ఇసుక కష్టాలు తొలగిపోయాయి. ఎదురు చూడాల్సిన పని లేదు.ఆన్‌లైన్ విధానంతో ఇసుక పొందడం మరింత సులభతరమైంది.పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం గతనెల 10 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తోంది. కంప్యూటర్ ముందు కూర్చుని అడిగిన వివరాలుసమర్పిస్తే ఇసుక 48 గంటల్లో ఇంటికి చేరుతోంది. దీంతో వినియోగదారుల ఆనందానికి అవధులు లేవు. గతంలో రీచ్‌లలో నీరు చేరడంతో
కొంత ఇబ్బంది ఎదురుకావడంతో విపక్ష నాయకులు ‘ఇసుక దుమారం’రేపిన సంగతి తెలిసిందే..ఇప్పుడు విమర్శించే గళాలన్నీ మూతపడ్డాయి.అవసరాలకు మించి ఇసుక లభ్యత కావడం..సక్రమంగా ఇంటికి చేరుతుండటం ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టాయి.
సాక్షి ప్రతినిధి కడప : జిల్లాలో ఇసుక డోర్ డెలివరీ జోరందుకుంది. బుక్ చేసిన 48 గంటల్లోనే ఇసుక ఇంటికి చేరుతోంది. జనవరి 10న డోర్ డెలివరీ విధానం అమలులోకి వచ్చింది. నాటి నుంచి ఈనెల 3 వరకూ( సెలవులుపోను) 18 రోజుల వ్యవధిలో 24,834 టన్నులు డోర్ డెలివరీ కింద సరఫరా చేశారు. జనరల్, బల్క్‌గా వినియోగదారులను విభజించి అధికారులు ఇసుక సరఫరా చేస్తున్నారు. వంద టన్నులకు పైబడి అవసరమైన వారు బల్క్ కన్జ్యూమర్ లాగిన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి జిల్లా అధికారులు అఫ్రూవల్ ఇస్తారు. తర్వాత విజయవాడ హెడ్ ఆఫీసు నుంచి మరో అఫ్రూవల్ వచ్చాక ఇసుక సరఫరా చేస్తారు. జనరల్ వినియోగదారులు జిల్లాలో ఎక్కడి నుంచయినా ‘శాండ్.ఏపీ.జీఓవీ.ఇన్’ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఆన్‌లైన్‌లో ఇసుకను బుక్ చేసుకోవచ్చు. 48 గంటల్లో వారికి ఇసుక కేటాయిస్తున్నారు. వివరాలు వాహన యజమానికి వెళతాయి. రీచ్‌లకు వెళ్లి వే బిల్లులు తీసుకుంటే వినియోగదారునికి ఫోన్ ద్వారా సమాచారం అందించి డెలివరీ చేస్తారు.
పెరుగుతున్న బుకింగ్స్
రోజురోజుకూ బుకింగ్స్ పెరుగుతున్నాయి. అందుబాటులోకి ఇసుక రావడంతో వినియోగదారులు సులభతరంగా బుక్ చేసుకుంటున్నారు. నేరుగా కాకుండా సచివాలయాల నుంచి కూడా బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. పులివెందుల, కడప, రాయచోటి స్టాక్ యార్డుల నుంచి సరఫరా చేస్తున్నారు. పెన్నానది పరిధిలో జ్యోతి, ఇల్లూరు, చిత్రావతి పరిధిలో కొండాపురం వద్ద ఏటూరు, పాపాఘ్ని నదిలో వేంపల్లె వద్ద కొమరాంపల్లె, చెయ్యేరు పరిధిలో బాలరాజుపల్లె, నారాయణ నెల్లూరు, అడపూరు, టంగుటూరు తదితర తొమ్మిది ఇసుక రీచ్‌లతోపాటు పట్టా ల్యాండ్స్ పరిధిలో కొండూరు 1, 2, 3 రీచ్‌లు, రాజంపేట పరిధిలో కిచ్చమాంబపురం నాలుగు రీచ్‌ల నుండి ఇసుక సరఫరా చేస్తున్నారు. టన్ను ఇసుక రూ. 375 చొప్పున విక్రయిస్తున్నారు. 0 నుండి 40 కిలోమీటర్లలోపు టిప్పర్‌కు రూ.7, ట్రాక్టర్‌కు రూ.10 చొప్పున రవాణా ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. 40 కిలోమీటర్లు దాటితే కిలోమీటరుకు రూ. 4.90 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇసుక డిపోలలో 60 వేల టన్నులకు పైగా ఇసుక సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వినియోగదారులకు సకాలంలో ఇసుకను అందించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే పెన్నా, కుందూ, పాపాగ్ని, చిత్రావతి తదితర నదుల పరిధిలో మరిన్ని ఇసుక రీచ్‌లను తెరిచేందుకు అధికారులు సిద్దమయ్యారు. అవసరమైతే పట్టాల్యాండ్స్ నుండి కూడా సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. డోర్ డెలివరీ విధానం సత్ఫలితాలనిస్తోంది. ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకావడం లేదు. మైనింగ్, పోలీసు, విజిలెన్స్, రెవెన్యూ తదితర విభాగాల అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment