సమైక్య శంఖారాం
Published Thu, Oct 3 2013 4:23 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
సాక్షి, నెల్లూరు : సమైక్యాంధ్ర సాధనే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. వైఎస్సార్‌సీపీ అధిష్టానం పిలుపు మేరకు జిల్లాలోని పది నియోజక వర్గాల పరిధిలో పార్టీ సమన్వయకర్తలు, ముఖ్య నేతలు బుధవారం నుంచి ఆమరణ దీక్షలకు దిగారు. విభజనకు అంగీకరించేది లేదంటూ గళమెత్తారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నినదించారు. సమైక్యాంధ్ర కోసం ఏ త్యాగానికైనా సిద్ధమంటూ వెలుగెత్తి చాటారు. నిరాహార దీక్ష చేపట్టిన నేతలకు వైఎస్సార్‌సీపీ ముఖ్యనేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ సంఘీభావం
ప్రకటించారు. ఎంపీ మేకపాటి నెల్లూరు సిటీ, రూరల్ నియోజక వర్గాలతో పాటు ఆత్మకూరు, ఉదయగిరిలకు వెళ్లి దీక్షలకు సంఘీభావం తెలిపారు. జిల్లా కన్వీనర్ మేరిగ మురళీ గూడూరు, సూళ్లూరుపేట, నెల్లూరు నియోజక వర్గాల పరిధిలో పర్యటించి దీక్షలకు సంఘీభావం తెలిపారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేపట్టిన దీక్షలకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం జిల్లాలో పార్టీ నేతలందరూ ఒక్కసారిగా ఆమరణ దీక్షలకు దిగడం సమైక్యవాదుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. వైఎస్సార్‌సీపీ నిర్ణయాన్ని జిల్లా ప్రజలు హర్షిస్తున్నారు.సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీకే తమ మద్దతు ఉంటుందని పేర్కొంటున్నారు.
నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ సిటీ నియోజక వర్గ సమన్వయకర్త డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష , ఆర్టీసీ బస్టాండ్ వద్ద రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి ఎంపీ మేకపాటి, పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి తోపాటు సిటీ,రూరల్ నియోజక వర్గ పరిధిలోని కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి వారిద్దరికి సంఘీభావం ప్రకటించారు. వెంకటగిరిలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ నియోజక వర్గ కన్వీనర్ కొమ్మి లక్ష్మయ్యనాయుడు సమైక్యాంధ్రకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తొలిరోజు దీక్షలో 300 మంది నాయకులు పాల్గొన్నారు. నియోజక వర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చి సంఘీభావం ప్రకటించారు.
ఆత్మకూరు పట్టణం బస్టాండ్ సెంటర్‌లో తొలిరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి రిలేనిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కూర్చొని సంఘీభావం ప్రకటించారు. సూళ్లూరుపేటలో బస్టాండ్ సెంటర్‌లో పార్టీ సమన్వయకర్తలు దబ్బల రాజారెడ్డి, నెలవల సుబ్రమణ్యం, కిలివేటి సంజీవయ్య ఒకే వేదికపై ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ హాజరై సంఘీభావం తెలిపారు. నియోజకవర్గంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఆరు మండలాల కన్వీనర్లు, సర్పంచ్‌లు, అభిమానులు దీక్షలో కూర్చుని సమన్వయకర్తలకు సంఘీభావం తెలిపారు. వైఎస్సార్‌సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ట్రంకురోడ్డులోని గాంధీ బొమ్మ సెంటర్‌లో ఆమరణ నిరాహారదీక్షను బుధవారం ప్రారంభించారు.
ఈ దీక్షా శిబిరానికి కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి వెళ్లి సంఘీభావం ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ సేవాదళం రాష్ర్ట కన్వీనర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమన్వయకర్త కోటింరెడ్డి వినయ్‌రెడ్డి దీక్ష శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. వెంకటాచలంలో పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధనరెడ్డి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, టీపీగూడూరు, పొదలకూరు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కాకాణికి సంఘీభావం తెలిపారు. ఉదయగిరి బస్టాండ్‌లో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కార్యక్రమానికి హాజరై ఎమ్మెల్యేకు సంఘీభావం ప్రకటించారు.
నియోజకవర్గంలోని పార్టీ మండల కన్వీనర్లు, సర్పంచ్‌లు, వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున వెళ్లి సంఘీభావం తెలిపారు. గూడూరు టవర్ క్లాక్ సెంటర్‌లో పార్టీ సమన్వయకర్తలు పాశం సునీల్‌కుమార్, డాక్టర్ బాలచెన్నయ్య, పార్టీ నాయకుడు బత్తిన విజయ్‌కుమార్ దీక్ష చేపట్టారు. వీరికి జిల్లా పార్టీ కన్వీనర్ మేరిగ మురళీధర్, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి సంఘీభావం తెలిపారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనతో పాటు కొడవలూరు, కోవూరు, ఇందుకూరుపేట మండల కన్వీనర్లతో పాటు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి దీక్షను కొనసాగిస్తున్నారు. ప్రసన్న దీక్షకు నియోజక వర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం ప్రకటించారు.
Advertisement
Advertisement