ఒకటే గమనం ఒకటే గమనం | Samaikyandhra Agitation @61 in prakasam district | Sakshi
Sakshi News home page

ఒకటే గమనం ఒకటే గమనం

Published Mon, Sep 30 2013 3:17 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

Samaikyandhra Agitation @61 in prakasam district

ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో ఉధృతంగా సాగుతోంది. రాష్ట్ర సమైక్యత కోసం ఉద్యమకారులు 61 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కూడా జిల్లావ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. రాస్తారోకోలు, మానవహారాలు, రిలే దీక్షలు, ప్రదర్శనలతో నిరసన తెలియజేశారు. ఒంగోలు నగరంలో ఎన్‌ఎన్‌ఎన్ స్కేటింగ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు చర్చి సెంటర్‌లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోడ్డుపై స్కేటింగ్ విన్యాసాలు ప్రదర్శించి రాష్ట్ర సమైక్యత కోసం నినదించారు. మార్కెట్ యార్డు వద్ద సిబ్బంది చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరాయి.  
 
 అద్దంకి పట్టణంలో  సమైక్యవాదుల రిలే దీక్షలు 42వ రోజు కొనసాగాయి. వీరికి రాజస్థాన్‌కు చెందిన వ్యాపారులు సంఘీభావం తెలిపారు. కొరిశపాడు మండలం రావినూతలలో ఇంజినీరింగ్ విద్యార్థులు రిలే దీక్షలకు కూర్చున్నారు. చీరాలలో సమైక్యాంధ్ర నిరసనలు మార్మోగుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ యూత్‌ఫోర్స్ సభ్యులు వాడరేవులోని సముద్రతీరంలో జలదీక్ష నిర్వహించారు. అలాగే ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు 33వ రోజుకు చేరాయి.  వేటపాలెంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పర్చూరులో న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్షలు 56వ రోజుకు చేరాయి.
 
 మార్టూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయులు జలదీక్ష చేపట్టారు. గిద్దలూరులో  తహసీల్దార్ కార్యాలయం వద్ద సమైక్యవాదులు భారీ మానవహారం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. అలాగే కర్నూలులో జరిగే సేవ్ ఆంధ్రప్రదేశ్‌కు జేఏసీ నాయకులు భారీగా తరలివెళ్లారు. బేస్తవారిపేటలో ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ర్యాలీ, రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కొమరోలులో తహసీల్దారు కార్యాలయ సిబ్బంది రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. కనిగిరి పట్టణంలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో దేవాంగనగర్ మైనార్టీ యూత్ ఆధ్వర్యంలో   రిలే దీక్ష చేశారు. అంతకు ముందు పట్టణంలో భారీ నిరసన ర్యాలీ చేశారు. అలాగే సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సాధన కళాశాల విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. గార్లపేట బస్టాండ్‌లో ఆటో కార్మికులు నిరసన ర్యాలీ చేసి, సర్వమత వేషధారణలతో నిరసన తెలిపారు. అలాగే హెచ్‌ఎంపాడులో ఆటో కార్మికులు ర్యాలీగా వచ్చి దీక్షాధారులకు సంఘీభావం తెలిపారు.  వంటా- వార్పు కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ  వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు 14వ రోజు రిలేదీక్ష చేపట్టారు. అలాగే టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పామూరులో  వికలాంగులు రిలే దీక్షలకు కూర్చున్నారు.
 
 మార్కాపురం పట్టణంలో క్రిస్టియన్ యూత్‌ఫోర్స్ నేతృత్వంలో సమైక్యాంధ్ర కోరుతూ సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పొదిలిలో భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ చేశారు. యర్రగొండపాలెంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు ఆకులు కట్టుకుని వినూత్నరీతిలో  నిరసన తెలిపారు. దోర్నాల పట్టణంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 27వ రోజుకు చేరాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement