పల్లెపల్లెన సమైక్య పోరు
Published Sun, Aug 11 2013 4:18 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
ఒంగోలు, న్యూస్‌లైన్:సమైక్యాంధ్ర నినాదం పల్లెపల్లెనూ కదిలిస్తోంది. ఇప్పటికే ఒంగోలు నగరంతో పాటు, జిల్లాలోని పట్టణ ప్రాంతాలన్నీ ఉద్యమ హోరుతో అట్టుడుకుతుంటే క్రమంగా పల్లెల్లో సైతం సమైక్య నినాదం హోరెత్తుతోంది. పలుచోట్ల సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మలను శనివారం దహనం చేశారు. పర్చూరు నియోజకవర్గంలో న్యాయవాదులు చేపట్టిన 6వ రోజు రిలే దీక్షకు వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ గొట్టిపాటి నరసయ్య సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు గొట్టిపాటి భరత్ తాను సైతం సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నానని నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.
ఆయనకు మద్దతుగా యద్దనపూడి హరిప్రసాద్, బూక్యా రాజానాయక్, పొదిలి రాఘవలు కూడా దీక్షలో కూర్చున్నారు. రాష్ర్టం విచ్ఛిన్నమైతే విద్య, ఉపాధి అవకాశాలు లేక యువత భవిత నాశనమవుతుందని, అందువల్ల రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని భరత్ డిమాండ్ చేశారు. ఒంగోలులో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆ పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రల కారణంగానే రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిందని, ఆ రెండు పార్టీలు ఆ నెపాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌పైకి నెట్టాలని చూడటం దారుణమన్నారు.
ప్రజలు ఇప్పటికైనా గమనించి నాటకాల రాయుళ్లకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఒంగోలులో న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షకు వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య సంఘీభావం ప్రకటించారు. దక్షిణ బైపాస్‌లో సమైక్యాంధ్ర ఫ్రంట్ 20 నిముషాల పాటు రాస్తారోకో నిర్వహించగా, విద్యార్థి జేఏసీ స్థానిక బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసింది. ఉదయాన్నే చర్చి సెంటర్‌లో ఒంగోలు వాకర్స్ క్లబ్ సభ్యులు, మధ్యాహ్నం రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు మానవహారం నిర్వహించారు.
చీరాలలో 500 మందికిపైగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించి గడియార స్తంభం సెంటర్‌లో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. కనిగిరిలో సమైక్యాంధ్రకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి కదిరి బాబూరావు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అనంతరం కనిగిరిలోని పామూరు బస్టాండులో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హిజ్రాలు కూడా వారితో జత కలిసి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అద్దంకిలో భజన బృందాలు పట్టణ వీధుల్లో భజనలు చేస్తూ రాష్ట్ర విభజనను నిరశించారు.
అనంతరం పాత బస్టాండు సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. సంతమాగులూరు బ్రాహ్మణ సంఘం రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపింది. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో ఆంధ్రమహాసభ జీపును ఏర్పాటు చేసుకొని సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రచార జాతా ప్రారంభించింది. గిద్దలూరులో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసన తెలిపారు. కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాలకు సంబంధించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పలువురు నిరసన ర్యాలీ నిర్వహించడంతోపాటు ధర్నా చేపట్టారు.
మార్కాపురంలో ఏపీటీసీఏ ఆధ్వర్యంలో 1500 మందికిపైగా విద్యార్థులు ర్యాలీ చేసి కోర్టు సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, వైఎస్సార్‌సీపీ మార్కాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నా హనుమారెడ్డిలు వారికి సంఘీభావం ప్రకటించారు. కేసీఆర్, సోనియా, దిగ్విజయ్ సింగ్ దిష్టి బొమ్మలను ఏపీటీసీఏ సభ్యులు దహనం చేశారు.
Advertisement
Advertisement