ఆదిలాబాద్ : ఆయన ఓ బడా ఇసుక కాంట్రాక్టర్. గోదావరి నదిని అడ్డంగా తవ్వేసి సహజ సిద్ధమైన ఇసుకను తోడేసిన ‘ఘనుడు’. అక్రమ ఇసుక రవాణా ద్వారా కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలున్నాయి. ఈ ఇసుకాసురుడి అక్రమ తవ్వకాలపై ఉన్నతాధికారుల విచారణ కూడా కొనసాగుతోంది. ఈ ఇసుక కాంట్రాక్టర్ ఇప్పుడు అధికార టీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఆ పార్టీలో చిచ్చు రేపుతోంది. ముఖ్య నేతల మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలను మరింత రగిలిస్తోంది. ఈ అక్రమార్కుడి చేరిక వ్యవహారం ఏకంగా ఆ పార్టీ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మధ్య విభేదాలకు దారితీసేలా తయారైందనే చర్చ టీఆర్‌ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
చెన్నూరు నియోజకవర్గానికి చెందిన ఈ బడా ఇసుక కాంట్రాక్టర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నినాళ్లు ఆ పార్టీలోని కీలకంగా చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేంసాగర్‌రావు అనుచరిడినంటూ పబ్బం గడిపారు. ఈ ఆరోపణలున్న ఈ కాంట్రాక్టర్‌ను పార్టీలో చేర్చుకోవద్దని టీఆర్‌ఎస్‌లోని ఓ వర్గం నాయకులు వ్యతిరేకించారు. ఈ చేరిక ప్రజల్లో తప్పుడు సంకేతాలకు దారి తీస్తుందని కూడా హెచ్చరించారు. కానీ.. మరోవర్గం ప్రోద్బలంతో చేరిక జరిగిపోవడంతో ఆ మండలంలోని ద్వితీయ శ్రేణి నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఆయన చేరితే తాము పార్టీకి రాజీనామా చేస్తామని ఈ ద్వితీయ శ్రేణి నేతలు ముఖ్యనేతలకు మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించిన నేపథ్యంలో అన్ని వర్గాల వారు పార్టీలోకి వస్తారని మరోవర్గం పేర్కొంటోంది.
కాగా.. వరుస ఎన్నికల్లో జిల్లాలో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్ ఇప్పుడు సంస్థాగతంగా బలోపేతంపై దృష్టి సారించింది. ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేర్చుకుని జిల్లాలోని అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. వ్యూహాత్మకంగా పావులు కదిపి కాంగ్రెస్ ఖాతాలో ఉన్న డీసీసీబీ, డీసీఎంఎస్‌లపై కూడా గులాబి జెండాను ఎగురవేసింది. ఇప్పుడు కీలకమైన ద్వితీయ శ్రేణి నేతలను కూడా పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీని క్షేత్ర స్థాయిలో కూడా మరింత బలోపేతం చేసే దిశగా జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఈ చేరిక అంశం పార్టీలో అంతర్గతంగా వివాదానికి దారితీసింది. అయితే విబేధాల విషయంలో ముఖ్యనేతలు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తమకు ఎవరితో ఎలాంటి విబేధాలు లేవని చెప్పుకొస్తుండటం గమనార్హం.
టీఆర్‌ఎస్‌లో ఇసుకాసురుడి చిచ్చు
Published Sun, Jan 11 2015 8:45 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement