వైఎస్సార్ జిల్లా: తెలంగాణ నోట్ కు వ్యతిరేకంగా సమైక్య ఆందోళన కారులు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. సీమాంధ్రలో తీవ్ర స్థాయిలో ఉద్యమం జరుగుతున్నా.. కేంద్రం వాటిని పట్టించుకోకుండా తెలంగాణ నోట్ ను రూపొందిస్తూ ముందుకు పోతున్న తరుణంలో సమైక్య వాదలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో నేటి అర్ధరాత్రి నుంచి 72 గంటల పాటు బంద్ పాటించడానికి మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్సార్ సీపీ సమన్వయకర్త మల్లికార్జున రెడ్డిలు పిలుపునిచ్చారు.
కాగా, కమలాపురం, రాజంపేటలలో శుక్రవారం నుంచి బంద్ పాటించనున్నారు. ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేటలో బంద్ కు సమైక్య వాదులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ నోట్ పై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ సంతకం చేసిన వెంటనే చిత్తూరు జిల్లా తిరుపతి రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో రవాణా వ్యవస్ధకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టీనోట్‌కు వ్యతిరేకంగా కడప ఏడు రోడ్ల సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మానవహారం నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం చేశారు. టీనోట్‌కు వ్యతిరేకంగా శ్రీకాకుళం రణస్థలం వద్ద జాతీయరహదారిని దిగ్బంధించారు. పలాసలో సమైక్యవాదుల ఆందోళనలు చేపట్టి ఆ నోట్ ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మంత్రి పితాని సత్యనారాయణ కారును సమైక్యవాదులు అడ్డుకుని రాజీ నామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన నోట్పై కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేశారు. ఆ తరువాత ఆ ప్రతులను కేంద్ర మంత్రులను పంపారు. దీంతో నోట్పై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని నివాసంలో జరిగే సమావేశంలో ఈ నోట్పై చర్చిస్తారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఏర్పాటు చేసేవిధంగా నోట్ తయారయినట్లు తెలుస్తోంది.