలుగు భాషపై పట్టు.. ► సహస్ర జేన్ఎటీయూ కూకట్‌పల్లిలోని నారాయణ హైస్కూల్లో మూడో తరగతి చదువుతోంది. ► ఈ బాల నటి గ్రామీణ భాష నుంచి నవీన భాషలోని మాండళికం తన తోటి కళాకారులను సైతం అబ్బురపరుస్తూ.. భావితరాలకు స్ఫూర్తిదాయకమై.. సినీ వినీలాకాశంలో తళుక్కున మెరుస్తున్న నక్షత్రం ఈ సహస్ర. ► తెలుగు కళామతల్లి వడిలో ఓనమాలు దిద్దుకుంటున్న ఈ చిన్నారి మున్ముందు సినీ రంగంలో ఉన్నత శిఖరాలను ఆధిరోహించాలని ఆశిస్తూ.. నేటి చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆశీర్వదిద్దాం. అన్నింటిలోనూ ముందే.. చదువుతో పాటు నటన, నాట్యం, సంగీతంలో తన ప్రతిభను చాటుతోంది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పలు సీరియళ్లకు, సినిమాలకు తన వాయిస్‌ను సైతం అందిస్తోంది. చక్కని ప్రతిభతో అనేక వెబ్ సిరీస్‌లలో న టిస్తోంది. పలు వ్యాపార సంస్థల ప్రకటనల్లో వంట పాత్రలను కడిగినంత సులువుగా తనకు తానే పోటీగా ఇచ్చిన పాత్రలో అంతలా ఒదిగి పోతుంది ఈ చిచ్చర పిడుగు. -
స్నేహితురాలివి మాత్రమే అంటే చెంప పగులగొట్టరా..
ఒంగోలు: నేను ఓ సాధారణ అడపిల్లను, అమ్మ, పెద్దమ్మ చనిపోవడంతో నాకు పెద్ద దిక్కు ఎవరూ లేరు. నేడు నేను ఒంటరిని. నాలుగేళ్లుగా నాతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండి నేడు నన్ను కాదు పొమ్మంటున్నాడు. ఇందుకు అతని తల్లితో పాటు బంధువులు, అండగా నిలుస్తున్నారు. రూ. 75 లక్షలకుపైగా నావద్ద డబ్బులు లాగేసుకున్నాడు. అంతే కాదు బంగారం కూడా స్వాహా చేశాడు. తీరా నేడు కేవలం స్నేహితురాలివి మాత్రమే అంటే చెంప పగులగొట్టరా.. అంటూ వాసిరెడ్డి సంధ్యారాణి అలియాస్ సహస్త్ర పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఒంగోలు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం పెట్టి వివరాలు మీడియాకు వెల్లడించారు. అమ్మ, పెద్దమ్మ చనిపోయిన దుఃఖంలో ఉన్న తన మొబైల్ నెంబర్‌ను టంగుటూరుకు చెందిన పూనాటి అరవింద్ స్వరూప్ ఎలా సంపాదించాడో తెలియదన్నారు. తొలుత అతనితో మాట్లాడేందుకు తాను తిరస్కరించినా రోజు ఫోన్‌చేస్తూ నాకు ధైర్యం చెప్తుంటే అతని మాయలో పడిపోయానని తెలిపింది. తరువాత కొద్దికాలానికే హైదరాబాద్‌లోని మణికొండలోని తన నివాసానికి వచ్చి మంచి మాటలు చెప్తుండేవాడని, అనతికాలంలోనే ప్రపోజ్ చేశాడన్నారు. తాను అప్పటికే మానసికంగా ఎవరూలేరన్న భావనతో ఉన్నందువల్ల అతని మాయమాటలు గుర్తించక అంగీకరించానని వాపోయింది. తమ ప్రేమ వ్యవహారం అతని తండ్రికి కూడా తెలుసన్నారు. ఆయన మరణానంతరం అరవింద్ స్వరూప్ అసలు కుట్రకు తెరదీశాడంది. తన వద్ద అంచెలంచెలుగా రూ. 75 లక్షలు స్వాహా చేయడంతో పాటు తనకు తెలిసిన స్నేహితుల వద్ద మరో రూ. 7 లక్షల వరకు అప్పులు కూడా చేసి నేడు తనను తల ఎత్తుకోకుండా చేశాడని వాపోయింది. తనను పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు కాబట్టే ఆధారాలతో తాను టంగుటూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులు తీసుకోలేదన్నారు. 15వ తేదీ జిల్లా ఎస్పీని కలిసేందుకు వెళ్లగా అదనపు ఎస్పీతో మాట్లాడేందుకు అనుమతించారని, ఆయనకు తన ఫిర్యాదును కూడా అందజేశానన్నారు. 16వ తేదీ టంగుటూరు పోలీసుస్టేషన్ వద్ద ఉండగా తనను మాట్లాడుకుందాం రమ్మని పిలిచి అరవింద్ తల్లి కోటేశ్వరమ్మ, కొంతమంది కొట్టారని ఆరోపించారు. 19వ తేదీ చంద్రశేఖర్ అనే వ్యక్తి తాను అండగా ఉంటాను రమ్మని చెప్పి పిలిపించాడని, కేసు వాపసు తీసుకోకపోతే చంపేస్తామంటూ బెదిరించారని, తనపై కొడవలితో దాడిచేసి చంపేందుకు కూడా యత్నించారని, మీడియా స్పందించకపోయి ఉంటే తన ప్రాణాలు ఎప్పుడో గాలిలో కలిసిపోయి ఉండేవని కన్నీళ్ల పర్యంతం అయ్యారు. అయితే మీడియాలో కథనాలు రావడంతో అర్ధరాత్రి సమయంలో పోలీసుస్టేషన్‌కు రావాలని టంగుటూరు పోలీసులు ఒత్తిడిచేశారన్నారు. తీరా ఈనెల 25వ తేదీ హడావిడిగా తొలుత తాను ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేశారని, కానీ దాని ఎఫ్ఐఆర్ కాపీ కూడా తనకు అందజేయలేదన్నారు. తాను తొలుత ఇచ్చిన ఫిర్యాదుల అనంతరం తనపై జరిగిన దాడులకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు వెళితే టంగుటూరు పోలీసులు ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించారని వాపోయింది. దీంతో తాను ఎట్టకేలకు ఎస్పీ మొబైల్ నెంబర్ తెలుసుకొని ఆదివారం ఫోన్‌చేశానని, ఆయన స్పందించి అసలు ఈ ఘటన గురించి తన దృష్టికి రాలేదంటూ తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆయన స్పందిచండంతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం కుదిరిందని రెండు రోజుల్లో ఎస్పీని కలిసి మొత్తం వ్యవహారాన్ని తెలియజేయనున్నట్లు పేర్కొంది. కులం వ్యవహారంగా చిత్రీకరించడం సరికాదు అరవింద్ తప్పుచేశాడు కాబట్టే దాక్కుంటున్నాడని, తాను తప్పుచేయలేదు కాబట్టే తెలంగాణా నుంచి ధైర్యంగా వచ్చి వారి ఇంటివద్దకు వెళ్లగలుగుతున్నానని సహస్ర పేర్కొంది. తాము ఒకే సామాజిక వర్గం అయినంత మాత్రాన కులం వ్యవహారంగా చిత్రీకరించేందుకు జరుగుతున్న కుట్రను ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఒక ఆడపిల్లకు జరుగుతున్న అన్యాయంగా గుర్తించాలని వేడుకుంటున్నానన్నారు. తనకు జరుగుతున్న అన్యాయంపై గ్రామంలో చాలామంది సానుభూతి వ్యక్తం చేస్తున్నా ఆ కుటుంబం అంటే భయం ఉండడం వల్లే ముందుకు రాలేకపోతున్నారన్నారు. ఇదే ఆ గ్రామానికి చెందిన ఆడపిల్లకు జరిగినా ఇదే విధంగా మౌనంగా ఉంటారా అంటూ భావోద్వేగానికి గురైంది. తన వద్ద డబ్బులకు సంబంధించి ఉన్న పలు పత్రాలను మీడియాకు చూపించారు. తనతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా ఆమె మీడియా ముందు చూపించి స్నేహితులు అయితే ఇలానే ఉంటారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా రాద్దాంతాన్ని మానుకొని తనతో పెళ్లికి ముందుకు రావాలని, లేనిపక్షంలో అరవింద్‌కు కఠిన శిక్ష వేయడంతో పాటు తనపై దాడులకు దిగిన వారందరిపైన కేసులు నమోదుచేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వాసిరెడ్డి సంధ్యారాణి అలియాస్ సహస్ర పేర్కొన్నారు. -
భక్తి, జ్ఞాన కుసుమాల మాల విష్ణుసహస్రం
–వేలాది భక్తుల సమష్టి సహస్రనామ గానం –త్రిదండి చిన్న శ్రీమన్నారాయణరామానుజ జీయరుస్వామి ఉపదేశం రాజమహేంద్రవరం కల్చరల్ : విష్ణుసహస్రనామ స్తోత్రం జ్ఞానకుసుమాల మాల, ఒకో నామం ఒకో పారిజాత కుసుమమని త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి పేర్కొన్నారు. మంగళవారం ఎస్.కె.వి.టి.డిగ్రీ కళాశాలలో శ్రీరంగధామం ఆధ్వర్యంలో జరిగిన విరాట్ విష్ణుసహస్రనామ పారాయణలో ఆయన పాల్గొని, అనుగ్రహభాషణం గావించారు. సాధారణంగా భక్తుడు భగవంతుని సన్నిధిని చేరుకోవడానికి తాపత్రయ పడతాడు, కానీ, స్వచ్ఛంద మరణాన్ని వరంగా కలిగిన భీష్ముడు ప్రాణం వదిలే సమయం కోసం నిరీక్షిస్తున్న తరుణంలో, శ్రీకృష్ణభగవానుడే స్వయంగా పాండవాగ్రజునితో అంపశయ్య మీద ఉన్న భీష్ముని వద్దకు వచ్చాడని జీయరు స్వామి వివరించారు. నేడు ప్రపంచమంతా అభద్రతాభావంలో మునిగి ఉంది. వ్యక్తుల మధ్య, మతాల మధ్య, ఒకే మతంలో విభిన్న విభాగాల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి. ఉగ్రవాదం ఊపిరి పోసుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భయాలు తొలగాలంటే, ప్రేమ చిగురించాలి, మనమంతా ఒకే కుటుంబానికి చెందినవారమన్న భావన కలగాలి, విష్ణుసహస్రనామానికి ఆ శక్తి ఉన్నదని జీయరుస్వామి వివరించారు. భగవద్రామానుజాచార్యులు అవతరించిన సహస్రాబ్ధిలో మనం జన్మించడం, ఆయన్ను స్మరించుకుంటూ విష్ణుసహస్రనామాన్ని పారాయణ చేయడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. వికాసతరంగిణి ఆధ్వర్యంలో ప్రచురించిన శ్రీరామానుజ సంకీర్తన పుస్తకాన్ని జీయరు స్వామి ఆవిష్కరించారు. ప్రాచార్య శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ ఈ సృష్టిలో విష్ణుసహస్రనామాన్ని మించిన జ్ఞానపేటిక మరొకటి లేదని అన్నారు. వేయినామాలు చదవలేకపోయినవారు తొలి మూడు నామాలు చదివినా అనంత శుభఫలితాలు కలుగుతాయన్నారు. నిత్య విద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ భగవద్రామానుజాచార్యులు ప్రపంచానికి సోషలిజం బోధించిన తొలి వ్యక్తి అని అన్నారు. త్రిదండి దేవనాథజీయరుస్వామి, పులిగొల్ళ కృష్ణమాచార్యులు, సముద్రాల రంగరామానుజాచార్యులు ప్రసంగించారు. శతావధాని అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు భాగవతంలోని పద్యాలను రాగ, భావ యుక్తంగా గానం చేశారు. పొంగిపొరలిన భక్తిరసవాహిని వేలాది గళాలు భక్తి పారవశ్యంతో విష్ణుసహస్రనామాలను పారాయణ చేశారు. వేదవ్యాసభారతం, అనుశాసన పర్వంలో భీష్మాచార్యుడు శ్రీకృష్ణభగవానుని సన్నిధిలో ధర్మజునికి సహస్రనామాలు వినిపిస్తే, మంగళవారం త్రిదండి చిన్న జీయరుస్వామి సన్నిధిలో, వేలాది భక్తులు సహస్రనామాలను పారాయణ చేశారు. కళాశాల ఆవరణ అంతా దేవదేవుని నామస్మరణతో మారుమోగింది. -
రక్తహీనతతో చిన్నారి మృతి
కెరమెరి(ఆదిలాబాద్) రక్త హీనతతో బాధపడుతున్న ఓ చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది. వివరాలివీ.. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం దువుడుపల్లి గ్రామానికి చెందిన రంజిత్, వాణి దంపతుల కుమార్తె సహస్ర(ఏడాది) రక్త హీనతతో బాధపడుతోంది. ఆమెను తల్లి దండ్రులు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఆమె 12 రోజులుగా చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించటంతో సహస్ర గురువారం ఉదయం చనిపోయింది. చిన్నారి సికిల్‌సెల్ అనీమియాతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారని కుటుంబసభ్యులు చెప్పారు. -
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సహస్రకు చోటు
ఒక నిమిషంలోనే పది భగవద్గీత శ్లోకాలు చదివిన ఆసిఫాబాద్ చిన్నారి ఆసిఫాబాద్ : ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌కు చెందిన సాయిని సంతోష్-అనూష దంపతుల కుమార్తె సహస్ర చోటు దక్కిందించుకుంది. తండ్రి సంతోష్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సహస్ర కూడా అక్కడే చందానగర్ క్యూట్ ఎలాండ్ స్కూల్లో నర్సరీ చదువుతోంది. గత నెల 14న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఏర్పాటు చేసిన పోటీల్లో ఒక నిమిషంలోనే పది భగవద్గీత శ్లోకాలు చదివి అబ్బురపరిచింది. గతంలో ఒక నిమిషంలో ఎనిమిది శ్లోకాలు చదివిన రికార్డులను అధిగమించినట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు