రేషన్ డీలర్లపై కొరడా
Published Sun, Nov 17 2013 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM
అనపర్తి, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర ఉద్యమహోరులో అధికారులు పట్టించుకోరనే ధైర్యంతో రేషన్ డీలర్లు బరితెగించారు. అనపర్తి మండలంలో కార్డుదారుల పొట్టకొట్టి సరుకులను నల్లబజారుకు తరలించేసి సొమ్ము చేసుకున్నారు. ఈ వ్యవహారంపై గ్రీవెన్‌స సెల్‌కు ఫిర్యాదు అందింది. దీంతో విచారణ మొదలుపెట్టిన అధికారులకు తీగ దొరికింది. అది పట్టుకు లాగితే అక్రమాల డొంక మొత్తం కదిలింది. మండలంలోని 39 మంది రేషన్ డీలర్లు కుమ్మక్కై ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన పంచదార, కిరోసిన్‌ను పక్కదారి పట్టించి.. చివరకు అడ్డంగా దొరికిపోయారు.
ఏం జరిగిందంటే..?
అనపర్తి మండలంలో మొత్తం 39 చౌకధరల దుకాణాలున్నాయి. వీటి ద్వారా 24,500 మంది కార్డుదారులకు సెప్టెంబర్ నెలలో రూ.3,39,300 విలువైన కిరోసిన్, పంచదార సరఫరా చేయాల్సి ఉంది. రూ.2.34 లక్షల విలువైన 15,600 లీటర్ల కిరోసిన్, రూ.లక్షా 5 వేల విలువైన 7,800 కేజీల పంచదార ఇవ్వాలి. కానీ, వీటిని డీలర్లు లబ్ధిదారులకు ఇవ్వలేదు. పంచదార, కిరోసిన్ విడుదల చేయించుకున్నట్టుగా ార్డుదారుల సంతకాలను తమవద్ద రికార్డుల్లో ఫోర్జరీ చేశారు. ఈ విషయం తెలియడంతో కుతుకులూరు పంచాయతీ మాజీ సభ్యుడు పులగం సూర్యనారాయణరెడ్డి అనపర్తి మండల గ్రీవెన్స్ సెల్‌లో అక్టోబర్ 24న ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా అధికారుల ఆదేశాల మేరకు రామచంద్రపురం ఆర్డీఓ కె.సుబ్బారావు విచారణ జరిపారు. అవకతవకలు వాస్తవమేనని తేల్చారు. దీనిని తీవ్రంగా పరిగణించి, మొత్తం 39 మంది రేషన్ డీలర్లను తొలగించారు.
అసలు సరుకు విలువపై మూడింతలు అంటే రూ.46,23,737 జరిమానా విధించారు. వారి రిజిస్టర్లను సీజ్ చేశారు. వారిపై 6ఎ కేసు నమోదు చేశారు. వేటు పడిన డీలర్లు జాయింట్ కలెక్టర్ కోర్టులో నెల రోజుల్లోగా అప్పీలు చేసుకొనే వీలు కల్పిస్తూ ఆర్డీఓ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు తహశీల్దార్ జీఏఎల్‌ఎస్ దేవి విలేకరులకు వివరించారు. కార్డుదారులకు ఇబ్బంది లేకుండా చూసేందుకుగాను రేషన్ షాపులను ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) సభ్యులకు తాత్కాలికంగా అప్పగిస్తూ ఆర్డీఓ ఆదేశాలు జారీ చేశారు. సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలని, అవకతవకలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని తహశీల్దార్ ఐకేపీ సభ్యులను హెచ్చరించారు. స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
అండాదండా లేకుండా అసాధ్యమే!
ఇదిలా ఉండగా అధికారుల ప్రమేయం లేకుండా ఇంతమంది డీలర్లు కుమ్మక్కై ఒక నెల సరుకులను దారి మళ్లించడం అసాధ్యమని స్థానికులు అంటున్నారు. ఒక నెల సరుకులు ఇవ్వకుండా మొత్తం మండలంలోని కార్డుదారులందరి సంతకాలూ ఫోర్జరీ చేసి సరుకు కాజేస్తుంటే తరువాత నెలలోనైనా అధికారులు గుర్తించకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డీలర్ల రికార్డులను ప్రతి నెలా తనిఖీలు చేయకపోవడం కూడా ఇలాంటి అవకతవకలకు కారణమవుతోందని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Advertisement