సంస్కృతిని కాపాడుకుందాం | samsukruthii culture | Sakshi
Sakshi News home page

సంస్కృతిని కాపాడుకుందాం

Published Fri, Dec 19 2014 3:30 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

సంస్కృతిని కాపాడుకుందాం - Sakshi

సంస్కృతిని కాపాడుకుందాం

నెల్లూరు (కల్చరల్) : భారతదేశ ఉన్నతమైన సంస్కృతిని అందరం కలిసి కాపాడుకుందామని నార్త్ అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు మోహన్ నన్నపనేని కోరారు. కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం నిర్వహించిన తానా ‘చైతన్య స్రవంతి’ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోహన్ మాట్లాడుతూ మొదటి సారిగా జిల్లా చరిత్రలో తానా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు వారి ఐక్యతను చాటేందుకు కొంతమంది అమెరికాలో ఈ సంఘాన్ని స్థాపించారన్నారు.
 
 అతిపెద్ద ప్రవాస తెలుగు సంస్థగా నిలిచినందుకు గర్విస్తున్నామన్నారు. ఏ ప్రవాస భారత అసోసియేషన్ చేయని విధంగా రాష్ర్టంలో రూ.300 కోట్లతో సేవా కార్యక్రమాలు, కంటి శస్త్ర చికిత్సలు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. ఎంతో ఉన్నతమైన మనదేశ సంస్కృతిని రేపటి తరానికి అందజేయాలని ఎన్‌ఆర్‌ఐల సహకారంతో ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దామన్నారు. అంతరించిపోతున్న మన ప్రాచీన కళలను చిన్నారులకు పరిచయం చేయడం కర్తవ్యంగా భావిస్తున్నామన్నారు. కింది స్థాయి నుంచి వచ్చిన చాలా మంది ఈ వేదికపై స్థానం పొందారని, వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు తమ భవిష్యత్‌ను నిర్మించుకోవాలని మోహన్ పిలుపునిచ్చారు.
 
 పుట్టిన గ్రామాలను మరవొద్దు : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
 తల్లిదండ్రుల, పూర్వీకుల జ్ఞాపకాలతో నిండి ఉన్న మీ గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి పరచాల్సిందిగా తానా కార్యక్రమాలకు విచ్చేసిన ఎన్‌ఆర్‌ఐలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోరారు. భారతీయులంతా, ప్రత్యేకంగా తెలుగువారంతా ఎక్కడ ఉన్నా తమ ఐక్యతను చాటేందుకు ఈ తెలుగు సంఘాన్ని స్థాపించారన్నారు. కన్వెన్షన్ సెంటర్‌లో చేసిన ఈ ఏర్పాట్లను చూస్తుంటే అమెరికాలో జరుగుతున్న సభకే మనం వెళ్లినంత ఆశ్చర్యంగా ఉందన్నారు. విద్యాలయాలు, వైద్యాలయాలు, శ్మశానవాటికలను, పచ్చదనాన్ని పెంచడం ద్వారా మీ సేవలు చిరకాలం నిలిచిపోతాయని విన్నవించారు. ప్రతి ఏటా తనకు ప్రభుత్వం అందజేస్తున్న వేతనం రూ.60 లక్షలను ప్రజా ప్రయోజనానికే వెచ్చిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. జూలై లో అమెరికాలో జరిగే 20వ ైద్వైవార్షిక తానా సభలు విజయవంతం కావాలని కోటంరెడ్డి ఆకాంక్షించారు.
 సంప్రదాయానికి నిదర్శనం ఈ వేడుక  : ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి
 సంప్రదాయాన్ని చక్కగా పాటిస్తున్నామనడానికి ఈ వేదిక ప్రత్యక్ష నిదర్శనం అని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి అన్నారు. మంచి ఉద్దేశంతో చేపట్టిన ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్‌లో మరిన్ని జరపాలని తానా నిర్వాహకులను ఆయన కోరారు. తానా సేవా కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో వైద్య సదుపాయాలను అందించడం జరిగిందన్నారు. విదేశాల్లో ఉన్నా జన్మభూమిని మరవకుండా, సంప్రదాయం, సంస్కృతిని కాపాడేందుకు ఎన్‌ఆర్‌ఐలు చేపట్టిన కార్యక్రమాలను వాకాటి కొనియాడారు. విద్యార్థులంతా వీరిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
 
 నెల్లూరు చరిత్ర ఘనమైనది :
 ఏపీఐఐసీ చైర్మన్ క ృష్ణయ్య
 నెల్లూరు జిల్లా ఘనమైన చరిత్ర కలిగినదని ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య అన్నారు. తిక్కన, ఎర్రాప్రగడ వంటి మహా కవులను అందించిన ఘనత మన గడ్డదే అన్నారు. చరిత్రకు సంబంధించిన వివరాలను విశ్లేషించి స్మారక చిహ్నాలను నిర్మించాల్సిన అవసరముందన్నారు. గతంలో సంక్రాంతి అంటే హరిదాసు, జంగం దేవర తదితర కళాకారులతో పల్లెలు కళకళలాడేవన్నారు. నేటి తరం అలాంటి వేడుకల ప్రాశస్తాన్ని తెలుసుకోవాలని సూచించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహనపెంచుకుని ఆరోగ్య కరమైన పద్ధతులను పాటించాల్సిందిగా విద్యార్థులను కోరారు.
 
 రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోండి :  మాజీ మంత్రి సోమిరెడ్డి
 ప్రస్తుతం రాష్ట్రం లోటు బడ్జెట్‌లో నడుస్తుందని, ఎన్‌ఆర్‌ఐలంతా రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఆదుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తానా నిర్వాహకులను కోరారు. తెలుగు పండగలన్నింటిని అత్యంత సంప్రదాయంగా, సంస్కృతిని కాపాడే విధంగా జరుపుకోవడంలో తానా సభ్యులు ముందున్నారని ప్రశంసించారు.
 
 స్ఫూర్తిని ఇచ్చే కార్యక్రమం చేపట్టడం హర్షణీయం : మేయర్ అబ్దుల్ అజీజ్
 ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కలిగించే విధంగా, చిన్నారుల్లో ప్రతిభను వెలికి తీసే విధ రూపొందించిన ఈ కార్యక్రమాల నిర్వహణ హర్షణీయమని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అన్నారు. ప్రతిష్టాత్మకమైన తానా కార్యక్రమాలను నగరంలో నిర్వహించడం అభినందనీయం అని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం సాహిత్యంలో విశేష కృషి నెరిపిన ఆచార్య రవ్వా శ్రీహరికి గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారాన్ని, జానపద కళకు కొత్త రూపం తీసుకువచ్చిన గొర్రెల రాములుకు నరసింహమూర్తి జ్ఞాపకార్థం స్మారక పురస్కారాన్ని అందజేశారు. సాహిత్య రంగంలో ఎనలేని సేవలందించిన అనురాధ, రామకృష్ణ దంపతులకు నగదు పురస్కారాన్ని, ఆర్థికంగా చితికిన రైతులు తోట హరిప్రసాద్, పి బాలకృష్ణారెడ్డి, ఎన్. రఘునాథ్‌కు ప్రత్యేకంగా తానా నిర్వాహకులు ఆర్థిక సహయాన్ని అందజేశారు. పాత్రికేయ పురస్కారాన్ని సింహపురి రైతు సంపాదకుడు నిరంజన్‌రెడ్డికి, విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్ట్‌లు శ్రీనివాసులు (హెచ్‌ఎంటీవీ), ఇబ్రహీం అలి (సీవీఆర్ న్యూస్) కుటుంబాలకు నగదు సహాయాన్ని అందజేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన జబర్దస్త్ టీం ప్రేక్షకులను తమ హాస్యవల్లరితో రంజింప జేసింది.
 
 జిల్లాలో తానా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడంలో ముఖ్యపాత్ర పోషించిన చైతన్య స్రవంతి అధ్యక్షుడు, ఎన్‌ఆర్‌ఐ రవి సన్నారెడ్డిని తానా నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. 3 వేల మంది విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించిన ఎస్‌వీఎస్ పోషక ఆహార సంస్థ వ్యవస్థాపకుడు ఆనందరావును సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీదమస్తాన్‌రావు, వైఎస్సార్‌సీపీ నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జేసీ రేఖారాణి, తానా మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపాల చౌదరి, తుంగా శివప్రభాత్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐలు గంగాధర్ నాదెళ్ల, జయరామ్ కోమటి, సతీష్ వేమన, మధు తోట, లావు అంజయ్య చౌదరి, రవి గౌరినేని, రజని ఆకురాతి, వాసుదేవరెడ్డి, రవి పోట్లూరి, గౌతమ్ గుర్రం, రామ్ జక్కేపూడి, నరేంద్ర ఏలూరు, హరిత చదివె, రామ్ ఎలమంచిలి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement