
వ్యర్థ వేదన
కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మె
చెత్త కుప్పలుగా పట్టణాలు
తుతూమంత్రంగా {పత్యామ్నాయ చర్యలు
రంజాన్ దృష్ట్యా కొన్ని చోట్ల పట్టు సడలించిన కార్మికులు
జిల్లా వ్యాప్తంగా పొంచి ఉన్న వ్యాధులు
తిరుపతి నగరంతో పాటు ప్రధాన పట్టణాల్లో రోడ్లపైనే వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా వీధులన్నీ దుర్గంధభరితంగా మారాయి. దీనికితోడు జిల్లాలో వర్షం కురుస్తుండడంతో చెత్త నుంచి వస్తున్న దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అంటు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని జనం ఆందోళన చెందుతున్నారు.
తిరుపతి: తిరుపతి నగరంతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులు వారం రోజులుగా సమ్మె చేస్తుండడంతో పారిశుధ్ధ్యంపై పెను ప్రభావం చూపుతోంది. వీధుల్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తోంది. రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కార్మికులు మదనపల్లెలో రెండు రోజులపాటు సమ్మె సడలించారు. చిత్తూరు కార్పొరేషన్‌లో మేయర్ కఠారి అనురాధ జరిపిన చర్చలు సఫలం కావడంతో కార్మికులు విధులకు హాజరవుతున్నారు. శ్రీకాళహస్తిలో బుధవారం సాయంత్రమే సమ్మె విరమించి కార్మికులు విధుల్లో చేరారు. పలమనేరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద కార్మికులు వంట వార్పు చేసి ఆందోళన చేపట్టారు. తిరుపతి నగరంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట గురువారం కార్మికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వారికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి మద్దతు తెలిపారు. తిరుపతి నగరంలో యాత్రికులను దృష్టిలో ఉంచుకుని కొన్నిచోట్ల మాత్రమే చెత్తను తొలగిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి దుర్భరంగా మారింది.
పుంగనూరు కార్యాలయం ఎదుట గురువారం కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. వారికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజక సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సంఘీభావం తెలిపారు. రెండురోజుల్లో సమస్యను పరిష్కరించపోతే పార్టీ తరపున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పుత్తూరు, నగరిలో మున్సిపల్ కార్మికులు ఆందోళనలు కొనసాగించారు.
పొంచిఉన్న వ్యాధులు
పేరుకుపోయిన చెత్తకు, వర్షం తోడవడంతో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. దీనికితోడు డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తుండడంతో అతిసార, టైఫాయిడ్, విష జ్వరాల బారిన పడే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంటువ్యాధులు, జ్వరాలతో జనం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.