సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. చెన్నూర్, జైపూర్ శివారుల నుంచి పట్టాభూములు, మత్స్యకారుల సొసైటీల పేరిట గోదావరిని తోడేస్తున్నారు. పట్టాభూముల నుంచి ఇసుక మేటలు తొలగించుకుంటామని అనుమతులు తీసుకుని గోదావరినే కొల్లగొడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పొక్లయినర్లు ఉపయోగిస్తూ టన్నుల కొద్దీ ఇసుకను మంచిర్యాల ద్వారా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌కు తరలిస్తున్నారు. గోదావరిలో ఏర్పాటు చేసిన ఇసుక క్వారీలో యంత్రాలు ఉపయోగించకుండా స్థానిక గిరిజను ల ద్వారానే లారీల్లోకి లోడింగ్ చేయాల్సి ఉంటుం ది. అది కూడా భూగర్భ జలాలకు నష్టం కలుగకుండా గోదావరిలో కేవలం నాలుగు ఫీట్ల లోతులో ఇసుకను తీయాలని మైనింగ్ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఇవేమీ పట్టని సదరు వ్యక్తులు ఇసుక క్వారీలో పొక్లయినర్లను పెట్టి సుమారు 200 నుంచి 250 లారీల్లో లోడింగ్ చేస్తున్నారు. ఈ అక్రమ రవాణాను వెనుక రెవెన్యూ, పోలీసు, మైనింగ్, రవాణశాఖ అధికారులు నియంత్రించాల్సి ఉన్నా పట్టీపట్టనట్లుగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రోజు రూ.2 లక్షల రాయల్టీకి ఎసరు..
చెన్నూర్ పట్టణంలోని బతుకమ్మ వాగు పరీవాహక ప్రాంతంలోని వరంగల్ పట్టణానికి చెందిన చందుపట్ల దేవేందర్‌రెడ్డికి సర్వే నంబర్లు 92లో 1.38 ఎకరాలు, 93లో 16.00 ఎకరాలు, 94లో 7.05 ఎకరాలు మొత్తం 25.05 ఎకరాల పట్టాభూమి ఉంది. ఈ భూమిలో వేసిన ఇసుక మేటలు 6 ఫిబ్రవరి 2014 వరకు తొలిగించుకునేందుకు అనుమతి పొందారు. ఈ మేరకు అక్కెపల్లి శివారులోని 123 సర్వే నంబరులోని 4 ఎకరాల భూమిలో ఇసుక డంప్ యార్డును ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే చెన్నూర్ మండలంలోని చింతలపల్లి సమీపంలోని గోదావరి నదిలోమత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షుడు అంబాటి శంకర్ సర్వే నంబర్లు 223లో 1.23, 224లో 17, 225లో 6.31 ఎకరాలు, మొత్తం 25.03 ఎకరాలలో ఇసుక తీసుకునేందుకు ఏపీ మైనింగ్ శాఖ నుంచి జూన్ 6 2013 నుంచి 20 నవంబర్ 2013 వరకు లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాల కోసం అనుమతి పొంది కోటపల్లి మండలంలోని పారుపల్లి గ్రామ సమీపంలో సర్వే నంబర్ 422లో ఉన్న 3 ఎకరాల భూమిలో డంప్ యార్డును ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పట్టా భూములు, సొసైటీలకు ఉన్న అనుమతులతో గోదావరి నదులు, వాగులను సరిహద్దులు లేకుండా అడ్డంగా తోడేస్తూ కోట్లాది రూపాయల ఇసుక దందాను సాగిస్తున్నారు. వందలాది లారీలు రోజు వయా మంచిర్యాల ద్వారా వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిపోతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా లోడింగ్..
చెన్నూర్‌లో ఇసుక లారీకి రూ. రూ.12 వేలు పలుకుతుండగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ పట్టణంలో లారీ ఇసుకకు రూ.25 నుంచి రూ.30 వేల వరకు ఉంది. అయితే చెన్నూర్, జైపూర్ వాగుల్లోన రెండు క్వారీల నుంచి రోజు 200 నుంచి 250 వరకు లారీలు హైదరాబాద్‌కు వెళ్తున్నాయి. ఈ లెక్కన రోజు రూ.2 కోట్ల విలువ చేసే ఇసుక తరలిపోతోంది. ఇదేవిధంగా మరో ఏడాదిపాటు ఇసుక రవాణ సాగినట్లయితే చెన్నూర్, జైపూర్ ప్రాంతాలు ఎడారిగా మారిపోయే ప్రమాదం నెలకొంది. కాగా ఇసుక క్వారీల్లో లారీల్లో లోడింగ్ చేసిన ప్రతి క్యూబిక్ మీటరుకు ప్రభుత్వానికి రూ.40ను రాయల్టీ కింద చెల్లించాలి. నిబంధనల ప్రకారం 10 టన్నుల కెపాసిటీ గల లారీలో 6 క్యూబిక్ మీటర్ల ఇసుకను, 17 టన్నుల లారీలో పది క్యూబిక్ మీటర్ల ఇసుక మాత్రమే లోడింగ్ చేయాలి. ఇందుకు రాయల్టీ కింద ప్రభుత్వానికి ఒక్కో ఇసుక లారీకి రూ.240 నుంచి రూ.600 వరకు చెల్లించాలి. ఈ రాయల్టీ చెల్లించకుండా రోజుకు రూ.2 లక్షల వరకు ఎగవేస్తున్నారు. దీంట్లో మైనింగ్, రెవెన్యూశాఖలకు పెద్దమొత్తంలో మామూళ్లుంటాయన్న ప్రచారం ఉంది. కాగా ఇసుకను రవాణా చేసిన లారీకు ప్రత్యేకంగా బాడీలను పెంచడంతో 20క్యూబిక్ మీటర్ల వ రకు ఇసుకను లోడింగ్ చేస్తున్నారు. ఇందుకోసం రవాణాశాఖ అధికారులకు ఒక్కో లారీకి నెలకు రూ.12 వేలు చెల్లిస్తున్నట్లు లారీల యజమానులే చెప్తుండటం గమనార్హం.
తోడేస్తుండ్రు!
Published Mon, Nov 25 2013 2:19 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement