సమైక్యాంధ్ర ఉద్యమం శనివారం 74వ రోజుకు చేరింది
Published Sun, Oct 13 2013 12:41 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM
గుంటూరు, న్యూస్‌లైన్: పండగ రోజుల్లోనూ సమైక్యాంధ్ర పోరు ఆగలేదు. దసరా వచ్చినా ఉద్యమ బాట వీడలేదు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్య రాష్ట్రాన్ని కాంక్షిస్తూ జిల్లాలో చేపట్టిన ఉద్యమం శనివారం 74వ రోజుకు చేరింది. ఉపాధ్యాయ, విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమించినా ప్రజలు స్వచ్ఛందంగా ముందుండి ఉద్యమాన్ని నడుపుతున్నారు. రోడ్లపై రాస్తారోకోలు, ప్రదర్శనలు చేస్తూ ఆందోళనను కొనసాగిస్తున్నారు. సమైక్య నినాదాన్ని వినిపిస్తున్నారు. గుంటూరులో ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో వినూత్నంగా గొడుగులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రేపల్లెలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు 51వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నెహ్రూ విగ్రహం వద్ద రైతు గర్జన మహాసభను ఏర్పాటు చేశారు. రైతులు భారీగా పాల్గొని విభజన జరిగితే రాష్ట్రం ఏడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరులో కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు.
ప్రత్తిపాడులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నరసరావుపేట, చిలకలూరిపేట, బాపట్ల,పొన్నూరులో ఏపీ ఎన్జీవో నాయకుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తెనాలిలో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మున్సిపల్ ఉద్యోగులు చేపట్టిన రిలేదీక్షలు శనివారం నాటికి 48రోజుకు, టీడీపీ రిలేదీక్షలు 46వ రోజుకు చేరాయి. గుంటూరులో విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. వారి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఆ సంస్థ అధినేత రత్తయ్య వారిని ఒప్పించి దీక్ష విరమింపచేశారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ వట్టిచెరుకూరు మండలానికి చెందిన 50 మంది రైతులు గుంటూరు హిందూ కళాశాల సెంటర్‌లో రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
Advertisement
Advertisement