ఇసుక దోపిడీ | Sand Mafia in Adilabad district | Sakshi
Sakshi News home page

ఇసుక దోపిడీ

Published Tue, Jan 9 2018 6:39 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

Sand Mafia in Adilabad district - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఓ వైపు జిల్లాలో ఇసుక లభ్యత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ మరోవైపు ఇసుక దోపిడీ మాత్రం యథేచ్ఛగా సాగుతోంది. ఇసుక రీచ్‌లకు అనుమతుల జాప్యం విషయంలో భూగర్భ గనుల శాఖ, రెవెన్యూ అధికారులు ఒకరిపై మరొకరు నెపం నెట్టివేస్తున్నారు. వీరిలా ఉంటే ఇసుక మేటలు మాత్రం మాయమవుతున్నాయి. వాగులు, వంకలు, ఒర్రెలు, నదుల నుంచి ఇసుకను తోడేçస్తూనే ఉన్నారు. ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. ఇసుక నిల్వలను గుర్తించినప్పటికీ వాటికి రీచ్‌లుగా అనుమతి ఇచ్చే విషయంలో ఇప్పటివరకు జిల్లాలో అతీగతి లేదంటే చోద్యంగానే కనిపిస్తుంది. ప్రభుత్వానికి ఆదాయానికి కోట్లాది రూపాయల మేర గండి కొడుతూ ఇసుకాసురులు తమ జేబులు నింపుకుంటున్నా అధికారులు స్పందించకపోవడం గమనార్హం.

ఇసుక రీచ్‌ అనుమతుల్లో జాప్యం..
జిల్లా స్థాయి ఇసుక కమిటీ (డిస్టిక్‌ లెవల్‌ సాండ్‌ కమిటీ) చైర్మన్‌గా జిల్లా కలెక్టర్, వైస్‌ చైర్మన్‌గా జాయింట్‌ కలెక్టర్, మెంబర్‌ కన్వీనర్‌గా భూగర్భ గనుల శాఖ ఏడీ ఉండగా, ఐటీడీఏ పీఓ, జిల్లా పంచాయతీ అధికారి, భూగర్భజలాల శాఖ డీడీ, నీటిపారుదల శాఖ ఈఈ, గ్రామీణ నీటి సరఫరా ఈఈ, కాలుష్య నియంత్రణ బోర్డు (పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డ్‌) ఇంజినీర్, తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ నుంచి ప్రతిపాదిత స భ్యుడు మెంబర్లుగా ఉన్నారు. గతేడాది ఫిబ్రవరిలో ప్రభు త్వం జాయింట్‌ కమిటీ ఇసుక రీచ్‌లను గుర్తించేందుకు సర్వే నిర్వహించింది. భీంపూర్, ఉట్నూర్, జైనథ్, తలమడుగు, సిరికొండ, ఆదిలాబాద్‌రూరల్‌ మండలాల్లో నది, వాగులు, వంకలు, ఒర్రెల సమీపంలో ఇసుక నిల్వల ను గుర్తించడం జరిగింది. ఇప్పటివరకు ఇసుక నిల్వలు ఉన్న వాటికి రీచ్‌లుగా అనుమతినివ్వక పోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతుంది. రీచ్‌లకు అ నుమతినిస్తే ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది.

ప్రధానం గా ఇసుకకు ధర నిర్ణయిస్తారు. సీనరేజ్‌ ఫీజు, జిల్లా మినరల్‌ ఫండ్, రాష్ట్ర ఎక్స్‌ప్లోరేషన్‌ ఫండ్‌ నిర్ణయించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రీచ్‌ల నుంచి ఇసుకను తోడుకునేందుకు అనుమతినివ్వాలి. ప్రభుత్వానికి సీనరేజ్‌ చార్జీ ల రూపంలో ప్రతి క్యూబిక్‌ మీటర్‌కు రూ.40 చొప్పున ఆదాయం లభిస్తుంది. వీటితోపాటు ఇతర ఫండ్‌ రూపంలో 3 క్యూబిక్‌ మీటర్ల ఓ ట్రాక్టర్‌ లోడ్‌పై రూ.400కు పైగా ఆదా యం లభించే అవకాశం ఉంటుంది. మండల స్థాయిలో తహసీల్దార్, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగాలి. ఇసుక మేటలను తీయించడం, సరఫరాను పరిశీలించి వేబిల్లు ఆధారంగా ప్రక్రియ చేపట్టాలి. జిల్లాలో ఇది ఎక్కడ అమలు కావడం లేదు. కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత పక్కనున్న నిర్మల్‌ జిల్లాలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ ద్వారా రీచ్‌లకు అనుమతినిచ్చి ప్రభుత్వానికి ఆదాయం సమకూరేవిధంగా మలుచుకోవడం జరిగింది. ఇక్కడ అవిభాజ్య జిల్లాలో జిల్లాస్థాయి ఇసుక కమిటీ కొనసాగగా, కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ జిల్లాకు అదే కమిటీ ఉన్నప్పటికీ కొత్త జిల్లాలో ని మండలాలు మాత్రమే దీని పరిధిలోకి రావడం జరిగింది. అయితే రీచ్‌ల అనుమతి విషయంలో ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. బహిరంగ మార్కెట్లో ట్రాక్టర్‌ (రెండున్నర క్యూబిక్‌ మీటర్లు) రూ.2500 నుంచి రూ.3500, ట్రిప్పర్‌లో 8 క్యూబిక్‌ మీటర్లకు రూ.10వేల వరకు విక్రయిస్తూ ఇసుక మాఫియా లాభాలు గడిస్తోంది. ఇంత జరగుతున్నా అధికారులు చోద్యం చూడడం అనుమానాలకు తావిస్తోంది.

లభ్యత లేకున్నప్పటికి..
నదులు, వాగుల సమీపంలో 3 మీటర్ల లోతు ఇసుక ఉన్న పక్షంలో ఒక మీటర్‌ ఇసుకను తోడుకునేందుకు అనుమతినివ్వడం జరుగుతుందని భూగర్భ గనుల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో పలు వాగుల వద్ద ఈ పరి స్థితి లేదని వారు పేర్కొంటున్నారు. పెన్‌గంగలో మాత్రం ఇసుక మేటలు ఉన్నప్పటికీ తెలంగాణ, మహారాష్ట్ర మధ్యన సరిహద్దుగా ఉన్నందున భూ అక్షాంక్షాల నిర్ధారణ జరగకపోవడంతో అక్కడ ఇసుక సేకరణకు అనుమతులు ఇచ్చే పరిస్థితులు లేవని చెబుతున్నారు. నది నుంచి ఇసుక దోపి డీ అడ్డగోలుగా కొనసాగుతుంది. ప్రస్తుతం నీటి ప్రవాహం లేకపోవడంతో మేటలు బయటపడ్డాయి. కాంట్రాక్టర్ల చూ పు దీనిపై పడింది. పెన్‌గంగ పరివాహక ప్రాంతాల్లోని సుమారు 15వేల నుంచి 20వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుక మేటలున్నట్లు అంచనా వేస్తున్నారు. వాల్టా చట్టం ప్రకారం ఇసుకను తోడటం చట్టరీత్యా నేరం. అయితే ప్రభుత్వ పనులకు ఇసుకను ఉపయోగించేందుకు వాగుల నుంచి ఇసుక ను తీసుకొస్తున్నట్లు చెబుతూ అక్రమాలకు పాల్పడుతున్నా రు. టెండర్లు తీసుకున్న వ్యక్తులు లక్షల్లో సంపాదిస్తున్నారు.


నిల్వలున్నా గుర్తించనివి..
పెన్‌గంగ పరివాహక ప్రాంతాలైన జైనథ్‌ మండలం డొల్లార, కరంజి, బేల మండలంలోని సాంగిడి, గూడ, కంగార్‌పూర్, మాంగుర్లలో ఇసుక నిల్వలు ఉన్నప్పటికి సర్వేలో ఈ ప్రాంతాలను అధికారులు గుర్తించలేదు. అయితే నిత్యం ఇక్కడినుంచి అనేక వాహనాల్లో ఇసుక అక్రమ రవాణ జరుగుతూనే ఉంటుంది.  

తహసీల్దార్ల ద్వారా పరిశీలన చేసి..
తహసీల్దార్ల ద్వారా ఇసుక లభ్యత విషయంలో పరిశీలన చేయించి అనుమతుల విషయంలో చర్యలు తీసుకుంటాం. భూగర్భ గనుల శాఖ నుంచి ప్రతిపాదనలు రావాలి. దానికి అనుగుణంగా తహసీల్దార్లు చర్యలు తీసుకుంటారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ శాఖ ద్వారా దాడులు చేయిస్తాం. – కృష్ణారెడ్డి, జాయింట్‌ కలెక్టర్, ఆదిలాబాద్‌

రెవెన్యూ నుంచే జరగాలి
రెవెన్యూ అధికారులు ఇసుక రీచ్‌లకు సంబంధించి అనుమతినిస్తే ప్రభుత్వానికి ఆదాయం లభించే అవకాశం ఉంది. ఇప్పటివరకు జిల్లాలో ఇసుక రీచ్‌లకు అను మతి ఇవ్వలేదు. పలు వాగుల్లో ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఇసుక లభ్యత లేదు. అన్ని పరిశీలన చేసిన తర్వాత రీచ్‌లకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. – రవిశంకర్, ఏడీ, భూగర్భ గనుల శాఖ, ఆదిలాబాద్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement