కదంతొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
Published Fri, Oct 18 2013 6:19 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
పట్నంబజారు (గుంటూరు), న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమిస్తున్నారు. ఎంతటి పోరాటాలకైనా, ప్రాణ త్యాగాలకైనా వెనుకాడబోమని స్పష్టం చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గురువారం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆటోలు, రిక్షాలతో ర్యాలీలు నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమ న్వయకర్తలు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో కార్యకర్తలు, అభిమానులు, సమైక్యవాదులు, ఆటో, రిక్షా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కదంతొక్కారు. సమైక్య రాష్ట్రాన్ని కాంక్షిస్తూ నినాదాలు చేశారు. చిలకలూరిపేటలో ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించి సమైక్యవాదాన్ని చాటి చెప్పారు.
పిడుగురాళ్లలో పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఐలాండ్‌సెంటర్‌లో రాస్తారోకోను నిర్వహించారు. మంగళగిరిలో వైఎస్సార్ సీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల కో ఆర్డినేటర్, నియోజకవర్గ సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో ఎన్నారై జంక్షన్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అర్కే స్వయంగా ఆటో నడిపి నిరసన తెలిపారు. దాదాపు 200 ఆటోలు ,100 బైక్‌లు ప్రదర్శనలో పాల్గొన్నాయి. పొన్నూరులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం నుంచి ఐలాండ్‌సెంటర్ వరకు ఆటోలు,రిక్షాలతో ర్యాలీ నిర్వహించారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డి, ఎస్టీ విభాగం జిల్లా కన్వీనర్ మేరాజోతు హనుమంత్ నాయక్ ఆధ్వర్యంలో ఆటోలతో ర్యాలీ చేశారు.
అనంతరం రాస్తారోకో నిర్వహించారు. రేపల్లెలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాలూకా సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి సమైక్య రాష్ట్రాన్ని కాంక్షిస్తూ నినాదాలు చేశారు. నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడులో పార్టీ సమన్వయకర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, నూతలపాటి హనుమయ్య, రాతంశెట్టి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. తెనాలిలో పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్తలు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుదిబండి చినవెంకటరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో కొల్లూరులో రిక్షాలతో ర్యాలీ నిర్వహించారు.
వినుకొండలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ నన్నపనేని సుధ ఆధ్వర్యంలో పట్టణంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తలు ఈపూరి అనూఫ్, మందపాటి శేషగిరిరావు, కొల్లిపర రాజేంద్రప్రసాద్‌ల ఆధ్వర్యంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. బాపట్లలో నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలో దీక్ష శిబిరం కొనసాగుతుంది. నరసరావుపేటలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆటోలు, రిక్షాలతో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ షౌకత్‌ల ఆధ్వర్యంలో లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఆటోలు, ద్విచక్ర వాహనాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు.
79వ రోజు.. జిల్లాలో చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమం గురువారం 79వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పిడుగురాళ్లలో కేంద్రప్రభుత్వ కార్యాలయాలను ఏపీఎన్జీవోలు మూసివేయించారు. మాచర్లలో కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు మూసివేయించి నిరసన తెలియజేశారు. నరసరావుపేటలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పొన్నూరులో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రేపల్లెలో ఎన్జీవోలు చేపట్టిన దీక్షలు 56వ రోజుకు చేరుకున్నాయి. తెనాలిలో మున్సిపల్ ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. వేమూరులో కేంద్ర ప్రభుత ్వ కార్యాలయాలు మూతపడ్డాయి. గుంటూరు హిందూ కళాశాల సెంటర్‌లో రాజకీయ జేఏసీ దీక్ష వేదికపై రాష్ట్ర విభజనను నిరసిస్తూ పెదకాకాని శివాలయ పాలక మండలి సభ్యులు రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో అపరిచితుడనే లఘునాటిక ైప్రదర్శించారు.
Advertisement