సమైక్య స్టార్ జగన్ | samaikyandhra star ys jagan : dharmana prasad | Sakshi
Sakshi News home page

సమైక్య స్టార్ జగన్

Published Mon, Feb 10 2014 1:49 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

సమైక్య స్టార్ జగన్ - Sakshi

సమైక్య స్టార్ జగన్

 పార్టీ మారడంలో నాది స్వార్థం కాదు.. ఆవేదనే: మాజీ మంత్రి ధర్మాన
 
 శ్రీకాకుళం, న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని, ఆయనే నిజమైన సమైక్య స్టార్ అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలో జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దివంగత సీఎం రాజశేఖరరెడ్డి తర్వాత అంతటి నాయకత్వం లేదని, ప్రస్తుత రాజకీయాల్లో నాయకత్వ లక్షణాలు, తండ్రి ధీరత్వం, రాజసం జగన్‌లో ఉన్నాయన్నారు. రాజన్న రాజ్యం మళ్లీ జగన్ నాయకత్వంలో వస్తుందన్న ఆశతో ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. సమైక్య నినాదాన్ని 2010లోనే పార్లమెంట్‌లో విన్పించిన నాయకుడు జగన్ ఒక్కడేనని చెప్పారు. ‘‘సమైక్య చాంపియన్లు అని ఎవరికి వారు అనుకుంటే సరిపోదు. ప్రజలంతా జగన్‌నే సమైక్య స్టార్‌గా నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలో నూరు శాతం సీట్లను గెలిపించుకుని వైఎస్సార్‌సీపీని అధికారంలో తేవడమే మా లక్ష్యం’’ అని ఉద్ఘాటించారు.
 
  తాను పార్టీ మారడంలో ఎలాంటి స్వార్థం లేదని, రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారన్న ఆవేదనతో, జగన్ నాయకత్వంపై పూర్తి విశ్వాసంతో వైఎస్సార్‌సీపీలోకి వచ్చానన్నారు. రాష్ట్ర విభజనలో అధికార పార్టీని నిలదీయాల్సిన చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించడంలో  విఫలమయ్యారన్నారు. స్వార్థ రాజకీయాల కోసం 2 ప్రసార సాధనాలను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆకలి, కన్నీరును రాజకీయం చేస్తున్న, చేసిన ఘనత బాబుకే దక్కుతుందని, అదే సామాన్యుల ఆకలిని తీర్చి, కన్నీటిని తుడిచేలా ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలు అమలు చేసిన ఘనత మహానేత వైఎస్సార్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.
 
 సోనియాకు రాజీనామా లేఖ
 ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసినట్లు పేర్కొంటూ సోనియాగాంధీకి ఆదివారం ఉదయం ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆవేదన చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement