చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 100 సినిమాల్లో నటించింది సహస్ర. రౌడీ అల్లుడు, హిట్లర్, ముగ్గురు మొనగాళ్లు, సమర సంహారెడ్డి, మేజర్ చంద్రకాంత్.. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించింది. అయితే చదువు పూర్తి చేయాలన్న ధ్యాసతో సినిమాలకు గుడ్‌బై చెప్పేసి ఉన్నత చదువులు చదివింది. తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది నటి సహస్ర.
'మా నాన్నది వరంగల్. మేము హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే సెటిలయ్యాం. ఏడాదిన్నర వయసుకే ఎక్కువ మాట్లాడేదాన్ని. నాన్న ఓ బిజినెస్ పార్టీకి వెళ్లినప్పుడు నన్ను చూసి సినిమాల్లో అడిగారు. ఇంత చిన్న పాప ఎలా చేస్తుందని నాన్న నో చెప్పాడు. కానీ నెక్స్ట్ డే అంకుల్ ఇంటికి వచ్చాడు. అప్పుడు మా పేరెంట్స్ లేరు, అమ్మమ్మ ఉంది. నేను చేస్తానని అంకుల్‌తో వెళ్లిపోయాను. అమ్మానాన్న వచ్చేసరికే మూడు సీన్లు కూడా చేశాను.
అమ్మ, అమ్మమ్మ నాతోపాటు సెట్స్‌కు వచ్చేవారు. భానుచందర్‌గారి ఉద్యమం నా మొదటి చిత్రం. అప్పుడు నేను చిన్నపిల్లను కావడంతో హీరోలందరూ నాతో బాగా ఉండేవారు, ఆడుకునేవారు. రామ్‌చరణ్ ఇంటికి వెళ్లి అక్కడున్న టెడ్డీబేర్‌తో ఆడుకునేదాన్ని. ఒకసారి చెన్నైలో షూటింగ్‌కు వెళ్లినప్పుడు చరణే ఉప్మా చేసి పెట్టారు. అది నా జీవితంలో మర్చిపోలేని క్షణాలు. సమరసింహారెడ్డి చివరి రోజు షూటింగ్ నాడు ప్రొడక్షన్ టీమ్‌లో ఉన్న అందరికీ వెండి ఉంగరాలు ఇచ్చాను. వాళ్లు చాలా ఎమోషనలయ్యారు.
ఎన్టీఆర్.. నన్ను రండి, కూర్చోండి అని మాట్లాడేవారు. రెండోసారి సీఎం అయినప్పుడు కేబినెట్ మంత్రుల మీటింగ్ ఆపి మరీ నాతో లంచ్ చేశాడు. మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ టైంలో మనోజ్, నేను కలిసి సెట్‌కు వెళ్లేవాళ్లం. సమరసింహారెడ్డి నా చివరి సినిమా. చదువు మీద దృష్టి పెడదామని సినిమాలు మానేశాను. మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ పూర్తి చేశాను. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజు, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి.. వంటి స్టార్ హీరోలందరితో చేశాను. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment