బంద్ జోరు.. నిరసనల హోరు
Published Sun, Oct 6 2013 2:19 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరే ట్, న్యూస్‌లైన్ :జిల్లాలో సమైక్య ఉద్యమం ఊరూవాడలను దాటి వీధుల్లోకి విస్తరించింది. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన 72 గంటల బంద్ పిలుపునకు, సమైక్యాంధ్ర జేఏసీ 48 గంటల బంద్ పిలుపునకు ప్రతి ఒక్కరూ స్పందించారు. రెండో రోజు శనివారం కూడా సంపూర్ణంగా బంద్ పాటించారు. ఎక్కడ చూసినా కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. ఉద్యమకారులు ఎక్కడికక్కడ రోడ్లపై టైర్లు కాల్చి, చెట్లకొమ్మలు వేసి రాకపోకలను స్తంభిం పజేశారు. పొందూరు, టెక్కలి, పలాస, తిలారు స్టేషన్లలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు, సమైక్యవాదులు రైల్‌రోకో నిర్వహించారు. కేంద్ర మంత్రి కృపారాణి, రాష్ట్ర మంత్రులు కోండ్రు మురళి, శత్రుచర్ల విజయరామరాజుల క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిముందు జర్నలిస్టులు వంటావార్పు చేసి జాతీయ రహదారిపై భోజనాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
శ్రీకాకుళంలో పురపాలక సంఘం మాజీ చైర్‌పర్సన్ ఎం.వి.పద్మావతి ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. పద్మావతి, ఆమె కుమారుడు ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ఇంటిపైకి కోడిగుడ్లు విసిరి నిరసన తెలిపారు. రిమ్స్‌లో నర్సింగ్ సిబ్బంది 72 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. గుజరాతీపేట గర్జన పేరుతో యువకులు భారీ ర్యాలీ నిర్వహించి దుకాణాలను బంద్ చేయించారు. రాజాంలో మంత్రి కోండ్రు మురళీమోహన్ క్యాంపు కార్యాలయాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. ఆ కార్యాలయానికి ఇల్లు అద్దెకు ఇచ్చిన యజమాని నివాసం వద్ద ధర్నా చే శారు. తక్షణం క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయిం చాలని డిమాండ్ చేశారు.
ఇంటి యజమానితో టులెట్ బోర్డు పెట్టించారు.
పాలకొండలో వరుసగా రెండోరోజు బంద్ విజయవంతమైంది. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సోనియా, సీమాంధ్ర కేంద్రమంత్రుల శవయాత్ర నిర్వహించారు. మత్స్యకారులు వలలతో ప్రదర్శన చేశారు. మత్స్యకారులతోపాటు కొండవీధి దళితులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఉపాధ్యాయ ఉమ్మడి ఐక్యవేదిక వద్ద తమ్మినాయుడు విద్యా సంస్థల ఉపాధ్యాయులు రిలే దీక్ష చేశారు. విద్యార్థులు ప్రతిజ్ఞ చేసి మానవహారంగా ఏర్పడ్డారు.
మెడికల్ ల్యాబరేటరీల యజమానులు రోడ్డుపై ఉచితంగా రక్తపరీక్షలు నిర్వహించారు. గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం సమర్పిం చారు. వీరఘట్టంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రేలారే కార్యక్రమం నిర్వహించారు. భామిని మండలం పసుకుడిలో సీమాంధ్ర కేంద్రమంత్రులకు కర్మకాండ నిర్వహించారు. సీతంపేటలో ఐటీడీఏ ఉద్యోగులు, గిరిజన ఐక్యవేదిక ప్రతినిధులు వంటావార్పు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఆమదాలవలసలో జేఏసీ ఆధ్వర్యంలో బంద్, ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి. లక్ష్ముడుపేట, తిమ్మాపురం, పార్వతీశంపేట, చింతాడ, కొత్తవీధి ఎంకెఎం నగర్, కొండపేట, ఉప్పినివలసల్లో సమైక్యవాదులు రోడ్లను దిగ్బంధించారు. చిన్నకృష్ణానగర్ మహిళలు, యువకులు ర్యాలీ నిర్వహించారు.
టెక్కలిలో ఆదిఆంధ్ర వీధి యువకులు, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు కేంద్రమంత్రి కృపారాణి ఇంటిని ముట్టడించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. బైక్ ర్యాలీ చేస్తున్న టీడీపీ కార్యకర్తలను అడ్డుకుని, రాష్ట్ర విభజనపై చంద్రబాబు వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలకు పార్టీ జెండాలను తీసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వైఎస్‌ఆర్‌సీపీ నేత దువ్వాడ వాహనానికి ఉన్న వైఎస్‌ఆర్ సీపీ జెండాను తీసేందుకు యత్నించగా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. బైక్ ర్యాలీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును సైతం సమైక్యవాదులు అడ్డుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి వాహనాలను పంపివేశారు. కరాటే గురువు ఎన్.శేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులు విన్యాసాలు ప్రదర్శించి నిరసన తెలిపారు.
పలాసలో వైఎస్‌ఆర్‌సీపీ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, టీడీపీ, ప్రెస్‌క్లబ్, దళిత సం ఘాలు వేర్వేరుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. పలాస మండలం శాసనాం వద్ద జాతీయ రహదారిపై సమైక్యవాదులు రాస్తారోకో చేపట్టి వంటావార్పు చేశారు. బ్రాహ్మణతర్లాలో సోనియా, కేసీఆర్‌ల శవయాత్ర నిర్వహించారు. సున్నాడ, గరుడుఖండి, లక్ష్మీపురం, జగదేవుపురం, కిష్టుపురం, బ్రాహ్మణతర్లా, టెక్కలిపట్నం, శివరాంపురం, పొల్లాడ , సూర్యమణిపురం, ధర్మపురం గ్రామాల్లో రోడ్లను దిగ్బంధించారు. వజ్రపుకొత్తూరులో టీడీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడి సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు.
Advertisement
Advertisement