శుక్రవారం ఖానాపూర్ గోదావరిలో ఇసుకను తోడుతూ..
ఖానాపూర్ : ఖానాపూర్ పట్టణంలోని పుష్కరఘాట్ ప్రాంతం నుంచి వారం రోజులుగా ఇసుక స్మగ్లర్లు ఇసుకను నిరంతరంగా తరలించుకుపోతున్నారు. నిర్భయంగా పట్టణంలోని ప్రదాన రహదారి గుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇసుకను ట్రాక్టర్‌లపై రవాణా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. సంబంధిత అధికారులు ‘మామూలు’గా తీసుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఆయా సాగునీటి కాలువల పనులు, ఇతరాత్ర నిర్మాణాల కోసం ఇసుకను అక్రమంగా తరలించుకుపోయి అందిన కాడికి సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రభుత్వ నిర్మాణాల కోసమని కొందరు ప్రజలను పక్కదోవ పట్టిస్తూ ఇసుక దాందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ప్రభుత్వ పనులకు సంబంధించి అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇసుకను తరలించే అవకాశం ఉండదు. గత కొద్ది రోజులుగా ఖానాపూర్, పెంబి మండలాల్లోని పల్కేరువాగు, బల్లివాగు, కడెంవాగు, దొత్తివాగు, రిజర్వ్ ఫారెస్ట్‌ల నుంచి ఇసుకను తరలించిన ఇసుకాసురులు ఏకంగా పట్టణంలోనే ఈ దందాకు తెరలేపారు. అయినా సంబంధిత అదికారులు మాత్రం తమకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరిస్తూండడం విమర్శలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment