సిండి‘కేట్లు’ | Sand Dealers in Kakinada | Sakshi
Sakshi News home page

సిండి‘కేట్లు’

Published Thu, Jan 28 2016 11:57 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

Sand Dealers in Kakinada

 సాక్షి, కాకినాడ : ఇసుక ‘సిండికేట్లు’ మళ్లీ విజృంభిస్తున్నారు. మెజార్టీ రీచ్‌లను చేజిక్కిం చుకునేందుకు పావులు కదుపుతున్నారు. రీచ్‌లపై కార్పొరేట్ల పడగనీడ పడకుండా పథకం పన్నుతున్నారు. ఇన్నాళ్లూ డ్వాక్రా మహిళల మాటున కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఇసుకాసురులు, ఇక  నేరుగా దోచుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.జిల్లాలో అధికారికంగా 27 రీచ్‌లున్నాయి. గతేడాదిగా డ్వాక్రా గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో కొనసాగాయి. పే రుకు డ్వాక్రా సంఘాలే అయినా, పెత్తనమంతా అధికార పార్టీ నేతల చేతుల్లోనే ఉండేది.
 
 మారిన ఇసుక విధానం మే రకు ఈ ఏడాది రీచ్‌లను వేలంపాట ద్వారా ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ నెలాఖరుతోనే రీచ్‌ల్లో తవ్వకాలను నిలిపివేసినప్పటికీ ఇసుక కొరతను దృష్టిలో పెట్టుకుని ముగ్గళ్ల, ఆత్రేయపురం, అంకంపాలెం, మందపల్లి, జొన్నాడ, ఊబలంక రీచ్‌ల్లో తవ్వకాలకు తాత్కాలిక అనుమతులిచ్చారు. ఇది శుక్రవారంతో గడువు ముగి యనుంది. తొలి విడతలో పర్యావరణ అనుమతులున్న 13 రీచ్‌లకు వేలం నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, ఈ తంతు ముగిసేందుకు రెండు వారాలు పడుతుందని అంచనా.
 
 ఆరు రీచ్‌ల్లో తవ్వకాలకు గడువు పొడిగింపు
 అప్పటివరకు తాత్కాలిక అనుమతులతో నడుస్తున్న ఆరు ప్రధాన రీచ్‌ల్లో తవ్వకాలకు గడువు పెంచాలని రీచ్ నిర్వాహకులు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిళ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో అనుమతులు లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోవైపు ముగ్గళ్ల, వేమగిరి, ఆత్రేయపురం, మందపల్లి, జొన్నాడ, ఊబలంక -1, 2, అంకంపాలెం, అయినవిల్లంక తదితర 13 రీచ్‌లకు వేలం నోటిఫికేషన్ ఇచ్చారు. జిల్లా స్థాయిలో సిండికేట్ల హవా కొనసాగుతుందనే సాకుతో టెండర్ ప్రక్రియను పూర్తిగా రాష్ర్ట మైనింగ్ శాఖ డెరైక్టర్ స్వయంగా పర్యవే క్షిస్తున్నారు.
 
 రీచ్‌లపై కన్నేసిన బడాబాబులు
 కాసుల వర్షం కురిపించే ఈ రీచ్‌లపై బడాబాబులు కన్నేశారు. సీఎం కోటరీలో ముఖ్యుడైన ఓ కేంద్ర మంత్రి సహా ‘బాబు’ బంధువైన సినీనటుడి వియ్యంకుడు కూడా తమ వ్యాపార లావాదేవీల కోసం జిల్లాలో ప్రధాన రీచ్‌ల్లో పాగా వేసేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం రాష్ర్ట స్థాయిలోనే లాబీయింగ్ జరిపి ప్రధాన రీచ్‌లను చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కార్పొరేట్ శక్తుల పరం కానీయకుండా ఉండేందుకు గతంలో ఇసుక సిండికేట్లలో కీలకపాత్ర పోషించిన నేతలు, వ్యాపారులు మళ్లీ తెరపైకి వచ్చారు.
 
 జిల్లాలో ఇసుక వ్యాపారంలో అనుభవం ఉన్న వారితో ఇటీవలే ఈ సిండికేట్లు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, రీచ్‌ల వేలంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపినట్టు తెలిసింది. గోదావరి జిల్లాల పరిధిలో ఉన్న ఓ ఎంపీ అనుచరుడితో పాటు గతంలో సిండికేట్లలో చక్రం తిప్పిన జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరుడు వ్యాపారులను సిండికేట్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. జిల్లాలో ఇసుక వ్యాపారం సాగిస్తున్న పొరుగు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అనుచరుడు కూడా ప్రధాన రీచ్‌లపై కన్నేసినట్టు చెప్పుకొంటున్నారు. జిల్లాలోని రీచ్‌లపై కార్పొరేట్ శక్తులు గురిపెట్టడాన్ని సాకుగా చూపి ఇసుక వ్యాపారులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు సిండికేట్లు చక్రం తిప్పుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement