సమైక్యవాదులు సృష్టించే సునామీలో విభజన వాదం కొట్టుకుపోతుందని ప్రముఖ న్యాయవాది వీణా అజయ్‌కుమార్ అన్నారు.
సమైక్య సునామి సృష్టిద్దాం
Published Sun, Aug 18 2013 3:48 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
వైవీయూ, న్యూస్‌లైన్ :సమైక్యవాదులు సృష్టించే సునామీలో విభజన వాదం కొట్టుకుపోతుందని ప్రముఖ న్యాయవాది వీణా అజయ్‌కుమార్ అన్నారు. శనివారం నగరంలోని పొట్టిశ్రీరాములు విగ్రహ కూడలి వద్ద సర్వమత సామూహిక నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత పొటిశ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమంలో ముస్లిం, హిందూ, క్రైస్తవ మతపెద్దలు హజరత్ మౌలాన ముఫ్తి సయ్యద్ ముగ్దుమ్‌సాహెబ్, విజయ్‌స్వామి, రాజేష్‌స్వామి, ఫాదర్ కనకరాజుల ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీణా అజయ్‌కుమార్ మాట్లాడుతూ కులాలకు, మతాలతకు అతీతంగా మనమంతా ఒక్కటే, మనలక్ష్యం కూడా సమైక్యాంధ్ర ఒక్కటే అన్న నినాదంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సమైక్యాంధ్రకు ప్రజలే నాయకులుగా వ్యవహరిస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత సీమాంధ్రలో ఆందోళనల వేడి ఢిల్లీకి చేరడంతో డిసెంబర్ 23 ప్రకటన వచ్చిందన్నారు. దీంతో సీమాంధ్ర నాయకులు, ప్రజలు శాంతించారన్నారు. అయితే అప్పటి నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమకారులు అలుపులేకుండా ఉద్యమాలు చేస్తూనే ఉండటంతో కేంద్రప్రభుత్వం వారిపట్ల మొగ్గుచూపిందన్నారు. అలా కాకుండా అప్పటి నుంచి సమైక్యవాదాన్ని కొనసాగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదన్నారు. ప్రస్తుతం ప్రతికుటుంబానికి హైదరాబాద్‌తో అనుబంధం ఏర్పడిందని, దాన్ని వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు.
ముస్లిం మతగురువు హజరత్ మౌలాన ముఫ్తి సయ్యద్ ముగ్దుమ్‌సాహెబ్ మాట్లాడుతూ అఖండ భారతావనిలో రాష్ట్రాలను ముక్కలుగా చేయడం తగదన్నారు. క్రైస్తవ మతగురువు కనకరాజు మాట్లాడుతూ అందరూ కలిసిమెలిసి ఉండే తెలుగుజాతిని చీల్చాలనుకోవడం తగదన్నారు. హిందూ మతపెద్దలు విజయ్‌స్వామి, రాజేష్‌స్వామి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా నిర్వహించే ఈ ఉద్యమం విజయవంతం అవుతుందన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి ఎన్‌జీఓ నాయకులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, యాజమాన్యాలు సంఘీభావం ప్రకటించారు. అనంతరం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, నగర కన్వీనర్ ఎస్.బి.అంజాద్‌బాషా, కాంగ్రెస్ నాయకులు కందుల రాజమోహన్‌రెడ్డి, గౌస్‌పీర్, జేఏసీ నాయకులు రామచంద్రారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, ఇంటాక్ కన్వీనర్ ఎలియాస్‌రెడ్డి ప్రసంగించారు.
జయనగర్ కాలనీ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు ‘ఆలోచించండి ఓ విభజన వాదుల్లారా..’ అంటూ చేసిన నృత్యగీతం అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు భాస్కర్‌వర్మ, షంషుద్దీన్, సురేష్, ప్రకాష్, ఫారుఖ్, నవనీశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రవికిరణ్‌రెడ్డి, రాణా, లోకా, ఓ. రవి, వై.రవి, సుబ్బారెడ్డి, అమెరికన్ మాంటిస్సోరి విద్యార్థులు, ఆక్స్‌ఫర్డ్ పాఠశాల విద్యార్థులు, మార్వాడిసంఘ సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement