తిరుపతిలో సాక్షి ‘ఎరీనా వన్’ యూత్ ఫెస్ట్ ప్రారంభం
► ఐదు జిల్లాల క్రికెట్ జట్లు హాజరు
► ఫిబ్రవరి 3 వరకూ నిర్వహణ
తిరుపతి : క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏడాదికోసారి ‘సాక్షి’నిర్వహించే ‘ఎరీనా వన్’ యూత్ ఫెస్ట్ సోమవారం తిరుపతిలో ప్రారంభమైంది. తిరుపతి శివారులోని తుమ్మలగుంట క్రీడా మైదానంలో ఉదయం 9.30 గంటలకు రీజినల్ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం అయ్యాయి. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ దొర, సీకాం విద్యాసంస్థల డైరెక్టర్ సురేంద్రనాథ్‌రెడ్డిలు పోటీలను ప్రారంభించారు.
చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల నుంచి 25 జట్లు పోటీలకు హాజరయ్యాయి. ఫిబ్రవరి 3వ తేదీ వరకూ పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు కొనసాగుతాయని వివరించారు. ఇక్కడ జరిగే రీజినల్ స్థాయి పోటీల్లో ఎంపికైన జట్లను విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని వివరించారు. మొదటి రోజైన సోమవారం జూనియర్స్ విభాగంలో శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ వర్సెస్ ఎస్వీ జూనియర్ కాలేజీ, ఎస్వీ ఐఐటీ కాలేజీ వర్సెస్ జగన్ జూనియర్ కాలేజ్ (నెల్లూరు) జట్ల మధ్య పోటీలు జరుగుతున్నాయి. అదేవిధంగా సీనియర్స్ విభాగంలో అకార్డ్ బిజినెస్ స్కూల్ వర్సెస్ సిద్ధార్థ ఎడ్యుకేషన్ అకాడమీల మధ్య, గాయిత్రీ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వర్సెస్ ఏఎస్‌ఆర్ డిగ్రీ కాలేజీ మధ్య పోటీలు జరుగుతున్నాయి.