జనాగ్రహం!
Published Fri, Dec 6 2013 3:39 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి ప్రతినిధి, గుంటూరు :పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో జిల్లాలో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. విభజనకు అనుసరించాల్సిన విధివిధానాల ఆధారంగా జీవోఎం రూపొందించిన నివేదికపై కేంద్ర కేబినెట్ గురువారం సాయంత్రం సమావేశం అయింది. ఈ నివేదికపై మూడున్నర గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశం పట్ల జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూశారు. రాత్రి 8.30 గంటల సమయంలో కేంద్ర హోమ్‌శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకుందని ప్రకటించడంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి.
ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ నగర విభాగం కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలోనూ, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలోనూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ముఖ్యంగా కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు ప్రజల్ని పుట్టి ముంచారనే విమర్శలు వచ్చాయి.. విభజనకు లేఖ ఇచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రజల్లోకి వచ్చిన కపట నాటకాలు ఆడారని, ఇటువంటి నేతలకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని కేంద్రం ప్రకటించినా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ ప్రాజెక్టును సాగనిస్తారా అనే సందేహాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. సీట్ల కోసం, ఓట్ల కోసం కాంగ్రెస్ నిస్సిగ్గుగా రాజకీయం చేసి భవిష్యత్ తరాలకు తీరని నష్టం కలిగించాయని, విద్యార్థులకు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారని, తెలంగాణలోని ఆంధ్రుల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందనే భయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యలు..
ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశానంతరం నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో గురువారం ఇంటిలిజెన్స్ అధికారుల సూచన మేరకు పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని నియోజకవర్గాలకు కేంద్ర పోలీసు బలగాలను తరలించారు. మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, కేంద్రమంత్రి జేడీ శీలం నివాసాల ఎదుట బారీకేడ్లు అడ్డంపెట్టి సీఆర్‌పీఎఫ్ బలగాల్ని ఉంచారు. నరసరావుపేటలో మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి, బాపట్లలో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి నివాసంతో పాటు తెనాలిలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇంటివద్ద సైతం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులంతా జిల్లా కేంద్రంలోనే ఉండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్ని పట్టణాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచే స్థానిక పోలీసు సిబ్బందితో పాటు సీఆర్‌పీ కంపెనీ బలగాలు ప్రధాన కూడళ్లలో మోహరించాయి. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల విగ్రహాల వద్ద కూడా పోలీసు బందోబస్తును ముమ్మరం చేశారు.
వైఎస్సార్‌సీపీ బంద్‌కు సమైక్యాంధ్ర జేఏసీ మద్ధతు..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం సీమాంధ్ర బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ గురువారం ప్రకటించారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా తలపెట్టిన సీమాంధ్ర బంద్‌లో అన్ని జేఏసీలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 8వ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సీమాంధ్ర జేఏసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చే సమయానికి నిరవధిక బంద్, తీవ్రమైన ఆందోళనలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించామని, సమావేశంలో ఉద్యోగ, విద్యార్థి జేఏసీ ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. శుక్రవారం సీమాంధ్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ మండూరి వెంకటరమణ ప్రకటించారు.
ఇది దుర్మార్గం: మర్రి రాజశేఖర్
పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు వలన సీమాంధ్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ పేర్కొన్నారు. సమైక్యాంధ్ర సాధన కోసం అ టు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు తీవ్రస్థాయి లో ఉద్యమాలను చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం బంద్ ను జయప్రదం చేయాల్సిందిగి పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తెలుగుజాతిని
అవమానించిన కేంద్రం : ఆర్కే
తెలుగుజాతిని తీవ్రంగా అవమానిస్తూ తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం చరిత్రలో దుర్ధినంగా మిగిలిపోతుందని వైఎస్సార్ సీపీ గుంటూరు, కృష్ణా జిల్లాల సమన్వయకర్త ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణాకు కేంద్ర కేబినేట్ ఆమోదం ప్రకటన అమానుష చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్, టీడీపీల్ని చరిత్ర ఎన్నటికీ క్షమించదన్నారు.
Advertisement
Advertisement