సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తీర్మానం అసెంబ్లీలో చర్చకు వస్తే ఓడించి తీరాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం నిర్ణయించుకున్నామని మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. ఇతర పార్టీలు కూడా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు.గురువారం సీఎల్పీ కార్యాలయంలో విప్ రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావులతో కలసి శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. విభజనకు అన్ని పార్టీలు అంగీకరించాకే కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసిందని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికీ విభజనకే కట్టుబడి ఉన్నట్లు చెప్పడం విచారకరమన్నారు. తెలంగాణ ఏర్పాటు అంశం అసెంబ్లీలో చర్చకు రాకతప్పదని, అప్పుడు సీమాంధ్రుల సంఖ్యాబలం ఎక్కువగా ఉండేందుకు ఏ ఒక్కరూ రాజీనామా చేయరాదని కోరారు.
ఢిల్లీలో సమైక్యాంధ్ర ధర్నాకు శైలజానాథ్, పద్మరాజు
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీమాంధ్ర ఉద్యోగులు శుక్రవారం జరుప తలపెట్టిన ధర్నాకు కాంగ్రెస్ ప్రతినిధులుగా సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ సాకే శైలజానాథ్, విప్ రుద్రరాజు పద్మరాజు హాజరుకానున్నారు. ధర్నాకు సంఘీభావం తెలపాలని ఉద్యోగ సంఘాలు కోరిన మీదట తాము హాజరవ్వాలని నిర్ణయించుకున్నామని శైలజానాథ్ తెలిపారు. శుక్రవారం ఉదయం వీరిద్దరూ విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు.
తెలంగాణ తీర్మానాన్ని ఓడిస్తాం: శైలజానాథ్
Published Fri, Sep 27 2013 3:49 AM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM
Advertisement