పెన్‌గంగను తోడేస్తున్నారు..  | Sand Mafia At penganga River In Adilabad | Sakshi
Sakshi News home page

పెన్‌గంగను తోడేస్తున్నారు.. 

Published Thu, Aug 22 2019 9:48 AM | Last Updated on Thu, Aug 22 2019 9:48 AM

Sand Mafia At penganga River In Adilabad - Sakshi

సాక్షి, తాంసి(ఆదిలాబాద్‌) : ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అనే చందంగా తయారైంది. ఇసుకను అక్రమంగా తరలిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు ఆ వైపుగా చూడకపోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తూ కుబేరులుగా అవతారమెత్తుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ పెన్‌గంగాను తోడేయం మానడం లేదు. రోజుకు 50 ట్రాక్టర్‌ ట్రిప్పులను తరలిస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

నిత్యం రవాణా...
భీంపూర్‌ మండలంలోని తాంసి(కె) వద్ద పెన్‌గంగా నదిలో నుంచి నిత్యం పదుల సంఖ్యల్లో ట్రాక్టర్‌లలో ఇసుకను తరలిస్తున్నా సంబంధిత అధి కారులు పట్టించుకోకపోవడంతో ఇష్టానుసారంగా ట్రాక్టర్ల ద్వారా పెన్‌గంగా నది నుంచి ఇసుకను తోడేస్తున్నారు. తాంసి (కె) సమీపంలో పె న్‌గంగా నది నుంచి నిత్యం పిప్పల్‌కోటి గ్రా మం మీదుగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాలోని వివిధ గ్రామాలకు ట్రాక్టర్‌లలో పరిమితికి మించి ఇసుకను తరలిస్తున్నారు. 

యథేచ్ఛగా వ్యాపారం...
ఇసుక రవాణాను అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరించడంతో అక్రమ వ్యాపారులు జోరుగా ఇసుక తరలిస్తూ నిల్వ చేసుకుంటున్నారు. పెన్‌గంగా నదితీరం నుంచి గంగాపై భాగంలో ఇసుకను రవాణా చేసే వ్యాపారులు ఇసుక డంప్పులను ఏర్పాటు చేసి ఇసుకను నిల్వ చేసుకుంటున్నారు. పెన్‌గంగా నది నుంచి నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్‌లలో ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు ఇసుక కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వర్షాకాలం పెన్‌గంగా నదిలోకి వరదనీరు చేరితే ఇసుక తీసే అవకాశం ఉండది. ప్రస్తుతం గంగలో నుంచి కూలీల ద్వారా ఇసుకను తీసుకువచ్చి గంగనది తీరంలో మైదాన ప్రాంతంలో డంప్పులను ఏర్పాటు చేస్తున్నారు.

ఇసుక రవాణా ఇలా....
భీంపూర్‌ మండలంలోని అంతర్గాం, వడూర్, తాంసి(కె) గ్రామాల పరిహక ప్రాంతాల నుంచి పెన్‌గంగా నది ప్రవహిస్తుంది. వడూర్, అంతర్గాం గ్రామాల సమీపంలో ప్రస్తుతం వరదనీరు గంగలోకి రావడంతో ఇసుక తీసే వీలులేక ప్రస్తుతం తాంసి(కె) నుంచి పిప్పల్‌కోటి మీదుగా కప్పర్ల, బండల్‌నాగాపూర్, పొచ్చేర, లేకపోతే సావర్గాం, జంధాపూర్‌ గ్రామాల మీదుగా జిల్లా కేంద్రానికి ఇసుకను తరలిస్తున్నారు. తాంసి(కె) వద్ద గంగాలోని ఇసుక బాగుండడంతో భారీ రేటు కూడా పలుకడంతో ట్రాక్టర్‌ల యాజమానులు, వ్యాపారులు పెన్‌గంగ నది నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. రోజుకు ట్రాక్టర్‌ ద్వారా ఒక్కొ ట్రాక్టర్‌ ద్వారా రెండు ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ ట్రింపు ఇసుకను రూ.3వేలకు విక్రయిస్తున్నారు. ఇలా నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

కాసులు కురిపిస్తున్న ఇసుక దందా...
ఇసుకకు ప్రస్తుతం డిమాండ్‌ పెరగడంతో వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. గ్రామాలలోని ప్రతి ఒక్కరూ ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి ఇసుక దందాను ఎంచుకుంటున్నారు. ఎటువంటి డబ్బులు చెల్లించకుండా ఇసుకను తోడుకుని అమ్ముకోవడంతో వ్యాపారులకు కాసుల వర్షం కురుస్తుంది. గ్రామాలలో స్థానికంగా ఉన్న చిన్నచిన్న అవసరాల మేరకు ఇసుకను వాడుకునేందుకు ఇచ్చిన అవకాశాన్ని దర్వినియోగం చేస్తూ కాంట్రాక్టర్‌లకు, ఇతర అవసరాలకు ఇసుకను రవాణా చేస్తూ కాసులు సంపాదించుకుంటున్నారు. 

కొరవడిన అధికారుల పర్యవేక్షణ
ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కోరవడడంతో ఇసుకు పెన్‌గంగా నది నుంచి యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇసుక తరలిస్తూ ట్రాక్టర్‌లు పట్టుబడితే నామమాత్రంగా జరిమానా విధిస్తూ చూసిచూడనట్లు వ్యవహరించడంతో ఇసుక వ్యాపారులు తమ పంథాను మార్చుకోకుండా ఇసుకను తరలిస్తున్నారు. 

కఠిన చర్యలు తీసుకుంటాం
మండలంలోని తాంసి(కె) గ్రామం సమీ పంలో పెన్‌గంగా నది నుంచి వ్యాపారులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చింది. ఇప్పటికే ఇసుక తరలి స్తున్న ట్రాక్టర్‌లను పట్టుకుని జరిమానా వి ధించడం జరిగింది. పెన్‌గంగ నుంచి ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా రవాణా చే స్తే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్‌ చేస్తాం.  
– మల్లేష్, భీంపూర్‌ తహసీల్దార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement