చెన్నూర్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఇసుక దందా కాసులు కురిపిస్తోంది. తూర్పు ప్రాంతంలో అనుమతులు లేకున్నా అధికారుల అండదండలతో ఇసుక మాఫియా వ్యాపారం జోరుగా సాగిస్తోంది. తూర్పు ప్రాంతంలోని జైపూర్, కుందారం, మందమర్రిలోని తిమ్మాపూర్, ఇసుక క్వారీలకు అనుమతులు ఉన్నా చెన్నూర్‌లోని గోదావరి నది, వాగులపైనే ఇసుక మాఫియా కన్ను పడింది. పట్టా భూములు, సొసైటీలకు ఉన్న అనుమతులతో నదులు, వాగులను అడ్డంగా తోడేస్తూ రూ.కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక రవాణా కోసం రెవెన్యూ, భూగర్భ శాఖల నుంచి పొందిన వేబిల్లులు ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక తవ్వకాలతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలాలు అంతరించి తాగు, సాగు నీటికి ఇబ్బందులు నెలకొంటున్నాయి. గతేడాది ఈ ప్రాంతంలో తాగు నీటి ఇబ్బందులు తలెత్తాయి. గోదావరి పరిరక్షణ కమిటీ ఇసుక తవ్వకాలను నియంత్రించాలని గొగ్గొలు పెడుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు.
అనుమతులు ఉన్న క్వారీలు
చెన్నూర్ పట్టణంలోని బతుకమ్మ వాగు పరీవాహక ప్రాంతంలోని వరంగల్ పట్టణానికి చెందిన దేవేందర్‌రెడ్డికి సర్వే నంబర్లు 92లో 1.38 ఎకరాలు, 93లో 16 ఎకరాలు, 94లో 7.05 ఎకరాల సొంత భూమి ఉంది. ఈ భూమిలో ఇసుక మేటలు వేశాయని ఇసుక తీసుకునేందుకు 13 ఆగస్టు 2013 నుంచి 6 ఫిబ్రవరి 2014 వరకు 2,94,240 క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వుకునేందుకు నిజామాబాద్ భూగర్భ గనులశాఖ నుంచి అనుమతి పొందాడు. అలాగే అక్కెపల్లి శివారులోని 123 సర్వే నెంబరులోని నాలుగెకరాల భూమిలో ఇసుక డంప్ యార్డును ఏర్పాటు చేసుకున్నాడు. అంతే కాకుండా చెన్నూర్ మండలంలోని చింతలపల్లి సమీపంలోని గోదావరి నదిలో ఫిషర్ మెన్ కో ఆపరేటీవ్ సొసైటీ అధ్యక్షుడు అంబాటి శంకర్ సర్వే నంబర్లు 223లో 1.23, 224లో 17, 225లో 6.31 ఎకరాల్లో ఇసుక తీసుకునేందుకు ఏపీ మైనింగ్ శాఖ నుంచి 6జూన్ 2013 నుంచి 20 నవంబర్ 2013 వరకు లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాల కోసం అనుమతి పొంది కోటపల్లి మండలంలోని పారుపల్లి గ్రామ సమీపంలో సర్వే నంబర్ 422లో ఉన్న 3 ఎకరాల భూమిలో డంప్ యార్డును ఏర్పాటు చేసుకున్నారు. సొంత భూమిలో ఉన్న ఇసుక తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు డంప్ యార్డు వరకు అనుమతి ఇస్తే ఇక్కడి నుంచి పట్టణ ప్రాంతాలకు తీసుకవేళ్లేందుకు భూగర్భ గనులశాఖ అనుమతి పొందుతున్నారు. మరో ఇద్దరు కూడా ఇసుక తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు.
అనుమతికి మించి తవ్వకాలు
పట్టా, సొసైటీల పేరిట అనుమతులు అడ్డుపెట్టుకుని బినామీలు ఈ ఇసుక దందాను సాగిస్తున్నారు. 25 ఎకరాల్లో ఉన్న అనుమతులను అతిక్రమించి వాగులు, గోదావరిన దిని అడ్డంగా తోడేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పగటి పూట కూలీలతో ఇసుక తవ్వకాలు సాగిస్తున్న అక్రమార్కులు రాత్రి సమయంలో నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయిన్ పెట్టి ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. చెన్నూర్‌లో ఇసుక లారీకి రూ.12 వేలు పలుకుతుండగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ పట్టణంలో లారీ ఇసుకకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు పలుకుతుంది. రెండు క్వారీల నుంచి రోజుకు 200పైగా లారీల ఇసుక రవాణ జరుగుతుంది. ఈ లెక్కన రోజు రూ.2 కోట్ల ఇసుక తరలుతోంది. ఇదే విధంగా మరో ఎడాది ఇసుక రవాణా సాగినట్లయితే చెన్నూర్ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. జిల్లా అధికారులు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్న క్వారీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇసుకాసురులు
Published Fri, Nov 15 2013 4:31 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement