గోదావరిలో అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు
అధికార పార్టీ పెద్దల అండతోనే ఈ దొంగ వ్యాపారం
మంత్రికి వాటాలు అందుతున్నాయని ఆరోపణలు
ముడుపులతో మూగనోము పడుతున్న అధికారులు
‘ఇసుకను పిండి నూనె తీయగల’ మొనగాళ్లున్నారో, లేరో గానీ.. గోదావరిని కుళ్లబొడిచి తీసిన ఇసుక నుంచి కోట్లు రాబట్టగల బడాచోరులున్నారు. అనుమతి లేకున్నా తీరం వెంబడి ర్యాంపుల నుంచి అర్ధరాత్రి దాటాక గుట్టుచప్పుడు కాకుండా పెద్ద ఎత్తున ఇసుక తరలించుకుపోతున్న ఈ ‘మాఫియా’కు అధికార పార్టీ పెద్దలహస్తం తోడవుతోంది. దీంతో అటు జీవనది గమనంలో అవాంఛనీయమైన మార్పులు సంభవించే అవకాశంతో పాటు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్లాదిరూపాయలు అక్రమార్కుల మధ్య వాటాలుగా పంపకమవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, కాకినాడ:
ఉభయగోదావరి జిల్లాల్లోని 32 ఇసుక రీచ్‌ల ద్వారా ఏటా రూ.నాలుగైదు వందల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని 21, పశ్చిమగోదావరి జిల్లాలోని 11 రీచ్‌లకు లీజు గడువు గత అక్టోబరుతో ముగిసింది. వేలం నిర్వహించాలంటే పర్యావరణ అనుమతి తప్పనిసరని సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఇందుకోసం సర్కార్‌కు పంపిన ప్రతిపాదనలు గాలికొదిలేశారు. ఇప్పటికి నాలుగు నెలలవుతున్నా ఏ ఒక్క రీచ్‌కూ వేలం జరగ లేదు. పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం సిద్ధాంతం, కరుగోరుమిల్లి రీచ్‌లపై న్యాయస్థానాల్లో స్టేలుండగా మిగిలిన తొమ్మిదింటికి.. సంబంధించి సకాలంలో ఇసుక తవ్వుకోలేకపోయామంటూ బోట్స్‌మెన్ అసోసియేషన్‌లు ప్రభుత్వ అనుమతితో రీచ్‌లను నిర్వహిస్తున్నాయి. కానీ తూర్పుగోదావరి జిల్లాలో 21 రీచ్‌లలో ఒక్కదానికీ అధికారికంగా అనుమతి లేదు. అయినా అంకంపాలెం, ఊబలంక, మందపల్లి, కోరుమిల్లి, గోవలంక, కపిలేశ్వరపురం, ముగ్గుళ్ల రీచ్‌లలో అర్ధరాత్రిళ్లు ఐదు నుంచి రెండు టన్నుల సామర్థ్యం గల లారీల్లో ఇసుకను సరిహద్దులు దాటించేస్తున్నారు.
ఒక్క అంకంపాలెం, ఊబలంక, కోరుమిల్లి, గోవలంక, ముగ్గుళ్ల తదితర ర్యాంపులలో రోజూ చీకటిమాటున 100 నుంచి 150 లారీల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. పశ్చిమగోదావరి జిల్లా కానూరు, పెండ్యాల ప్రాంతాల నుంచి తూర్పుగోదావరి జిల్లావైపు వచ్చేసి పులిదిండి, నార్కెడమిల్లి, అంకంపాలెం తదితర ప్రాంతాల్లో రోజూ మరో పాతిక లారీల వరకు ఇసుకను తవ్వేస్తున్నారు. ఈ రకంగా రెండు జిల్లాల్లో ప్రతి రాత్రీ ఇసుక కాళ్లొచ్చి అక్రమార్కులకు కోట్లు కురిపిస్తోంది. విజిలెన్స్ అధికారులు అడపాదడపా మొక్కుబడి దాడులు చేస్తూ నాలుగైదు ట్రాక్టర్‌లు సీజ్ చేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. గనులు, రెవెన్యూ శాఖలు కూడా మామూళ్ల మత్తు, అధికారపార్టీ పెద్దల ఆదేశాలతో మగతనిద్రలో జోగుతున్నాయి తప్ప ఇసుకాసురులపై కొరడా ఝుళిపించేందుకు సాహసించడం లేదు. పశ్చిమగోదావరి జిల్లాలోని రీచ్‌లు సర్కార్ నుంచి అనుమతి సాధించడం వెనుక గోదావరి జిల్లాలకు చెందిన ఒక మంత్రి హస్తం ఉందని విశ్వసనీయ సమాచారం. ఆ మంత్రికి నెలవారీ వాటాలు అందుతున్నట్టు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా వైపు అధికారపార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల అనుచరవర్గమే ఇసుక మాఫియా లోక్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ కారణంగానే జిల్లా యంత్రాంగం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. అధికారికంగా పర్యావరణ అనుమతులు తెచ్చి వేలం నిర్వహిస్తే, దొడ్డిదారిన లక్షలు వెనకేసుకునే అవకాశం చేజారి పోతుందన్న ముందుచూపుతో గోదావరి జిల్లాల్లో ఏ ఒక్క ప్రజాప్రతినిధీ అనుమతుల కోసం ఒత్తిడి తీసుకురావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సామాన్యులకు పెనుభారం..
ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రవహిస్తున్న వశిష్ట, గౌతమీ గోదావరిల్లో లభించే ఇసుకను కొనుగోలు చేయడం సామాన్యులకు భారంగా తయారైంది. ఇసుక మాఫియా రెండు యూనిట్ల లారీని రూ.7500కు (గతంలో రూ.3000 ఉండేది) విక్రయిస్తూ సామాన్యుల జేబులు గుల్లచేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు డిసెంబర్ నుంచి మే వరకు ఇళ్ల నిర్మాణ పనులు చేపడతారు. ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు కూడ త్వరితంగా జరిగేందుకు ఈ ఆరు నెలల కాలమే అనువైందిగా భావిస్తారు.
ఇందుకు రెండు జిల్లాల్లో సుమారు 10 లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుక అవసర ం అవుతుందని అంచనా. ఇంత ఇసుక అవసరమవుతున్నా అనధికార తవ్వకాలకు అడ్డుకట్ట వేయలేక, పర్యావరణ అనుమతులు ఇస్తేగిస్తే అధికారపార్టీ పెద్దల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు కూడా పెదవి విప్పడం లేదంటున్నారు.
నది.. అక్రమార్కులకు పెన్నిధి
Published Sat, Feb 8 2014 1:23 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement