సమైక్యమే అజెండా | Samaikyandhra Agenda | Sakshi
Sakshi News home page

సమైక్యమే అజెండా

Published Thu, Aug 8 2013 3:57 AM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM

Samaikyandhra Agenda

సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో మరింత ఊపందుకొంది. ఊరూవాడా ప్రదర్శనలు, ర్యాలీలు, మానవహారాలు, వంటావార్పు, దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. న్యాయవాదులు, జర్నలిస్టులు, విద్యుత్ ఉద్యోగులు విడివిడిగా జేఏసీలుగా ఏర్పడి ఆందోళనలో పాలుపంచుకున్నారు.
 
 సాక్షి, రాజమండ్రి :‘ఓరి తె లుగు వాడా తగదింటి నడుమ గోడ’ అంటూ సమైక్యవాదులు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో ప్రతీ గ్రామంలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం వేళ్లూనుకుంది. జనం స్వచ్ఛందంగా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార వర్గాలు వేర్వేరు జేఏసీలుగా, రాజకీయేతర సంఘాలు, కుల సంఘాలు విడివిడిగా తమ నిరసనలు కొనసాగించాయి. మానవహారాలు, రాస్తారోకోలు, రోడ్లపై వంటావార్పు కార్యక్రమాలు, నిరాహార దీక్షలు నిర్వహించారు.
 
 ఉద్యమించిన విద్యుత్ ఉద్యోగులు
 విద్యుత్ ఉద్యోగులు బుధవారం సమైక్యాంధ్ర పోరులోకి దిగారు.  విశాఖపట్నం కేంద్రంగా ఈపీడీసీఎల్, ట్రాన్స్‌కోలకు చెందిన 12 సంఘాలు విద్యుత్ జేఏసీగా ఏర్పడ్డాయి. ఈ జేఏసీ జిల్లా చైర్మన్ జి. నరసింహారావు, కన్వీనర్ ఎన్.శామ్యూల్, కోశాధికారి వి.వి.ఎస్.ఎల్.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో రాజమండ్రిలోని  ఎస్‌ఈ కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్షా శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు. నిరశన దీక్షలు ఈనెల 11 వరకూ కొనసాగుతాయని విద్యుత్ జేఏసీ ప్రతినిధులు తెలిపారు. 
 
 జేఏసీల కార్యాచరణ 
 రాజమండ్రి కాస్మోపాలిటిన్ క్లబ్ లో బార్ కౌన్సిల్, వ్యాపార వర్గాల జేఏసీ ఆధ్వర్యంలో వివిధ ప్రజాసంఘాలు, అలాగే ఉభయగోదావరి జిల్లాల జర్నలిస్టులు జేఏసీగా ఏర్పడి రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశాయి. గురువారం నుంచి శాంతియుతంగా సమైక్య ఉద్యమం కొనసాగించాలని జర్నలిస్టుల జేఏసీ నిర్ణయించింది. 
 
 రాజమండ్రిలో...
 కోటగుమ్మం సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో దీక్షలు ఆరోరోజూ కొనసాగాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆల్కాట్‌తోట నుంచి కోటగుమ్మం వరకూ పాదయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఎమ్మెల్సీ బలసాలి ఇందిర, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీలక్స్ సెంటర్ నుంచి కోటగుమ్మం వరకూ ర్యాలీ నిర్వహించి పాత ఫిలింరీళ్లు దహనం చేశారు.  తాడితోట సెంటర్‌లో సెయింట్ జోసఫ్ పాఠశాల విద్యార్థులు మానవహారం నిర్మించారు. మున్సిపల్ ఉద్యోగులు, కలప వర్తకులు, వడ్రంగి పనివారు, రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్ అసోసియేషన్, క్యాటరింగ్ వర్కర్స్ ర్యాలీలు చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. స్కూల్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అభ్యాసకులు కోటగుమ్మం సెంటర్‌లో విన్యాసాలు నిర్వహించి సమైక్యవాదం వినిపించారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరుల ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇన్నీసుపేట వద్ద బీసీ హాస్టల్ విద్యార్థులు వంటా వార్పు నిర్వహించారు.  రాజమండ్రి రూరల్ మండలంలో  పంచాయతీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. లాలాచెరువు హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన 300  కుటుంబాలు నిరాహార దీక్షలో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. కడియం, ధవళేశ్వరంలో నిరసనలు కొనసాగాయి. 
 
 కాకినాడలో...
 జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడలో కేంద్రమంత్రి పళ్లంరాజు ఇంటి వద్ద ఆందోళన చేసి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటి వద్ద ఆందోళన చేసి ఆయన రాజీనామాకు డిమాండ్ చేశారు. జిల్లా సమాచార కేంద్రానికి తాళం వేశారు. మెయిన్‌రోడ్డులో భారీ ర్యాలీ చేశారు. వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ పార్లమెంటరీ పార్టీ నాయకుడు చలమశెట్టి సునీల్, కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ జెడ్పీ మాజీ చైర్మన్ వేణుగోపాలకృష్ణ, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ ఆందోళనల్లో పాల్గొన్నారు.  సీనియర్ జర్నలిస్టు వారణాసి సాయిపెరుమాళ్లు వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సహచరులు వారించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భానుగుడి సెంటర్‌లో సమైక్య హోమం నిర్వహించారు. సుమారు 40 ఆటో వర్కర్ల సంఘాలు నగర బంద్ పాటించాయి. క్వారీ లారీల సంఘం లారీల ప్రదర్శన చేపట్టింది. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు రిలే దీక్షలు ప్రారంభించారు. 
 
 కోనసీమలో...
 అమలాపురం, అమలాపురం రూరల్, ఉప్పలగుప్తంలలో జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీలు నిర్వహించారు. కేసీఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. జేసీబీ నిర్వాహకులు, నిర్మాణ కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో జేసీబీలతో ర్యాలీ జరిగింది. ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల సంఘం అమలాపురంలో ర్యాలీ నిర్వహించారు. నల్లావారి వీధిలో యువకులు కర్రసాము నిర్వహించారు. న్యాయవాదులు కోర్టుల వద్ద వంటా వార్పు చేపట్టారు. మంత్రి పినిపే విశ్వరూప్ పాల్గొన్నారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్డులో ర్యాలీ జరిగింది. వ్యవసాయశాఖ ఉద్యోగులు, మార్వాడీ సంఘాలు గడియారం స్తంభం సెంటర్‌లో నిరనన ప్రదర్శన చేశారు. ఆటోడ్రైవర్‌లు, తాపీమేస్త్రులు నిరసనలు నిర్వహించారు. కొత్తపేట, అంబాజీపేటల్లో ఆందోళనలు సాగాయి.  పి.గన్నవరం, అయినవిల్లిలో వైఎస్సార్ సీపీ దీక్షలు ఐదోరోజుకు చేరాయి.
 
 నిరాహార దీక్షలు
 సామర్లకోట, ఏలేశ్వరం, రామచంద్రపురంలలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరశన దీక్షలు కొనసాగాయి. సీతానగరం కోరుకొండ, తుని, రంపచోడవరం, రాజానగరంలో అడుసుమిల్లి రమేష్ ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది.  
 
 హైవేపై రాస్తారోకోలు
 ప్రత్తిపాడులో కాంగ్రెస్ కార్యకర్తలు, జగ్గంపేటలో వివిధ విద్యాసంస్థలకు చెందిన 5000 మంది 16వ నెంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గండేపల్లి మండలం మల్లేపల్లి జాతీయ రహదారిపై వంటావార్పు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ క్రికెట్ ఆడారు. తునిలో మున్సిపల్ కార్మికులు వంటా వార్పూ నిర్వహించారు. 
 
 ఆకట్టుకున్న ర్యాలీ 
 తెలుగుతల్లిని సోనియాగాంధీ బల్లెంతో పొడుస్తుంటే కారుతున్న రక్తాన్ని గెద్ద రూపంలో కేసీఆర్ తాగుతున్న చిత్రం రామచంద్రపురంలో అందరినీ ఆకట్టుకుంది. ఫొటో గ్రాఫర్స్ అసోసియేషన్ చిత్రీకరించిన ఈ బొమ్మతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పాల్గొన్నారు.   అనపర్తి, మండపేట నియోజకవర్గాలో దీక్షలు, ర్యాలీలు కొనసాగాయి. రంపచోడవరంలో ఆటోవర్కర్స్ యూనియన్ ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టింది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement