క్రీడాకారుల కేరింత
విజయవాడ స్పోర్ట్స్: ఫోర్త్ ఎస్టేట్‌గా సాక్షి మీడియా గ్రూపు ఓ పక్క సమాజం పట్ల తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ, మరో వైపు సామాజిక బాధ్యతగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సాక్షి మీడియా గ్రూప్, శ్రీచైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్‌పీఎల్) క్రికెట్ టోర్నీ నిర్వహించారు. గురువారం స్థానిక సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు, తల్లిదండ్రులు క్రీడల పట్ల అవగాహన పెంచుకుంటున్నారని, ఇది మంచి పరిణామం అన్నారు. గత నెల రోజులుగా పూర్తి స్థాయి క్రికెట్ నిబంధనలతో కళాశాలల విద్యార్థులకు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో సాక్షి ప్రీమియర్ లీగ్ క్రికెట్ విజయవంతంగా నిర్వహించడం ముదావహం అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎస్పీఎల్ క్రికెట్‌ను విజయం వంతంగా నిర్వహించిన సాక్షి సిబ్బందిని మనస్ఫుర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యతనిస్తోందన్నారు. స్వతహాగా రాష్ట్ర ముఖ్యమంత్రి క్రికెటర్ అని, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ క్రికెట్ కెప్టెన్‌గా వ్యవహరించారని అన్నారు. క్రీడల పట్ల సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి మంచి అవగాహన ఉందని, అందుకే గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కుల, మత, పార్టీ, ప్రాంత భేదం లేకుండా అర్హులైన అందరికీ వైఎస్సార్ క్రీడా నగదు ప్రోత్సాహకాలు ఇచ్చామన్నారు. గత ఆరు నెలల్లో రూ.2కోట్లకు పైగా క్రీడాకారులకు నగదు అందజేశామన్నారు. ఫిట్‌నెస్‌కు మారుపేరు సీఎం వై.ఎస్.జగన్ అని అన్నారు. అందుకే ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో 3648 కిలోమీటర్లు నడిచారని గుర్తు చేశారు.
మంత్రి శ్రీనివాస్, ఐఅండ్‌పీఆర్ కమిషనర్ విజయకుమార్‌రెడ్డి, సాక్షి సీఈవో వినయ్ మహేశ్వరి, డైరెక్టర్ రాణిరెడ్డి చేతుల మీదుగా సీనియర్ కేటగిరిలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకుంటున్న మనోజ్ సాయి వర్మేష్ (ఎమరాల్డ్స్ డిగ్రీ కాలేజీ, తిరుపతి)
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి :
గౌరవ అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఐఅండ్ పీఆర్ కమిషనర్ టి.విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ సాక్షి మీడియా గ్రూపు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 896 కళాశాలలకు క్రికెట్ పోటీలు విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఫిట్‌నెస్ ఉంటే గంటల కొద్దీ చదవాల్సిన సమయాన్ని తగ్గించుకోవచ్చన్నారు. కనీసం రోజుకు ఒక గంట పాటు ఫిట్‌నెస్‌కు సమయం కేటాయించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఎస్పీఎల్ క్రికెట్ స్పాన్సర్లు శ్రీచైతన్య విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ, మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల డైరెక్టర్ ఎం.మోహన్, సాక్షి మీడియా గ్రూపు నుంచి సాక్షి సీఈవో వినయ్ మహేశ్వరీ, కార్పొరేట్ అఫైర్స్ గ్రూపు డైరెక్టర్ రాణిరెడ్డి, బిజినెస్ కంట్రోల్ డైరెక్టర్ ఏఎల్‌ఎన్ రెడ్డి విజేతలకు ట్రోఫీలు అందజేశారు. కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎ.యల్లారావు, నెట్‌వర్క్ ఇన్‌చార్జి రాఘవరెడ్డి, అమరావతి బ్యూరో ఇన్‌చార్జి ఎన్.వెంకటరెడ్డి, అడ్వటైజ్‌మెంట్ సీజీఎం కమల్‌కిషోర్‌రెడ్డి, జీఎం వెంకటరెడ్డి, డీజీఎం రంగనాథ్, విజయవాడ బ్రాంచి మేనేజ్ అప్పన్న, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ట్రోఫీలు అందుకున్న ఆయా జట్ల క్రికెటర్లు కేరింతలు కొడుతూ ట్రోఫీలతో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. జూనియర్ విభాగం ఫైనల్ మ్యాచ్ ఎస్.శివారెడ్డి ఐటీసీ కళాశాల (రాయలసీమ జోన్) జట్టు, శాతవాహన జూనియర్ కళాశాల (నార్త్ ఆంధ్ర, శ్రీకాకుళం) జట్టు మధ్య జరిగింది. ఎస్.శివారెడ్డి ఐటీసీ కళాశాల విజయం సాధించింది. సీనియర్స్ విభాగం ఫైనల్లో డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల(నార్త్ ఆంధ్ర) జట్టు, రాయలసీమ జోన్ (ఎమరాల్డ్ కళాశాల) జట్టు తలపడ్డాయి. ఎమరాల్డ్ డిగ్రీ కళాశాల, తిరుపతి (రాయలసీమ జోన్) విజేతగా నిలిచింది.
శ్రీ చైతన్య విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ మురళీ కృష్ణను సత్కరిస్తున్న మంత్రి అవంతి శ్రీనివాస్, వినయ్ మహేశ్వరి
గ్రామీణ యువతలో విశేష క్రీడా ప్రతిభ
క్రికెట్ అంటే కేవలం ఒక ఆట మాత్రమే కాదు ఒక సంస్కృతి అన్నంత భావన అన్ని వయసుల వారిలో ఏర్పడిందని శ్రీచైతన్య విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ అన్నారు. దేశంలో క్రీడా సంస్కృతి పెరగడానికి ఇది ఎంతో ఉపయోగపడిందన్నారు. 10 ఏళ్ల కిందట వరకూ ముంబాయి, ఢిల్లీ, చెన్నయ్ వంటి మెట్రో నగరాలకే...అదీ బాగా డబ్బు ఉన్న కుటుంబాల వరకే క్రికెట్ ఎక్కువుగా పరిమితం అయ్యేదన్నారు. కాని దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలు, పల్లెల్లోని యువకుల్లో ఎంతో క్రికెట్ టాలెంట్ ఉందన్నారు. సామాన్య కుటుంబాల్లోని పిల్లలు కూడా అద్భుతమైన క్రికెట్ నైపుణ్యం కనబరుస్తున్నారని తెలిపారు. ఇప్పడు ఇండియాకు రెండు వరల్డ్ కప్‌లు సాధించి పెట్టిన ధోనీ అలా రాంచీలోని ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడేనని గుర్తు చేశారు. సాక్షి యాజమాన్యం తనవంతుగా ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఈ మంచి కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు భాగస్వామిగా చేరాయి, రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు వెయ్యి కాలేజీలు ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నాయి అంటే మాటలు కాదన్నారు. భవిష్యత్‌లో సామాజిక బాధ్యతగా సాక్షి యజమాన్యం నిర్వహించే మరిన్ని కార్యక్రమాల్లో శ్రీచైతన్య విద్యా సంస్థలు భాగస్వామిగా ఉంటాయని వివరించారు.
మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మోహన్‌ను సత్కరిస్తున్న మంత్రి అవంతి, వినయ్ మహేశ్వరి, రాణిరెడ్డి
ఆటలు జీవితంలో భాగం కావాలి
ఆటలు జీవితంలో భాగం అయినప్పుడే సమాజం ఆరోగ్యవంతంగా తయారవుతుందని మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ అన్నారు. నేటి జీవన విధానంలో శారీరక శ్రమ లేక రోగాల బారిన పడుతున్నామన్నారు. విద్యతో పాటు క్రీడలు చాలా ముఖ్యమన్నారు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఇప్పుడు క్రీడల్లో పిల్లలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. జీవితంలో ఎత్తూపల్లాలను, గెలుపోటములను సమంగా చూసే దృక్పథం క్రీడల ద్వారా అందుతుందన్నారు. ‘సాక్షి’ క్రికెట్ పోటీలు భారీ స్థాయిలో విజయవంతంగా నిర్వహించడం హర్షణీయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment