సాక్షి చానల్ ప్రసారాల నిలిపివేతపై కొనసాగుతున్న నిరసనల పర్వం
సర్కారు తీరుపై మండిపడుతున్న {పజాస్వామికవాదులు
ఉయ్యూరులో గులాబీలు పంచిన జర్నలిస్టులు
ముద్రగడకు మద్దతుగా నూజివీడులో ర్యాలీ
విజయవాడ : గత నాలుగు రోజులుగా సాక్షి చానల్ ప్రసారాలను నిలిపివేయడంతో పాటు పాటు కాపు ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో చీకటి పాలన కొనసాగుతోందంటూ పలువురు దుయ్యబడుతున్నారు. వాస్తవాలను ప్రసారం చేస్తున్న సాక్షి చానల్‌తో పాటు మరికొన్ని చానల్స్ ప్రసారాలు నిలిపివేయడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి పరాకాష్టగా అభివర్ణిస్తున్నారు. ఆదివారం నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తమ నిరసనలు తెలియజేశారు.
ఆందోళనలు ఇలా...
విజయవాడ వించిపేట సెంటర్‌లో సాక్షి అభిమానులు, శ్రేయోభిలాషులు, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. సాక్షి చానల్ ప్రసారాలపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సాక్షి చానల్‌తో పాటు పలు చానళ్లపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ తిరువూరు నియోజకవర్గంలో ఆదివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తిరువూరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో, గంపలగూడెం, ఎ.కొండూరులో ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేత హేయమైన చర్య అని కృష్ణాజిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఆదివారం మైలవరంలో జరిగిన సమావేశంలో ఖండించింది. ఎమ్మార్పీఎస్ యువసేన అధ్యక్షుడు ఐ.జమలయ్య ఆధ్వర్యంలో మైలవరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జరిగిన సమావేశంలో భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటున్న ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండించారు.
నూజివీడు చినగాంధీబొమ్మ సెంటర్ నుంచి పెద గాంధీబొమ్మ సెంటర్ వరకు కాపు సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించి ముద్రగడ పద్మనాభ ం ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. కాపు ఉద్యమాన్ని అణగదొక్కడంతో పాటు ఈ ఉద్యమాన్ని ప్రసారం చేస్తున్న చానల్స్‌పై ఆంక్షలు విధించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేశారు. సాక్షి చానల్ ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు ఉయ్యూరు సెంటరులో నిరసన చేపట్టారు. గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపి, గులాబీలు అందజేశారు. ఆందోళనలో కంకిపాడు, ఉయ్యూరు, తోట్లవల్లూరు నుంచి ఎలక్ట్రానిక్, పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు.