- చెలరేగుతున్న ఇసుక అక్రమార్కులు
- రాత్రి వేళల్లో నదిలో ఇష్టానుసారం తవ్వకాలు
- పొలాల్లో డంప్ చేసి, యథేచ్ఛగా రవాణా
- హైదరాబాద్, విశాఖకు తరలింపు
- తెర వెనుక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు
- కిమ్మనని అధికారులు
గోదారి తల్లికి తూట్లు
Published Mon, Dec 19 2016 12:07 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
సాక్షి, రాజమహేంద్రవరం :
పావన గోదావరి తీరాన పుట్టామని జిల్లా ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. కానీ కొందరు అక్రమార్కులు ఆ పవిత్ర గోదావరి తల్లికి తూట్లు పొడుస్తున్నారు. ఆ నదీమతల్లి గర్భంలో ఉండే ఇసుకను అక్రమంగా తవ్వి, హైదరాబాద్, ఇతర సరిహద్దు ప్రాంతాలు, విశాఖపట్నం వంటి చోట్లకు లారీల్లో తరలిస్తూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతి ఉన్న ర్యాంపుల్లోని ఇసుకను ఒకచోట డంప్ చేసి లారీల్లో నింపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
రాత్రి వేళల్లో తవ్వకాలు.. ప్రత్యేకంగా డంపులు
లారీలు వెళ్లే అవకాశం ఉన్నచోట్ల పొక్లెయిన్లతో దర్జాగా తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతి లేని ర్యాంపుల్లో సైతం ఎవ్వరికీ అనుమానం రాకుండా రాత్రి, అవకాశం ఉంటే పగటి వేళల్లో తవ్వకాలు జరుపుతున్నారు. కూలీల సహాయంతో ట్రాక్టర్లలోకి ఇసుకను నింపి గ్రామాలు, పొలాలు, రోడ్ల పక్కన డంప్ చేస్తున్నారు. అక్కడ నుంచి పొక్లెయి¯ŒSతో లారీల్లో నింపుతున్నారు. ఇసుక అవసరమైన వారితో ముందుగా ఒప్పందాలు చేసుకొని వారు ఎక్కడికి కావాలంటే అక్కడకు సరఫరా చేస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్, సీతానగరం, రావులపాలెం తదితర మండలాల్లో జాతీయ రహదారిగుండా ఇసుక జిల్లా సరిహద్దులు దాటుతోంది.
అధికారికం 31.. అనధికారికం ఎన్నో..
జిల్లాలో గోదావరి వెంట 31 ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిల్లోనే కాకుండా గోదావరి తీరం వెంబడి అనధికారికంగా అనేక ర్యాంపుల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అనుమతి ఇచ్చిన ర్యాంపులను అడ్డం పెట్టుకుని సమీపంలో కూడా తవ్వకాలు జరుపతున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు, సీతానగరం మండలం కాటవరం, మునికూడలితోపాటు అమలాపురం, రామచంద్రపురం డివిజన్లలోని ర్యాంపులలో ఇసుక అక్రమంగా తవ్వి యథేచ్ఛగా జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక డంపులు ఏర్పాటు చేసి లారీల్లో నింపుతున్నారు.
ఉచిత ఇసుకే వ్యాపార మార్గం
ఉచిత ఇసుక అక్రమార్కుల పాలిట వరంగా మారింది. ప్రారంభంలో వ్యూహాత్మకంగా ఇసుకను సొంతంగా అమ్మిన చంద్రబాబు ప్రభుత్వం కృత్రిమ కొరతను సృష్టించింది. అన్ని ర్యాంపులూ తమ పార్టీ నేతల అదుపులోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించింది. దీంతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. ఇసుకను పెట్టుబడి లేని వ్యాపారంగా మార్చుకున్నారు. జిల్లాలో పలువురు ఉచిత ఉసుక విధానం వచ్చిన తర్వాత లారీలు కొనుగోలు చేశారు. ఇసుకను లారీల్లో నింపడానికి ప్రత్యేకంగా పొక్లయిన్లు కొనుగోలు చేయడం వారి అక్రమార్జన ఏవిధంగా సాగుతోందో చెప్పడానికి నిదర్శనం. రోడ్ల వెంబడి ఇసుక డంపులు కనిపిస్తున్నా అధికారులు కనీసంగా కూడా ఆవైపు చూడడం లేదు. అక్రమార్కుల వెనుక అధికార పార్టీ ప్రజాప్రతినిధుల హస్తం ఉండటం, మరికొందరికి భారీగా ముడుపులు ముడుతూండడంతో వారు కిమ్మనడంలేదన్న ఆరోపణలున్నాయి.
కఠిన చర్యలు తీసుకుంటాం
అనుమతి ఇవ్వని ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమతి ఉన్న ర్యాంపుల నుంచి ఇసుక తవ్వి డంప్ చేయడం కూడా చట్ట విరుద్ధం. అలా చేసేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇసుక అక్రమ రవాణా, డంప్‌లపై అధికారులతో దాడులు చేయిస్తాం.
– హెచ్.అరుణ్‌కుమార్, జిల్లా కలెక్టర్
Advertisement