జూనియర్స్ విభాగంలో ఎస్‌ఎస్‌బీఎన్ జూనియర్ కళాశాల, సాయి గణపతి పాలిటెక్నిక్ కళాశాల జట్ల మధ్య హోరాహోరీ
విజయవాడ స్పోర్ట్స్: సాక్షి ప్రీమియర్ లీగ్(ఎస్‌పీఎల్) క్రికెట్ రాష్ట్ర స్థాయి పోటీలు స్థానిక కేఎల్ యూనివర్సిటీలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర, మధ్య ఆంధ్ర, రాయలసీమ సీనియర్, జూనియర్ పురుషుల జట్లు ఈ చాంపియన్‌షిప్ కు ప్రాతినిధ్యం వహించాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఆరు జట్లు ఈ టోర్నీలో హోరాహోరీగా తలపడ్డాయి.
సీనియర్స్ విభాగంలో మధ్య ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించిన నెల్లూరు జట్టు రెండు ప్రత్యర్థి జట్ల చేతిలో ఓడి వెనుకంజ వేయగా, జూనియర్స్ విభాగంలో మధ్య ఆంధ్ర, ఉత్తరాంధ్ర జట్లు చెరో రెండేసి పాయింట్లతో ముందంజలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లను సాక్షి విజయవాడ బ్రాంచ్ మేనేజర్ కేఎస్ అప్పన్న పర్యవేక్షించారు.
సీఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కాలేజీ విజయకేతనం
జూనియర్స్ విభాగం తొలి మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర(సాయిగణపతి పాలి టెక్నిక్ కాలేజీ, విశాఖపట్నం) జట్టుపై, మధ్య ఆంధ్ర(సీఆర్ రెడ్డి పాలి టెక్నిక్ కాలేజీ, ఏలూరు) జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచి రెండు పాయింట్లను సాధించింది. టాస్ గెలిచిన మధ్య ఆంధ్ర జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరాంధ్ర జట్టు నిర్ణీత 10 ఓవర్లకు ఎనిమిది వికెట్లు నష్టపోయి 58 పరుగులు మాత్రమే చేసింది.
బ్యాట్స్‌మెన్‌లు మధుసూదన్ 12, అవినాష్ 11 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మధ్య ఆంధ్ర జట్టు 8.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు నష్టపోయి 60 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్‌లు సంజయ్ 19 రన్స్ చేయగా సాయిచరణ్, సాయిశశికుమార్ చెరో 15 రన్స్ చేసి జట్టు విజయానికి దోహదపడ్డారు. 19 రన్స్ చేసి, ఒక వికెట్ తీసిన సంజయ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
ఐదు వికెట్ల తేడాతో ఎంజీవీఆర్ కాలేజీ గెలుపు
సీనియర్స్ విభాగం తొలి మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర(ఎంజీవీఆర్ కాలేజీ, విజయనగరం), మధ్య ఆంధ్ర(నారాయ ణ ఇంజినీరింగ్ కాలేజీ, నెల్లూ రు) జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఉత్తరాంధ్ర జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన మధ్య ఆంధ్ర జట్టు నిర్ణీత 10 ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 57 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు తవ్‌సీఫ్, వెంకటేశ్‌లు తొలి నాలుగు ఓవర్లు నిలకడగా ఆడి 28 పరుగులు చేశారు.
అయితే ఆ తరువాత ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో మధ్య ఆంధ్ర జట్టు తక్కువ స్కోర్‌ను సాధించింది. ఉత్తరాంధ్ర బౌలర్లు రవికిరణ్, సంతోష్ చెరో రెండు కీలకమైన వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరాంధ్ర జట్టు కేవలం 7.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసి సునాయాసంగా విజయం సాధించింది.
ఓపెనర్లు రవికిరణ్ 18, సాయిప్రణీత్ 10 పరుగులతో రాణించి జట్టు విజయానికి దోహదపడ్డారు. రెండు వికెట్లు తీసి, 18 రన్స్ చేసిన ఉత్తరాంధ్ర బ్యాట్స్‌మెన్ రవికిరణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఉత్తరాంధ్ర జట్టు రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది.
తిరుపతి సీకామ్ డిగ్రీ కాలేజీ విజయదుందుభి
సీనియర్స్ విభాగంలోనే మరో మ్యాచ్‌లో మధ్య ఆంధ్ర(నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ, నెల్లూరు) జట్టును ఓడించిన రాయలసీమ(సీకామ్ డిగ్రీ కాలేజీ, తిరుపతి) జట్టు రెండు పాయింట్లను సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయలసీమ జట్టు నిర్ణీత 10 ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 98 పరుగులు సాధించింది.
బ్యాట్స్‌మెన్‌లు అఖిబ్ 20, ఫయాజ్‌అలీ 17, మనోజ్ 13, డి.సాయి12 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మధ్య ఆంధ్ర జట్టు నిర్ణీత 10 ఓవర్లకు రెండు వికెట్లు నష్టపోయి 63 పరుగులు మాత్రమే చేసింది. 13 రన్స్, ఒక వికెట్ తీసిన రాయలసీమ జట్టు ఆల్‌రౌండర్ మనోజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజీ విజయం
జూనియర్స్ విభాగంలోనే రెండో మ్యాచ్‌లో రాయలసీమ(ఎస్‌ఎస్‌బీఎన్ జూనియర్ కాలేజీ, అనంతపురం), ఉత్తరాంధ్ర(సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజీ, విశాఖపట్నం) జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయలసీమ జట్టు నిర్ణీత 10 ఓవర్లకు ఆరు వికెట్లు నష్టపోయి 70 పరుగులు చేసింది.
బ్యాట్స్‌మెన్‌లు విఘ్నేష్ 26, ప్రశాంత్ 20 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరాంధ్ర జట్టు 9.3వ ఓవర్ వద్ద ఐదు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్‌లు నూకేష్ 22, అవినాష్ 19 పరుగులతో రాణించారు. ఆరు పరుగులు, రెండు వికెట్లు తీసిన బి.కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఉత్తరాంధ్ర జట్టు రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది.
నేడు విజేతలకు ట్రోఫీల ప్రదానం
సీనియర్స్ విభాగంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ జట్లు బుధవారం తలపడతాయి. జూనియర్స్ విభాగంలో మధ్య ఆంధ్ర, రాయలసీమ జట్లు తలపడతాయి. పోటీల అనంతరం సాయంత్రం జరిగే బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేస్తారు.
చదవండి: IPL 2022: సెంచరీ మిస్.. అయితేనేం జట్టును గెలిపించాడు! జోష్‌లో బెంగళూరు!
Comments
Please login to add a commentAdd a comment