ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్ర ం ఒంగోలు నగరంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లకు వ రుసగా రెండో రోజూ సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తగిలింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్‌జీఓల ఉద్యమ కార్యాచరణలో భాగంగా రెండు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌ల కార్యకలాపాలను అడ్డుకున్నారు. శుక్రవారం కూడా అన్ని కార్యాలయాలు, బ్యాంక్‌ల్లో లావాదేవీలు స్తంభించిపోయాయి. ప్రధానంగా బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టాఫీసులు, ఎల్‌ఐసీ వంటి కార్యాలయాలతో పాటు, ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, గ్రామీణ బ్యాంక్‌లు, కో ఆపరేటివ్ బ్యాంక్‌లతో పాటు దాదాపు 60 బ్యాంక్ శాఖలు మూతపడ్డాయి. కోట్లాది రూపాయల లావాదేవీలు స్తంభించి పోయాయి. దీంతో ఖాతాదారులకు ఇబ్బందులు తప్పలేదు. మరోపక్క బ్యాంక్‌ల కార్యకలాపాలు నిలిచిపోవడంతో నగరంలో పలు ఏటీఎంలలో నగదు లేని పరిస్థితి ఏర్పడింది.
పనబాక దిష్టిబొమ్మతో శవయాత్ర
కేంద్ర పెట్రోలియం, సహజవాయువులశాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి తీరును నిరసిస్తూ ఉద్యోగులు ఆమె దిష్టిబొమ్మతో శవయాత్ర చేపట్టారు. స్థానిక కలెక్టరేట్ నుంచి చర్చి సెంటర్ వరకు యాత్ర నిర్వహించారు. ఏడుపులతో వినూత్న నిరసన తెలిపారు. పనబాక వ్యాఖ్యలపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆమెకు శాపనార్థాలు పెట్టారు. రాజీనామా చేయకపోతే రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తామంటూ హెచ్చరించారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న మంత్రిని జిల్లాలో తిరగనిచ్చే పరిస్థితి లేదన్నారు. పోలీసుల సహాయంతో కాకుండా మామూలుగా ప్రజల్లోకి రావాలని, ప్రజల్లోకి వస్తే తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఉద్యోగులు హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అబ్దుల్‌బషీర్, బండి శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి, కేఎల్ నరసింహారావు, శరత్, స్వాములు, ప్రకాశ్,కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థుల ఆందోళన
రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్ర ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్థానిక హెచ్ సీఎం సెంటర్‌లో వినూత్న నిరసన తెలిపారు. రోడ్డుపై పొయ్యిలు ఉంచి వాటిపై బాండీలు ఏర్పాటు చేసి మంట పెట్టారు. కాగుతున్న బాండీల్లో విద్యార్థులు కూర్చుని నిరసన తెలిపారు. ఉద్యమాలతో సీమాంధ్ర ప్రజలు ఉడుకుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చే యాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫ్రంట్ నాయకులు నాగరాజు, రాజశేఖర్, చైతన్య వినోద్ పాల్గొన్నారు.
జాతీయ జెండాతో ప్రదర్శన
సమైక్యాంధ్రకు మద్దతుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగులు జాతీయ జెండాతో నిరసన తెలిపారు. మార్కెట్ కార్యాలయం నుంచి అద్దంకి బస్టాండ్, మార్కెట్ సెంటర్, పోట్టి శ్రీరాములు విగ్రహం మీదుగా 364 అడుగుల జాతీయ జెండాతో చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చర్చి సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నినదించారు. రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంగీకరించేది లేదని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర కార్యాలయాలకు సమైక్య సెగ
Published Sat, Sep 21 2013 4:22 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement